సోమవారం 18 జనవరి 2021
Nirmal - May 26, 2020 , 23:57:36

పాత పద్ధతులతో ప్రయోజనాలనేకం

పాత పద్ధతులతో ప్రయోజనాలనేకం

రాజీలేని సూత్రాలు పాటిస్తేనే ఆశించిన దిగుబడి

సేంద్రియ సాగుతో ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించి ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇష్టాను సారంగా ఎరువులు, క్రిమి సంహారక మందులు వేయడం వల్ల భూసారం కోల్పోయి పంటలు చేతికి రాక పోగా రైతులు నష్టాల పాలవుతున్నారని, పాత పద్ధతులను పాటిస్తేనే అనేక ప్రయోజనాలున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సలహాలు, సూచనలు అందిస్తున్నారు.

సామూహిక మంటలు..

వేసవి దుక్కిలో నుంచి తప్పించుకున్న కోశస్థ దశలో ఉన్న పురుగు రెక్కల దశలోకి మారుతుంది. దీనిని నివారించడానికి చేలల్లో సామూహిక మంటలు వేసినట్లయితే ఆ పురుగు మంటల్లో పడి చనిపోతుంది. దీనివల్ల పంటలకు పురుగుల బెడద ఉండదు. 

కాలి బాటలు..

వరిలో కాలిబాటలు తూర్పు, పడమరలో తీయాలి. ప్రతి నాలుగు నుంచి ఐదు ఫీట్లకు ఒక్క కాలి బాట తీయాలి. దీనివల్ల మొక్కలకు సూర్యరశ్మి సమానంగా అందుతుంది. వరిలో అధికంగా వచ్చే దోమ పోటును నివారిస్తుంది. గాలిలోని రైజోబియంను, నత్రజనిని మొక్కలకు సమానంగా అందిస్తుంది. కాలిబాటల ద్వారా ఎరువు వేస్తే అన్ని మొక్కలకు సమానంగా అందుతుంది. దీంతోపాటు మొక్కల్లో ఎదుగుదల శక్తి అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి తాకి గింజ తాలు కాకుండా చేస్తుంది. 

ఎరపంటలు..

ప్రధాన పంటలను పురుగుల నుంచి కాపాడుకోవడానికి అక్కడక్కడా పంటలో ఆముదం, బంతి మొక్కలను నాటాలి. శనగపచ్చ పరుగు, పొగాకు లద్దె పరుగులలాంటివి నివారించవచ్చు. ఎర బుట్టలు, లింగాకర్శక బుట్టలను ఏర్పాటు చేస్తే రెక్కల పురుగుల ఉధృతిని తెలుసుకొని వాటిని నివారించుకోచ్చు. ఈ విధానం వల్ల పురుగుల నుంచి రక్షించుకోవడమేగాకుండా బంతి, ఆముదం వల్ల అదనపు లాభం పొందవచ్చు

సేంద్రియ ఎరువులనే వాడాలి..

నేలలో భూసారం పెరగడానికి సేంద్రియ ఎరువులు వాడాలి. పశువులు, మేకల ఎరువు, కోళ్ల పెంట, కంపోస్టు ఎరువులు వేసుకోవాలి. వీటితో పాటు పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా వినియోగించాలి. జీలుగ, పిల్లి పెసర, అల్చంత దాలాంటివి వాడితే నేల స్వభావం మారిపో యి మొక్కలకు అనుకున్నంత నత్రజని అందు తుంది. ప్రతి రైతు తన పొలంలో చెరువు పూడిక మట్టిని తప్పకుండా పోసుకోవాలి. దీని వల్ల నేలలో సారం పెరిగి మొక్కలకు ఖనిజ లవణాలు అందుతాయి.

పుసుపు, తెలుపు పల్లాలు..

పత్తి, మిరప, వరి పంటలను అధికంగా ఆశించే తెల్లదోమ, తామర పురుగుల నివారణకు పంటలో ఎకరాన పది నుంచి పదిహేను పసుపు, తెలుపు పల్లాలను ఏర్పాటు చేయాలి. పసుపు ప్లేటు తెల్ల దోమను నివారిస్తుంది. తెలుపు ప్లేటు తామర పురుగును, మిర్చిలో పై ముడతను, ఎర్రనల్లిని నివారిస్తుంది. ప్రతి వారం ప్లేట్లకు ఆముదంగాని, తెల్లని గ్రీసుగాని పూయాలి. ప్లేట్లకు దోమలు అతికి చనిపోతాయి. 

వేసవి దుక్కులు..

