బుధవారం 27 జనవరి 2021
Nirmal - Apr 20, 2020 , 01:44:44

క్వారంటైన్‌.. ఇంటికన్నా భద్రం..!

క్వారంటైన్‌.. ఇంటికన్నా భద్రం..!

  • కరోనా మహమ్మారి బారి నుంచి కాపాడే కేంద్రం
  • కంటికి రెప్పలా రక్షిస్తున్న వైద్యులు, సిబ్బంది 
  • ఇక్కడకు వచ్చేది అనుమానితులు మాత్రమే.. కరోనా రోగులు కాదు
  • కేంద్రాల్లో సౌకర్యాల కల్పన

క్వారంటైన్‌ సెంటర్‌కు వెళ్లిన వారందరూ కరోనావైరస్‌ బారినపడిన వారు కాదు. వైరస్‌ (రోగ) అనుమానితులను విడిగా ఉంచి వారి కుటుంబంతో పాటు సమాజానికి మేలు చేకూర్చేదే క్వారంటైన్‌ ప్రక్రియ. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత కరోనా సోకలేదని తేలితే ఇండ్లకు పంపిస్తారు. క్వారంటైన్‌ కాలంలో ప్రతిరోజూ పౌష్టికాహారం అందిస్తారు.  ఇక్కడ వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

కమ్మర్‌పల్లి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలో కీలకంగా పనిచేస్తున్నాయి క్వారంటైన్‌ కేంద్రాలు. కరోనా అనుమానాలను నివృత్తి చేసి సమాజానికి భరోసా కల్పిస్తున్నా యి. కరోనా అంటే నెలకొన్న ఆందోళన, భయం తో క్వారంటైన్‌ కేంద్రాలను కరోనా సోకిన వారిని కట్టిపడేసి చికిత్స అందించే కేంద్రాలుగా అపోహ పడుతున్నారు. కానీ, అవి నిజానికి నిర్బంధ కేంద్రాలు కాదు.. అవి ఇంటి కన్నా భద్రమైనవి. కంటికి రెప్పలా కాపాడే దేవుళ్ల లాంటి వైద్యులు..చక్కని పౌష్టికాహారం.. వేళకు మందులు ఇస్తూ కుటుంబ సభ్యుల్లా చూసే సిబ్బంది ఉండే అభయాలయాలు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండడానికి, ఎవరికైనా వైరస్‌ సోకితే వారితో సన్నిహితంగా ఉన్న వారికి కూడా సోకిందా అని నిర్ధారించేందుకు, తద్వా రా కరోనా వ్యాప్తి లేకుండా చేసి ప్రజలను కాపాడేందుకు నిర్వహించే అత్యవసర వ్యవస్థ. ఎవరినైనా క్వారంటైన్‌కు తీసుకెళ్లగానే వారికి కరోనా ఉన్నట్లు కాదు.క్వారంటైన్‌కు వెళ్లి కరోనా లేదని తేలాక ఇండ్లకు వచ్చిన వారికి క్వారంటైన్‌ సెంటర్లు ఎంత అవసరమో బాగా అవగతమవుతుంది. అక్కడ సిబ్బంది అందించే సేవలు, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యం అందించే డాక్టర్లు, క్వారంటైన్‌లో ఉండే వారికి గదులు, సౌకర్యాలు ఎంతో బాగుంటాయి. క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చిన వారు చెబుతున్న వివరాల ప్రకారం.. అక్కడ ఇలాంటి సేవలు అందిస్తారు. ప్రతిరోజూ వీ1సీ-1000, విటమిన్‌-ఈ అందిస్తారు. ఉద యం 15 నుంచి 20 నిమిషాల పాటు సూర్యరశ్మి తాకేలా ఎండలో కూర్చోబెడతారు. గుడ్డు, తదితర పౌష్టికాహారం, పైబర్‌ కంటెంట్‌ ఆహారం అందిస్తారు. రోజూ ఏడెనిమిది గంటలు విశ్రాంతి కల్పిస్తారు. నిత్యం గోరువెచ్చని నీరు తాగిస్తారు. వేడి ఆహారం అందిస్తారు. వేడి నీటి ఆవిరి పట్టిస్తారు. కరోనా వైరస్‌ పీహెచ్‌ స్థాయి కన్నా ఎక్కవ ఉంటే ఆల్కలిన్‌ ఆహారాలను తీసుకునేలా చూస్తారు.

కలెక్టర్ల పర్యవేక్షణ...

క్వారంటైన్‌ సెంటర్లలో సేవలు చక్కగా అందేలా ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. తరుచూ స్వయంగా సందర్శిస్తున్నారు. ప్రభుత్వం తగు సౌకర్యాలు కల్పిస్తున్నది. క్వారంటైన్‌ సెంటర్ల నుంచి శాంపిళ్లు పరీక్షలకు పంపిస్తున్నారు. కరోనా ఉన్నట్లు తేలిన వారిని సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించి, వారిని కాపాడేందుకు కృషిచేస్తున్నారు. ఎలాంటి కరోనా వైరస్‌ లక్షణాలు లేని వారిని ఇంటికి పంపిస్తున్నారు. ఇలా చేయడంతో నేడు కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉంది. క్వారంటైన్‌కు వెళ్లిన వారిలో 99శాతం మంది, ఒక్కోసారి వందకు వంద మంది కరోనా వైరస్‌ లేదని తేలి ఇంటికి వచ్చేస్తున్నారు. క్వారంటైన్‌ సెంటర్‌కు వెళ్లడమంటే కరోనా వచ్చినట్లు కాదనడానికి ఇదే నిదర్శనం.

దవాఖానల్లాగా నిర్వహణ : కలెక్టర్‌ 

దవాఖానల్లాగా క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణ చేపడుతున్నామని కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమానితుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ ఉంటే ఇతరులకు వైరస్‌ సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పౌష్టికాహారం అందజేస్తున్నామని పేర్కొన్నారు.  

ఇందూరులో  44 నెగెటివ్‌ 

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ జిల్లాలో కరోనాకు సంబంధించి శనివారం 105 పరీక్షల నమూనాలు పంపగా.. అందులో ఆదివారం 44 నెగెటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయని, మిగతా 61 రిపోర్టులు రావాల్సి ఉందని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండి సహకరించాలని ఆయన కోరారు. కరోనా కట్టడికి యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


logo