శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Apr 20, 2020 , 01:54:26

రోడ్డెక్కితే కేసులు..!

రోడ్డెక్కితే కేసులు..!

  • ఇప్పటికే 45 కేసులు.. వెయ్యికి పైగా వాహనాల సీజ్‌

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : నిర్మల్‌ జిల్లాలో 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్‌జోన్‌గా ప్రకటించింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూ పటిష్టంగా అమలవుతోంది. యంత్రాంగం లాక్‌డౌన్‌ను సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఎవరూ బయటకు రావొద్దని, ఇండ్లలోనే ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.  యంత్రాం గం ఎంత మొత్తుకుంటున్నా పలుచోట్ల కొందరు వాహనాలతో అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు రావొద్దని కోరుతున్నా.. కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధ్దంగా రోడ్లపైకి వస్తుండడంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 45 వాహనాలపై కేసులు నమోదు చేశారు. వెయ్యికి పైగా వాహనాలను సీజ్‌చేసి కోర్టుకు అప్పగించారు. రోడ్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. పాసులు, అత్యవసరమైన పనులకు వస్తున్న వారిని తప్ప, మిగతా వారి వాహనాలను సీజ్‌చేసి కేసులు నమో దు చేస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం రాత్రనకా, పగలనకా రోడ్లపైనే ఉండి లాక్‌డౌన్‌ నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తున్నది. ఎస్పీ శశిధర్‌రాజు ఎప్పటికప్పుడు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లాలో 14 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయగా.. ఇక్కడ వందశాతం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. అన్ని మార్గాలను పోలీసులు బారికేడ్లతో మూసివేశారు.  రాకపోకలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నారు. అత్యవసర రెస్పాన్స్‌ టీం 24గంటలు పనిచేస్తోంది.  రోడ్లపై ఉమ్మివేసినా, మాస్క్‌ లేకుండా బయటకు వచ్చిన వారికి అధికారులు జరిమానాలు విధిస్తున్నారు.