శనివారం 06 జూన్ 2020
Nirmal - May 20, 2020 , 02:57:49

కిలకిల.. కళకళ..

కిలకిల.. కళకళ..

ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్‌ అభయారణ్యం, కాగజ్‌నగర్‌ టైగర్‌జోన్‌ ప్రాంతం వలస పక్షులకు ఆశ్రయమిస్తున్నది. ఏటా శీతా కాలంలో వివిధ దేశాల నుంచి బార్‌ హెడెడ్‌గూస్‌, గ్రే హెడాన్‌, రేర్‌ రెడ్‌, క్రెస్టెడ్‌ పొచార్డ్‌, అముర్‌ ఫాల్కన్‌, మైగ్రేటెడ్‌ డక్స్‌, ఎల్లోఫుటెడ్‌ గ్రీన్‌పిగోన్‌, ఇరోషియన్‌ హబ్బీ, బ్లూత్రోట్‌, రెడ్‌ క్రెస్టెడ్‌, బ్రహ్మిణ్‌డక్స్‌లాంటి రక రకాల పక్షులు వేల మైళ్లు ప్రయాణించి ఇక్కడికి వస్తాయి. అడవుల్లో అనువైన వాతావరణం ఉన్న చోట ఆవాసం ఏర్పర్చుకొని కొన్ని నెలల పాటు ఉండి తిరిగి వెళ్తాయి. కవ్వాల్‌లోని గనిశెట్టికుంట, బేసన్‌కుంట, కిష్టాపూర్‌ చెరువు, కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని కోసిని రిజర్వాయర్‌తో పాటు బెజ్జూరు, పెంచికల్‌పేట్‌లోని పాలరాపు గుట్ట తదితర ప్రాంతాల్లో వలస పక్షులు కనువిందు చేస్తున్నాయి. వాగులు, సెలయేళ్లు, చెరువులు, కుంటల వద్ద వాలుతూ కిలకిల రావాలతో సందడి చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా బర్డ్‌వాక్‌ ఫెస్టివల్‌ నిర్వహించగా, 150 మందికిపైగా పక్షి ప్రేమికులు, ప్రెఫెషనల్‌ ఫొటో గ్రాఫర్లు, ఫొటో గ్రాడ్యుయేట్లు తరలివచ్చి.. దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షులను తమ కెమెరాల్లో బంధించారు. అటవీప్రాంతంలో కలియదిరుగుతూ అరుదైన జాతులను గుర్తించారు. జిల్లాలో సుమారు 280 రకాల పక్షి జాతులు ఉన్నాయని, ఈ చోటును జటాయు ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు కూడా పంపించారు.  

బార్‌హెడెడ్‌ గూస్‌

ఇది 71-76 సెం.మీ పొడవు ఉంటుంది. టిబెట్‌, కజకిస్తాన్‌, మంగోలియా నుంచి హిమాలయాల మీదుగా ఇక్కడి వస్తుంది. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు ఉంటుంది. అత్యంత ఎత్తైన ప్రదేశాల మీదుగా ప్రయాణించడం దీని ప్రత్యేకత. మధ్య ఆసియా పర్వత సరస్సులు, దక్షిణ ఆసియా పర్వత శిఖరాల్లో నివసిస్తుంది. ఒకేసారి మూడు నుంచి 8 గుడ్లు పెడుతుంది.

బ్రహ్మిణ్‌ డక్స్‌

ఈ పక్షి ఆఫ్రికా నుంచి శీతాకాలంలో భారతదేశానికి వస్తుంది. కాశ్మీర్‌లోని ఎత్తైన సరస్సుల వద్ద సంతానోత్పత్తిని పెంచుకుంటుంది. పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూరు చెరువులో ఇవి కనిపిస్తాయి. ఈ పక్షి ప్రవాహాలు, నిదానమైన నదులు, చెరువులు, వరదలున్న గడ్డిభూములు, చిత్తడి నేలలు, ఉప్పునీటి మడుగుల వద్ద ఉండేందుకు ఇష్టపడుతుంది. 


logo