మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Apr 24, 2020 , 00:59:56

విపత్తు వేళ.. ఊరట!

విపత్తు వేళ.. ఊరట!

  • జిల్లా కేంద్ర దవాఖానలో
  • 72 మంది సిబ్బంది  డిప్యుటేషన్‌ను పొడిగించిన ప్రభుత్వం 
  • మరో ఏడాదిపాటు ఇక్కడే విధులు
  • చొరవ చూపిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వైద్యసిబ్బంది

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: కరోనా వ్యాప్తి భయాందోళనను కలిగిస్తున్న తరుణంలో జిల్లాకేంద్ర దవాఖానలో వైద్య సిబ్బందికి ఊరట లభించింది. డిప్యుటేషన్‌ గడువును మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో వైద్యసిబ్బంది డిప్యుటేషన్‌ గడువు ముగియనుండడం జిల్లా యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కృషితో ప్రభుత్వం వారి డిప్యుటేషన్‌ను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. 

ఇదీ పరిస్థితి...

వైద్య విధాన పరిషత్‌కు చెందిన 72మంది ఉద్యోగులు ఫారెన్‌ సర్వీస్‌ డిఫ్యుటేషన్‌పై నిజామాబాద్‌ జిల్లాకేంద్ర దవాఖానలో సేవలందిస్తున్నారు. వీరిలో 30 మంది స్టాఫ్‌ నర్సులు, 12 మంది పారామెడికల్‌ సిబ్బంది, నలుగురు ఆఫీస్‌ స్టాఫ్‌, 26 మంది సపోర్టింగ్‌ స్టాఫ్‌ (లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీస్‌) ఉన్నారు. ఈ నెలాఖరుతో వీరి ఐదేండ్ల డిప్యుటేషన్‌ గడువు ముగియనుంది. ప్రస్తుతం జిల్లాకేంద్ర దవాఖానలో వైద్యులకు తోడుగా సేవలందిస్తున్న వీరిని గడువు ముగియగానే ఇతర చోట్లకు వెళ్లిపోవాలి. అనుభవం కలిగిన 72 మంది వైద్య సిబ్బంది ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఈ విపత్కర పరిస్థితుల్లో జిల్లాకేంద్ర దవాఖానలో వైద్యసేవలకు విఘాతం కలుగవచ్చంటూ ఆందోళన వ్యక్తమైంది. దీనిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, వారి సేవలు ఇక్కడ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం.. ఏడాదిపాటు వారి డిప్యుటేషన్‌ను పొడిగించాలని వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీచేశారు. ఐదేండ్ల తర్వాత డిప్యుటేషన్‌ గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే వీలు లేదు. కానీ, జిల్లా పరిస్థితులను మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి డిప్యుటేషన్‌ పొడిగింపులో సక్సెస్‌ అయ్యారు. వాస్తవానికి ఫారిన్‌ సర్వీస్‌ కింద జిల్లాకేంద్ర దవాఖానలో 116 మంది వైద్యసిబ్బంది ఉండేవారు. వీరిలో కొందరు ఉద్యోగ విరమణ చేయగా.. ప్రస్తుతం 72మంది మిగిలారు. రెగ్యులర్‌ స్టాఫ్‌ లేకపోవడం, ఉన్న వీరు కూడా వెళ్లిపోతే జిల్లాకేంద్ర దవాఖాన పరిస్థితి అగమ్యగోచరంగా మారేది. ప్రభుత్వ ఆదేశాలతో ఇక వీరంతా ఇక్కడే తమ సేవలు కొనసాగించనున్నారు. కాగా, ఈ విషయంపై జిల్లాకేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. డిప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బందిని మరో ఏడాది ఇక్కడే కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో ఊరటనిచ్చిందని చెప్పారు.

మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు

క్లిష్ట సమయంలో మేమంతా ఇక్కడే కొనసాగేలా మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఉద్యోగుల తరఫున మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మా సేవలు ఇక్కడ చాలా అవసరం. వైద్యులకు తోడుగా ఎఫ్‌ఎస్‌డీ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. 

-కె.గంగాధర్‌, తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు