మంగళవారం 26 మే 2020
Nirmal - May 20, 2020 , 02:57:52

మండుటెండల్లో.. నిండుకుండల్లా..

మండుటెండల్లో.. నిండుకుండల్లా..

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం జిల్లా ప్రజలకు వరంగా మారింది. వానకాలంలో నీటి గుంతలుగా కనిపించే చెరువులకు సర్కారు మరమ్మతులు చేపట్టడంతో ఎండాకాలంలోనూ నిండు కుండలను తలపిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 452 చెరువులు ఉండగా, ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక ఆనవాళ్లు కోల్పోయాయి. రైతులకు సాగునీరు అందించేందుకు సర్కారు చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకంతో ఈ చెరువులు మళ్లీ కొత్త వైభవం సంతరించుకున్నాయి. జిల్లాలో నాలుగు విడతల్లో 214 చెరువులకుమరమ్మతులు చేయగా, 32, 500 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. గ్రామాల్లో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా చేపల పెంపకంతో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతోంది.

నాడు అధ్వానంగా.. నేడు నిండుగా..

జిల్లాలో ప్రాజెక్టులు తక్కువగా ఉండడంతో రైతులు వానకాలంలో ఎక్కువ పంటలు పండిస్తారు. వర్షాలు సకాలంలో పడితే ఆ సంవత్సరం కాలం కలిసివస్తుంది. లేకపోతే పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లాలో చెరువులు ఉన్నా నిర్వహణ లేక అధ్వానంగా మారిన తరుణంలో ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకం ప్రవేశపెట్టడం రైతులకు కలిసివచ్చింది. ఫలితంగా జిల్లాలోని చెరువులకు మరమ్మతులు చేపట్టడంతో నాలుగేళ్లుగా జలకళ సంతరించుకున్నాయి. ఎండాకాలంలోనూ నిండుకుండలను తలపిస్తున్నాయి. మొదటి విడతలో రూ.6213.42 లక్షలతో 103 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. రెండో విడతలో భాగంగా రూ. 2575 లక్షలతో 72 చెరువులను పునరుద్ధరించారు. మూడో విడతలో రూ.2730.64 లక్షలతో 22 చెరువులకు మరమ్మతులు చేపట్టగా, 20 చెరువుల పనులు పూర్తయ్యాయి. రెండు చెరువుల పనులు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. జిల్లాలో మూడు విడతలుగా చెరువుల మరమ్మతులు చేపట్టిన అధికారులు నాలుగో విడతలో కొత్త చెరువుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం జిల్లాలో 21 కొత్త చెరువులను మంజూరు చేయగా అధికారులు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేశారు. ఈ విడతలో 19 చెరువులకు మరమ్మతులు పూర్తయ్యాయి.

32,500 ఎకరాలకు ఆయకట్టుకు నీరు

మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నాలుగు విడతల్లో చేపట్టిన చెరువుల మరమ్మతుల కారణంగా 32,500 ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వచ్చింది. గతంలో చెరువులు ఉన్నా పంటలు సాగుచేసుకోని పరిస్థితిల్లో రైతులు వానాకాలంలో పత్తి, కంది, సోయాబిన్‌, యాసంగిలో శనగ, గోధుమ, జొన్న పంటలకు నీరు అందిస్తున్నారు. పుష్కలంగా నీరు ఉండడంతో చేపల పెంపకం మొదలుపెట్టారు. గతేడాది వానకాలంలో జిల్లాలోని 153 చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. దీంతో మత్య్సకారులకు ఉపాధి దొరుకుతోంది. ఇలా చెరువుల్లో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉండడంతో భూగర్భజలాలు కూడా పెరిగాయి. ఫలితంగా ఎండాకాలంలో తాగునీటికి ఇబ్బందులు తప్పడమే కాకుండా పశువుల దాహం కూడా తీరుతోంది.

ఇప్పుడు రెండు పంటలు వేస్తున్నా..

నాకు గూడెంలో ఐదు ఎకరాల భూమి ఉంది. చెరువు ఉన్నా ఇంతకు ముందు ఏం ఫాయిదా లేకుండె. సర్కారు ఇక్కడున్న చెరువుకు మూడేళ్ల కింద పూడిక తీసి, కట్ట ఎత్తు పెంచింది. కాల్వలను కూడా మంచిగ చేసిన్రు. ఆనాకాలంలో చెరువు ఫుల్‌గా కనిపిస్తాంది. నాతో పాటు మా గూడెంలో రెండు పంటలు ఏస్తున్నరు. నేను ఇంతకు ముందు ఆనాకాలం పంట ఏశెటోన్ని. చెరువుల నీళ్లు ఉండుట్ల యాసంగి పంట కూడా ఏస్తున్న. మిషన్‌ కాకతీయతోటి రైతులకు లాభమైంది.


logo