శుక్రవారం 29 మే 2020
Nirmal - May 24, 2020 , 00:10:54

అగ్గి కుర్తాంది..

అగ్గి కుర్తాంది..

ఉమ్మడి జిల్లాలో 47 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత

 వారం రోజులుగా 40 డిగ్రీలకుపైనే నమోదు 

 గంట గంటకూ నిప్పులు కక్కుతున్న భానుడు

 మిట్ట మధ్యాహ్నం కర్ఫ్యూని తలపిస్తున్న రహదారులు

 పగలు వడగాలులు.. రాత్రి ఉక్కపోత..

 బొగ్గు గనులు, ఓపెన్‌ కాస్టుల వద్ద దగడు

 సడలింపు ఇచ్చినా ఇండ్లకే పరిమితమవుతున్న జనం

 శీతల పానీయాలు, కూలర్లకు పెరిగిన గిరాకీ

 వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు

“ఈ యేడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా భానుడు విశ్వరూపం చూపుతున్నడు. గంటగంటకూ మంట పుట్టిస్తున్నడు. మిట్ట మధ్యాహ్నం అగ్గి కురుస్తున్నడు. జిల్లాను నిప్పుల కొలిమిలా మారుస్తున్నడు. సాయంత్రం ఆరేడైనా దగడు తగ్గడం లేదు. శనివారం గరిష్ఠంగా 47 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా వడగాలులు, రాత్రంగా దగడుతో జనం బెంబేలెత్తి పోతున్నరు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో గనులపై వేడి అధికంగా ఉంటోంది. శీతల పానీయాలకు, కూలర్లకు గిరాకీ పెరిగింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నరు.               

     -  నిర్మల్‌ అర్బన్‌

నిర్మల్‌ అర్బన్‌ : సూరీడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగభగ మండుతున్నాడు. ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. శనివారం గరిష్ఠంగా 46 డిగ్రీలు దాటింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు కాగా, నిర్మల్‌లో 46.3, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలో 45.9 డిగ్రీలుగా రికార్డయ్యింది. మే నెల ఆరంభం నుంచే 42,43 డిగ్రీల సెల్సియస్‌ నమోదవగా.. మే మూడో వారం నుంచి ఒక్క సారిగా 45,46,47 డిగ్రీలు నమోదువుడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు వడగాలులకు భయపడుతున్నారు. ఎండ వేడిమి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు బయటకు వెళ్లడం లేదు. అత్యవసరమైతే టోపీలు, హెల్మెట్‌లు, చేతి రుమాలు తలకు కట్టుకుని ఎండ వేడిమి నుంచి రక్షణ పొందుతున్నారు. శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, చెరుకు, పండ్ల రసాలు సేవిస్తూ సేదతీరున్నారు. కూలర్లకు, ఎయిర్‌ కండీషనర్లకు గిరాకీ పెరిగింది. పేద మధ్య తరగతి వర్గాల వారు రంజన్లను కొనుగోలు చేసేందుకు పరుగులు పెడుతున్నారు. మధ్యాహ్నం ప్రయాణాలు చేయకూడదని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, గంట గంటకు తగినంత నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో అధిక శాతం అటవీ ప్రాంతం ఉండడంతో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది.

ఓపెన్‌ కాస్టుల వద్ద అధికం

భూగర్భ గనులు, ఓపెన్‌కాస్టుల వద్ద పరిస్థితి భయంకరంగా ఉంది. సాధారణంగా సింగరేణిలో ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదువుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నమోదయ్యే టెంపరేచర్‌ కంటే ఒకటి, రెండు డిగ్రీలు కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో ఎక్కువగా నమోదు అవుతుండటం సాధారణం. కార్మికులు డ్యూటీలకు వెళ్లాంటేనే జంకుతున్నారు. రెండో షిఫ్టు విధులకు వెళ్లేందుకు, మొదటి షిఫ్టు విధులు ముగించుకుని వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టుల వద్ద కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నది. కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా 60 రోజులుగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. కొద్దిరోజుల దశలవారీగా సడలింపులు ఇచ్చినా తీవ్రమైన ఎండలకు భయపడి బయటి వచ్చేందుకు జంకుతున్నారు. 


logo