శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - May 04, 2020 , 01:33:25

ఎన్పీడీసీఎల్‌కు బకాయిల భారం

ఎన్పీడీసీఎల్‌కు బకాయిల భారం

  • లాక్‌డౌన్‌తో నిలిచిన బిల్లుల చెల్లింపులు
  • రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు
  • ఆన్‌లైన్‌లో కట్టాలని కోరుతున్నఅధికారులు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ కారణంగా ఉత్తర మండల విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌)కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నెలవారీగా వసూలు కావాల్సిన విద్యుత్‌ బిల్లులకు ఆటంకం ఏర్పడడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఎన్పీడీసీఎల్‌ బిల్లుల వసూలుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నది. కష్టకాలంలో ప్రజల ఇబ్బందులను గ్రహించి ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే విధంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్లింపునకు అవకాశం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌తో బిల్లులు వసూలుకాక విద్యుత్‌ పంపిణీ సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేసినా ప్రజలు ముందుకు రావడం లేదు. దీంతో ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించేందుకు ఎన్పీడీసీఎల్‌ వెసులుబాటు కల్పించింది. గడిచిన ఏడాది మార్చి నెలలో చెల్లించిన బిల్లు మొత్తం ఇప్పుడు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకేసారి వినియోగదారులపై బిల్లుల భారం పడకుండా తదుపరి రీడింగ్‌ తీసినప్పుడు 30 రోజుల్లో వినియోగించిన యూనిట్లు లెక్కించి బిల్లుల వసూలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బిల్లుల చెల్లింపు జాప్యంతో వినియోగదారులపై అపరాధ రుసుము పడకుండా ముందస్తుగానే ఆన్‌లైన్‌, మీసేవ, పేటీఎం, ఫోన్‌పే, టీ వ్యాలెట్‌, ఎన్పీడీసీఎల్‌ యాప్‌ల ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.

రూ.కోట్లలో బకాయిలు

మార్చి నెలలో జిల్లాలో విద్యుత్‌ బకాయిలు మొత్తం సుమారు రూ.8 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.ఐదు కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా 40 శాతానికిపైగా బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఏప్రిల్‌ నెలలో రూ.10 కోట్ల మేర బిల్లులు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 15.29 శాతం మాత్రమే వసూలైంది. అంటే కేవలం రూ.1.84 కోట్లు వినియోగదారులు చెల్లించారు. ఇంకా రూ.8 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. 

పరిశ్రమలకు ఊరట

లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతపడడంతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విద్యుత్తు వినియోగించుకున్నా, వినియోగించుకోకున్నా నెలనెలా చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ రుసుములను మూడు నెలలపాటు వాయిదా వేసింది. అంటే ఏప్రిల్‌, మే నెలల ఫిక్స్‌డ్‌ చార్జీలను జూన్‌ తర్వాత నుంచి వాయిదా పద్ధతిలో వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం కల్పించింది. ఒక వేళ లాక్‌డౌన్‌ సమయంలోనే చెల్లిస్తే ఒక శాతం రాయితీ ప్రకటించింది. జిల్లాలో వ్యవసాయ, ఫార్మా సంబంధమైన పరిశ్రమలతోపాటు స్టోన్‌ క్రషర్లు, ఇతర పరిశ్రమలు అనేకం ఉన్నాయి. లాక్‌డౌన్‌తో ఫార్మా, రైస్‌మిల్లులు తప్ప మిగిలిన పరిశ్రమలేవీ పని చేయడం లేదు. వారికి ప్రభుత్వం కల్పించిన ఫిక్స్‌డ్‌ చార్జీల వాయిదా నిర్ణయం ఉపశమనం కలిగిస్తున్నది. 

ఆన్‌లైన్‌లో బిల్లులు కట్టొచ్చు 

లాక్‌డౌన్‌ కారణంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. మార్చి నెలకు సంబంధించిన బిల్లులు సగం వసూలయ్యాయి. వినియోగదారులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించాం. ఈ సేవలను ఉపయోగించుకొని బిల్లులు చెల్లించి సంస్థ మనుగడకు సహకరించాలి.

- రాజశేఖర్‌, ఎన్పీడీసీఎల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కామారెడ్డి జిల్లా