శనివారం 11 జూలై 2020
Nirmal - May 24, 2020 , 23:48:58

నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

 నేడు ఈద్‌-ఉల్‌-ఫితర్‌

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాదాసీదాగా రంజాన్‌ వేడుకలు

దండేపల్లి : ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్‌. రంజాన్‌ మాసం ఆదివారంతో ముగిసింది. షవ్వాల్‌ మాసంలోని మొదటి రోజు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ జరుపుకుంటారు. ఆదివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో సోమవారం పండుగ జరుపుకోవాలని మత గురువులు ప్రకటించారు. యేటా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల కోసం భారీగా ఏర్పాట్లు చేయగా, ఈ సారి కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారే ప్రార్థనలు జరుపుకోవాలని అధికారులు, మత పెద్దలు సూచించారు.

రంజాన్‌ అంటే..

మత సామరస్యానికి, భక్తి భావానికి ప్రఖ్యాతి గాంచి న విశిష్టమైన పర్వదినం రంజాన్‌. శుభప్రదమైన ఈ మాసానికి స్వాగతం పలకడానికి షాబాన్‌ మాసం నుంచే సిద్ధంగా ఉంటారు. చంద్ర దర్శనాన్ని బట్టి ఈ మాసం 29 లేక 30 రోజులు ఉంటుంది. అరబిక్‌ భాషలో ‘రమ్జ్‌' అంటే కాలడం అని అర్థం. ఈ మాసంలో నెల రోజుల ఉపవాసదీక్షలో శరీరాన్ని శుష్కింపచేయడం ద్వారా ఆత్మప్రక్షాలన జరుగుతుందని నమ్మకం. తద్వారా సర్వ పాపాలు సమసిపోతాయి. అరిషఢ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉంచబడి మనో నిగ్రహం ఏర్పడుతుంది. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఆచరిస్తారు. ఉదయాన్నే అన్న..పానాదులు సేవించడాన్ని సహర్‌ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయడాన్ని ఇఫ్తార్‌ అంటారు. మానవుడిలో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం మొదలైన ఉత్తమ గుణాలు అలవాటు చేసేందుకు సర్వశక్తి, సర్వవ్యాప్తి, సర్వసాక్షి అయిన అల్లాహ్‌ రంజాన్‌ మాసాన్ని ప్రసాదించాడని ముస్లింలు విశ్వసిస్తారు.

జకాత్‌ అంటే..

ఇస్లాం నిర్దేశించిన సిద్ధాంతాల్లో జకాత్‌ ఒకటి. జకాత్‌ అనగా దానం. ఇది మానవుల్లో త్యాగం, సానుభూతి, సహకారాలను పెంచుతుంది. ప్రతి ఒక్కరూ తమకున్న దానిలో అవసరమున్న వారికి అంత ఇచ్చి ఆదుకోవాలి. బంగారం, వెండి, రొక్కం, పంట, వ్యాపారం కోసం నిర్దేశించబడిన సరుకులు విధిగా దానం చేయాల్సి ఉంటుం ది.నిరుపేదలు సైతం ఆనందోత్సవాలతో పండుగ జరుపుకోవాలన్నదే జకాత్‌, ఫిత్రాల ముఖ్య ఉద్దేశం.

ఫిత్రా దానం..

షవ్వాల్‌ నెల మొదటి తేదీ.. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ పండుగ నాడు ప్రత్యేక ప్రార్థనలకు ముందు పేదలకు ఇచ్చే దానమే ఫిత్రా.అందుకే ఈ పండుగను ఈద్‌-ఉల్‌-ఫితర్‌ అంటారు. షరియత్‌ పరిభాషలో ఫిత్రా అంటే ఉపవాసాల పాటింపులో మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పొరపాట్లు, లోపాలు జరుగుతూనే ఉంటాయి.ఈ లోపాల పరిహరార్థం చేసేదే ఫిత్రా దానం. పావు తక్కువ రెండు సేర్ల గోధుమలు తూకానికి సరిపడా పైకాన్ని కడు నిరుపేదలకు దైవం పేరిట ప్రతి ముస్లింలు దానం చేయాలి.logo