మహారాష్ట్ర సరిహద్దున పటిష్ట నిఘా

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అను మతించడంతో ఆదిలాబాద్ జిల్లాలో అధికారులు అప్రమత్త మయ్యారు. జిల్లా మీదుగా ఇతర రాష్ర్టాల నుంచి రాకపోకలు సాగించేవారిపై దృష్టిసారించారు. మహారాష్ట్ర సరిహద్దున జైనథ్ మండలం డొల్లార వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులో పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖల సిబ్బందిని పెంచారు. రెండు రోజులుగా వాహనాల్లో ఉత్తరాది రాష్ర్టాల నుంచి జిల్లా సరిహద్దు మీదుగా దక్షిణాది రాష్ర్టాలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో అధికారులు చెక్‌పోస్టు వద్ద అదనంగా సిబ్బందిని నియమించారు. వాహనం నంబరు, కూలీల పేర్లు, సెల్‌ఫోన్ నెంబర్లు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు తదితర వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వైద్య సిబ్బంది వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు ఉంటే వారు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండేలా చేతిపై స్టాంపు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాష్ర్టాలకు చెందిన వారికి సైతం థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి వివరాలు నమోదు చేసుకుని పాసులు జారీ చేస్తున్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంతో ఆయా రాష్ర్టాల అధికారులకు సైతం ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వారి సమాచారం తెలుస్తున్నది. ఆదిలాబాద్, ఉట్నూర్ ఆర్డీవోలను ఇన్‌చార్జ్జిలుగా నియమించగా.. సిబ్బంది చెక్‌పోస్టులో 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం చెక్‌పోస్టును కలెక్టర్ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణు వారియర్ సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కాలినడకన వరంగల్ నుంచి కిన్వట్‌కు..
భైంసా, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండడంతో వలస కూలీలకు పని కరువైంది. ఆకలితో అలమటించే కన్నా.. సొంత ఊళ్లకు వెళ్లడం నయమని భావించి కాళ్లకు పనిచెబుతున్నారు. మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన కూలీలు గతంలో పనుల నిమిత్తం వరంగల్‌కు వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం పనులు దొరకక వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. వలస కూలీలు ఆదివారం భైంసా మీదుగా నడుచుకుంటూ కిన్వట్‌కు వెళ్లారు.
సాలూరా చెక్‌పోస్టు వద్ద 36 మందికి వైద్యపరీక్షలు
బోధన్ రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరా శివారులో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద హైదరాబాద్ వెళ్తున్న 36 మందిని అధికారులు ఆదివారం తనిఖీ చేసి వైద్యపరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన వీరు నెలన్నర క్రితం రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్లి లాక్‌డౌన్‌తో అక్కడే ఉండిపోయారు. అక్కడి అధికారుల అనుమతితో హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. సాలూరా చెక్‌పోస్టు వద్ద వారి వాహనాన్ని అధికారులు తనిఖీ చేసి వివరాలు సేకరించారు. అనంతరం వారికి గ్రామస్తులు భోజనం పెట్టారు. అధికారులు పాసులు అందజేసి పంపించారు. బోధన్ తహసీల్దార్ గఫార్‌మియా, వీఆర్వో శివకుమార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్‌పై అవగాహన అవసరం
- రూ.1.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఉద్యోగుల సమస్యలపై కేటీఆర్‌తో టీఆర్వీకేఎస్ నేతల భేటీ
- 100 బైక్ అంబులెన్స్‌తో ఊపిరి!
- నియమాలు పాటించాలి
- వ్యాక్సిన్ వచ్చినా జాగ్రత్తలు పాటించాలి
- శాఖల వారీగా జిల్లా ప్రగతి నివేదిక సమర్పించాలి : అదనపు కలెక్టర్
- మహిళల కంటే పురుషులే
- సిరాజ్ షాన్‌దార్
- ‘డబుల్' ఇండ్లతో పేదల కల సాకారం