ఆదివారం 24 జనవరి 2021
Nirmal - May 06, 2020 , 02:50:17

ఎఫ్‌ఆర్వో కార్యాలయంపై గ్రామస్తుల దాడి

ఎఫ్‌ఆర్వో కార్యాలయంపై గ్రామస్తుల దాడి

  • అటవీశాఖ సిబ్బంది కొట్టడంతో మేకల కాపరి మృతి

కడెం : అటవీ సిబ్బంది తీవ్రంగా కొట్టడంతో మేకల కాపరి మృతిచెందగా.. ఆగ్రహంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అటవీశాఖ రేంజ్‌ కార్యాలయంపై దాడిచేసిన ఘటన మంగళవారం నిర్మల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలోని గండిగోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన మేకల కాపరి గాదె నర్సయ్య(50) సోమవారం మేకల మందతో మిద్దెచింత అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో నర్సయ్య బీడీ కాల్చడంతో నిప్పురవ్వలుపడి అడవిలో ఆకులు అంటుకున్నాయి. నిబంధనలను ఉల్లంఘించి అడవిలో మేకలను మేపడంతో పాటు మంటలు అంటుకోవడానికి కారణమయ్యాడని అటవీ సిబ్బంది నర్సయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో పలుమార్లు చెప్పినా నర్సయ్య వినక పోవడంతో ఉడుంపూర్‌ రేంజ్‌ సిబ్బంది ఆయనను అదుపులోకి తీసుకొని చితకబాదారు. దెబ్బలు తాళలేక నర్సయ్య అపస్మారక స్థితికి చేరుకోగాక.. కుటుంబీకులు అతడిని వైద్యం కోసం ఉట్నూర్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం దవాఖానలో నర్సయ్య మృతిచెందాడు. దీంతో ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు, గండిగోపాల్‌పూర్‌ గ్రామస్తులు ఉడుంపూర్‌ అటవీ రేంజ్‌ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం తలుపులు పగులగొట్టారు. ఫర్నిచర్‌, రికార్డులు, వాహనాలను ధ్వంసం చేశారు. నర్సయ్య మృతికి కారుకులైన వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  


logo