బుధవారం 27 జనవరి 2021
Nirmal - May 09, 2020 , 01:49:37

జూన్‌ 20లోగా నాట్లు వేయాలి

జూన్‌ 20లోగా నాట్లు వేయాలి

  • రోహిణి కార్తెలోనే తుకాలు పోయాలి
  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రైతులు రోహిణికార్తెలో తుకాలు పోసి జూన్‌ 20లోగా నాట్లు వేస్తే మంచి దిగుబడి వస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌ పట్టణంలోని గాజులపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మా ట్లాడుతూ.. రైతులు సకాలంలో తుకాలు పోసి నా ట్లు వేస్తే ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు.  రైతులు ధాన్యాన్ని తాలు లేకుండా జల్లెడ పట్టి సంచులను నింపి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.  

అభివృద్ధి పనుల పరిశీలన..

సారంగాపూర్‌ మండలం చించోలి (బి) గ్రామ శివారులో 5 ఎకరాల స్థలంలో రూ. 20కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణ పనులు, రూ. 2.10కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంద పడకల వసతి గృహం (హాస్టల్‌) పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదట మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణ పనులను నిర్మల్‌ జిల్లాలో ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం సోఫీనగర్‌ కేజీబీవీలో రూ.2.5కోట్లతో నిర్మిస్తున్న హాస్టల్‌ పనులను పరిశీలించారు. ఇంటర్‌ మూల్యాంకన కేంద్రాన్ని నిర్మల్‌ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వ కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసి యేషన్‌ నాయకులు మంత్రికి వినతిపత్రం అందించారు.


logo