శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Apr 24, 2020 , 00:54:48

భయాందోళన వద్దు

భయాందోళన వద్దు

  • నిజామాబాద్‌ నగర వాసులకు ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా భరోసా
  • అధికారులతో కలిసి రెడ్‌జోన్‌లో పర్యటన..
  • నగర పరిస్థితులపై సమీక్ష

నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ నగరంలోని నాందేవ్‌వాడలో కరోనా పాజిటివ్‌ కేసు వెలుగుచూడడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించగా.. గురువారం స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అక్కడ పర్యటించారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కార్త్తికేయ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, మేయర్‌ నీతూకిరణ్‌ ఆయన వెంట ఉన్నారు. కరోనా వ్యాప్తిపై ప్రజలెవరూ భయాందోళనకు గురికావద్దని, పరిస్థితి అదుపులోనే ఉందని ఈ సందర్భంగా స్థానికులకు ఆయన భరోసా కల్పించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టాలని పిలుపునిచ్చారు. నాందేవ్‌వాడలో ఒకే పాజిటివ్‌ కేసు వెలుగు చూసిందని, మిగిలిన ప్రైమరీ కాంటాక్ట్స్‌ అన్నీ నెగెటివ్‌ వచ్చినందున స్థానికులెవరూ భయపడాల్సిన పనిలేదని చెప్పారు. అనంతరం సుభాష్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మేయర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఆర్డీవో, ఏసీపీలతో కలిసి నగర పరిస్థితులపై సమీక్ష జరిపారు. ఇదే స్ఫూర్తితో లాక్‌డౌన్‌ కొనసాగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌, సీపీలతో కలిసి తను సొంతంగా చేస్తున్న నిత్యాన్నదానం అమలును ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌, సీపీ, సిబ్బందికి ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించారు. 23 రోజులుగా నగరంలో కీలక శాఖల సిబ్బందికి ఎమ్మెల్యే సొంతఖర్చుతో భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. నిత్యం 2000మంది వరకు వివిధ శాఖల క్షేత్రస్థాయి సిబ్బందికి నాణ్యమైన అన్నంతోపాటు మినరల్‌ వాటర్‌, బిస్కట్‌ ప్యాకెట్లను అందిస్తున్నారు. అక్కడ నుంచి ఐటీఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. అందుబాటు ధరకే కూరగాయలను అందించేలా చూడాలని, ప్రజలు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలని సూచించారు. అత్యవసర సేవల సిబ్బందికి ఏ అవసరం వచ్చినా సాయమందిస్తానని తెలిపారు. 


logo