వేసవి దుక్కులతో అన్నదాతలకు అనేక ప్రయోజనాలు న్నాయి. వేసవి దుక్కులతో నేల గుల్లబారి వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకుతుంది. భూమి మెత్తగా తయారవుతుంది. తద్వారా ప్రతి వర్షపు చుక్క సద్వినియోగం అవుతుంది. ఏప్రిల్‌, మే నెలలో ఎండలు అధికంగా ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా చేనులో లోతుగా దున్నాలి. దీంతో నేలలో దాగి ఉన్న పురుగులు నేల పై భాగానికి వస్తాయి. కొంగలు, కాకులు తదితర పక్షులు వాటిని ఏరుకుని తింటాయి. వరి దుబ్బల్లో దాగి ఉన్న ఉల్లికోడు, పీక పురుగులు కోశస్థ దశలోనే చాలా వరకు చనిపోతాయి. వేసవి దుక్కి వల్ల నేలలో గాలి శాతం పెరగడంతో సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధి చెందుతుంది.

అంతర పంటలు..

అంతర పంటలుగా అపరాలైన కంది, పెసర, మినుము, సోయా, చిక్కుడు, వేరుశనగా పంటలు వేసుకుంటే రైతులకు మేలు జరుగుతుంది. ప్రధాన పంటలు నష్టపరిస్తే అంతర పంటలు రైతుకు మేలు చేస్తాయి. పెట్టిన పెట్టుబడిని తీసుకువస్తాయి. పత్తిలో కంది, సోయా, పెసర, కంది, మినుములాంటి అంతర పంటలు వేసుకోవాలి. అంతర పంటల సాగు వల్ల భూసారం కూడా పెరుగుతుంది. రైతుమిత్ర పురుగులు, రైజోబియాంను ఇతర పంటలకు అందిసు్ంతటాయి. పంటలను ఆశించి చీడ పీడలను అదుపు చేసి మిత్ర పురుగులు అంతర పంటలతో వృద్ధి చెందుతాయి. కలుపు మొక్కలను అదుపు చేయవచ్చు.

కొనలు తుంచుట..

వరి నాటే ముందు మొక్కల కొనలను తుంచాలి. కొనలపై కాండం తొలుచు పురుగు గ్రుడ్లు నిల్వ ఉంటాయి. నాటేసేటప్పుడు వాటి గుడ్లు కొనల నుంచి నేరుగా కాండంలోకి లార్వా ద్వారా వెళ్లి పంటను నష్ట పరుస్తుంది. కొనలు తుంచడం వల్ల మరోవైపు పీక పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులను నివారించవచ్చు.

అజొల్లా..

అజొల్లా దీనిని వరి నాటు కంటే ముందే నారుమడిలో వేసుకోవాలి. ఇది గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. నీటి ఎద్దడిలో మొక్కకు తేమ శాతం తగ్గకుండా చేస్తుంది. కలుపు నివారణ తగ్గుతుంది. 20 శాతం యూరియాను అందిస్తుంది. పశువుల దాణాగా కూడా పొలం నుంచి తీసి వాడుకోవచ్చు.

దీపపు ఎరలు.

పంటను ఆశించే పచ్చ దోమను నివారించేందుకు రాత్రి వేళ దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. రాత్రివేళ కాగడాలు లేక కరెంటు బల్బును వెలిగించి దాని కిం ద కిరోసిన్‌ పోసిన నీటి బకెట్లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల పచ్చ దోమ వచ్చి నీటిలో పడి చనిపోతుంది.

పక్షి స్థావరాలు..

పంటలు వేసిన 20 రోజుల నుంచి 60 రోజుల వరకు పంటలో అక్కడక్కడా పక్షులు వాలేందుకు వీలుగా కర్రలను ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిపై పక్షులు వాలి పంటను ఆశిస్తున్న పురుగులను తింటాయి.

రక్షక పంటలు..

ప్రతి పంట చుట్టూ తప్పకుండా సరిహద్దు రక్షక పంటలు వేయడం వల్ల రెక్కల పురుగులు రాకుండా కాపాడుకోవచ్చు. దాంతోపాటు అదనపు పంటగా తీసుకోవచ్చు. కంది, సజ్జలు, జొన్న, మక్క విత్తుకోవాలి. ఇవి మిత్ర పురుగుల అభివృద్ధికి తోడ్పడుతాయి. మిరపలో జొన్న, మక్క 2-3 సాల్లు కంచె పంటగా వేసుకోవాలి. దీని వల్ల పేను బంక, తెగుల్ల తాకిడి తగ్గుతుంది. మక్క చుట్టూ కుసుమ పంటను 3-5 వరుసల్లో వేసుకుంటే అడవి పందుల నుంచి పంటలను రక్షించుకోవచ్చు.

విత్తన శుద్ధి..

రైతులు పంటలు వేసే ముందు మేలు రకం విత్తనాలను ఎంచుకోవాలి. తెగుళ్లు రాకుండా విత్తనాలను తప్పకుండా శుద్ధి చేయాలి. దీనివల్ల కంటికి కనబడని సూక్ష్మ కీటకాలను నివారించవచ్చు. విత్తనాలు తీసుకునే ముందు మొలక శాతాన్ని గుర్తుంచుకోవాలి.