సోమవారం 25 జనవరి 2021
Nirmal - May 26, 2020 , 23:57:34

అభివృద్ధికి పంచదారులు

అభివృద్ధికి పంచదారులు

ఆదర్శ పంచాయతీలకు ఈ ఐదే కీలకం

త్వరగా పూర్తిచేస్తేనే సత్ఫలితాలు

పల్లెల రూపురేఖల్లో గణనీయ మార్పు 

పల్లెప్రగతి... గ్రామీణ ప్రాంతాల్లో  రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. దీని ద్వారా శ్రీకారం చుట్టిన ఐదింటిని సకాలంలో పూర్తి చేస్తే ఆ పల్లెలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలవడం ఖాయంగా కనిపిస్తున్నది. వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, నర్సరీల నిర్వహణ, కంపోస్ట్‌ షెడ్‌, ట్రాక్టర్ల వినియోగం సక్రమంగా ఉంటే, పల్లె రూపురేఖలు మారి ప్రగతికి నాంది పడనుంది.              - కోటపల్లి

కోటపల్లి: ప్రతి పల్లెలో సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె ప్రగతిని చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలో ఐదింటిని తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని సక్రమంగా, సకాలంలో పూర్తి చేస్తే పల్లెల్లో గణనీయ మార్పు సాధ్యమవుతుందని పేర్కొంది. గ్రామాల్లో ముఖ్యంగా వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, కంపోస్ట్‌ షెడ్‌, చెత్తను తరలించేందుకు, నీటిని అం దించేందుకు ట్రాక్టర్ల వినియోగంతో పల్లె రూపురేఖలు మార్చడంలో కీలకం కానున్నాయి. వీటితో పాటు అదనంగా ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తు తం పల్లెల్లో ఈ పనులు జోరుగా సాగుతుండగా, సర్పంచ్‌లు పనుల్లో మరింత వేగం పెంచితే పంచాయతీలు ప్రగతికి సూచికలుగా మారనున్నాయి

డంపింగ్‌యార్డు

చెత్త నుంచి సేంద్రియ ఎరువుల తయారీ కోసం ప్రతి పంచాయతీలో డంపింగ్‌ యార్డు నిర్మాణాన్ని చేపట్టారు. పల్లెల్లో జమ చేసిన చెత్తను తీసుకువచ్చి అందులో నుంచి మళ్లీ వాడేందుకు ఉన్న వస్తువులను వేరు చేసి చెత్తను డంపింగ్‌ యార్డులో నిల్వ చేస్తారు. డంపింగ్‌ యార్డు నిర్మాణం కోసం 25 మీటర్ల పొడువు, 15 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో గొయ్యిని తవ్వుతారు. ఇందులోకి చెత్తబండ్లు వెళ్లి రావడానికి నిర్మాణాలు చేపడుతారు. చెత్తను తీసుకువచ్చి డంపింగ్‌ యార్డులో వేసి మట్టితో పూడ్చి సేంద్రియ ఎరువును తయారు చేస్తారు. ఇలా చెత్త నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు డంపింగ్‌ యార్డులు దోహదపడతాయి

కంపోస్ట్‌ షెడ్‌

ప్రస్తుతం గ్రామాల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉంటోంది. ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌, గాజు ఇతర వస్తువులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామపంచాయతీకి ఒక కంపోస్ట్‌ షెడ్‌ నిర్మించినట్లయితే, గ్రామంలో సేకరించిన చెత్తను తీసుకువచ్చి ఇందులోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు, గాజు సీసాలు, ఇనుము ఇతర పనికి రాని వస్తువులు తీసివేసి కంపోస్టు షెడ్‌లో ఏర్పాటు చేసిన అరలలో వేయాలి. ఇలా చేయడం వల్ల భూమిలో కరిగిపోని, హానికరమైన వస్తువులను వేరు చేయడంతో పాటు ఈ వస్తువులను బయట విక్రయించి పంచాయతీకి ఆదాయం తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రతి పంచాయతీలో 30 ఫీట్ల పొడువు, 23 ఫీట్ల వెడల్పుతో రేకుల షెడ్డును నిర్మించి ఇందులో ఆరు అరలను ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాణం పూర్తి కానుంది.

నర్సరీలు, మొక్కల సంరక్షణ

ప్రతి పంచాయతీని పచ్చదనంతో మెరిపించేందుకు ఈ కార్యక్రమం చాలా కీలకం. నర్సరీలు అందుబాటులో లేకపోవడం, ప్రజలు నాటాలి అనుకునే మొక్కలు అందుబాటులో లేకపోవడంతో, ప్రతి గ్రామపంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాలు కురిసేనాటికి మొక్కలు అందుబాటులోకి వచ్చేలా ఎనిమిది నెలల ముందుగానే కార్యాచరణను రూపొందించారు. నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి పంచాయతీలో రోడ్డుకు ఇరువైపులా, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నాటిన ప్రతి మొక్కకూ ట్రీ గార్డును ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి శుక్రవారం నీరు అందిస్తున్నారు.

ట్రాక్టర్‌తో ప్రయోజనాలు

పంచాయతీల్లో చెత్తను తరలించడం, పిచ్చి మొ క్కల తొలిగింపు, ట్యాంకర్ల ద్వారా నీటిని పోసేందుకు ప్రస్తుత తరుణంలో ట్రాక్టర్ల అవసరం ఏర్పడింది. ట్రాక్టర్‌ను కిరాయికి తీసుకోవడం పంచాయతీలకు అదనపు భారంగా మారింది. దీంతో పంచాయతీ నిధుల నుంచి ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. పంచాయతీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన ట్రాక్టర్ల సహాయంతో తడి, పొడి చెత్తను తరలించడంతో పాటు  మొక్కలకు నీటిని అందించనున్నారు.

పల్లెల్లో ఒక వ్యక్తి మరణిస్తే అంత్యక్రియలు పూర్తిచేయాలంటే అడవులు, పొలాలకు వెళ్లాల్సి ఉండేది. పలు గ్రామాల్లో ఇందుకు సరైన స్థలం లేకపోవడంతో చివరి మజిలీని కూడా చాలా ఇబ్బందులు పడుతూ పూర్తి చేయాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరికి ఒక వైకుంఠధామం నిర్మించాలని నిర్ణయించింది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా వైకుంఠధామం నిర్మాణానికి పూనుకున్నది. వైకుంఠధామాల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు లేనిచోట దాతల నుంచి స్థల సేకరణ చేయగా, దాతలు ముందుకు రానిచోట పంచాయతీ నిధుల నుంచి భూమిని కొనుగోలు చేసి నిర్మాణాలను ప్రారంభించారు. పంచాయతీల్లో చిన్న చిన్న భూసమస్యలు ఉన్నా, అధికారులు ముందుండి సమస్యలను పరిష్కరించి వైకుంఠధామాల నిర్మాణాల్లో వేగం పెంచారు. 

పనుల పూర్తికి చర్యలు

‘పల్లెప్రగతి’లో భాగంగా ప్రతి గ్రామంలో పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని గ్రామపంచాయతీలను ఎప్పటికప్పుడు సందర్శించడంతో పాటు వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, కంపోస్టుషెడ్‌, ట్రాక్టర్ల వినియోగంతో పాటు అదనంగా ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల నిర్మాణాలను పూర్తి చేయాలని చెబుతున్నాం. స్థల సేకరణలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టగా అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల సహకారంతో త్వరలోనే వీటిని పూర్తి చేయనున్నాం. 

 - శేషాద్రి, డీఆర్డీవో, మంచిర్యాల


logo