సోమవారం 25 మే 2020
Nirmal - Apr 10, 2020 , 02:28:29

సంక్షిప్త సమాచారం

సంక్షిప్త సమాచారం

రేపు ఫూలే జయంతిని ఇంట్లోనే నిర్వహించుకోవాలి  

నిజామాబాద్‌ అర్బన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని నిజామాబాద్‌ జిల్లా ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీరాణి తెలిపారు. ఫూలే  జయంతిని ఈ నెల 11న ప్రజలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని ఆమె సూచించారు. 

ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష వాయిదా

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షను ఈ నెల 19న నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబా తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశంతోపాటు ఏడో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్వహించాల్సిన పరీక్షను కరోనా కారణంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.  

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే కేసులు

బిచ్కుంద : బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కేసులు నమోదు చేస్తామని కామారెడ్డి జిల్లా బిచ్కుంద తహసీల్దార్‌ వెంకట్రావ్‌ హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని ప్రభుత్వం నిషేధించిందని, గురువారం నుంచే ఈ నిషేధం అమలులోకి వచ్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యాలయాలు, బస్టాండ్లు, రహదారులు, జన సమూహాలు, సంతల వద్ద ఉమ్మివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.   

మాచారెడ్డి ఎఫ్‌ఆర్వో బదిలీ

మాచారెడ్డి : మాచారెడ్డి ఫారెస్టు రేంజ్‌ అధికారి అంబర్‌సింగ్‌ బదిలీ అయ్యారు. మెదక్‌ జిల్లాలోని పెద్దశంకరంపేట ఎఫ్‌ఆర్వోగా బదిలీపై వెళ్లారు. కామారెడ్డి ఎఫ్‌ఆర్వోకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు డిప్యూటీ ఆర్వో సుజాత తెలిపారు. 

ఇంటికే అంగన్‌వాడీ సరుకులు

నార్నూర్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో అంగన్‌వాడీ సరుకులను గురువారం లబ్ధిదారుల ఇండ్లకే వెళ్లి అందజేశారు. రెండు మండలాల్లో 154 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు సరుకులు అందజేస్తున్నట్లు సీడీపీవో ఉమాదేవి తెలిపారు. 15 రోజులకు సరిపడా పోషకాహారాన్ని ఒకేసారి అందజేశామని చెప్పారు. 

‘తప్పుడు ఆరోపణలు మానుకోవాలి’

దస్తురాబాద్‌ : దళిత బస్తీ పథకంపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఆదిలాబాద్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలం బుట్టాపూర్‌ సర్పంచ్‌ బాదం నిరోశ అన్నారు. గ్రామ పంచాయతీలో పాలకవర్గంతో కలిసి గురువారం ఆమె మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు. 

పీహెచ్‌ఎసీ తనిఖీ

దస్తురాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా దస్తురాబాద్‌ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తహసీల్దార్‌ బత్తుల విశ్వంభర్‌ గురువారం తనిఖీ చేశారు. విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలు, క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు. తహసీల్దార్‌ వెంట వైద్యురాలు కిరణ్మయి, హెచ్‌ఈవో వేణుగోపాల్‌, వీఆర్వో శివకృష్ణ ఉన్నారు.

కొనసాగుతున్న ఎస్సారెస్పీ నీటివిడుదల

మెండోరా (ముప్కాల్‌) : నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి యాసంగి పంటలకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. కాకతీయకు 4354, లక్ష్మీ కాలువకు 300, సరస్వతీ కెనాల్‌కు 800, అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాలకు 630, తాగునీటి అవసరాలకు 142 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 6,416 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1072.4 అడుగులు (326.87) టీఎంసీల నీటి నిల్వ ఉందని ఏఈఈ మహేందర్‌ తెలిపారు. 

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

సిరికొండ / మోపాల్‌ : నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, మోపాల్‌ మండలాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సిరికొండ మండలంలోని పందిమడుగు, చీమన్‌పల్లిలో సర్పంచులు భాగ్యలక్ష్మి, క్యాతం పద్మ, మోపాల్‌ మండలం మంచిప్ప, ముదక్‌పల్లి, కులాస్‌పూర్‌, భైరాపూర్‌, అమ్రాబాద్‌కు చెందిన లబ్ధిదారులకు ఎంపీపీ లతా కుమారి చెక్కులను అందజేశారు.  

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ...

ధర్పల్లి : మండలంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఎంపీపీ  నల్ల సారికారెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో నటరాజ్‌ పాల్గొన్నారు.

శివపార్వతుల కల్యాణం

నిజాంసాగర్‌ రూరల్‌ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో గురువారం శివపార్వతుల కల్యాణ వేడుకలు నిర్వహించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో అతి కొద్ది మంది భక్తుల సమక్షంలో ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు రాంమోహన్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్‌, భక్తులు పాల్గొన్నారు. 

రెండు లారీలు బోల్తా

ఇందల్వాయి: నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి శివారులో రెండు లారీలు అదుపుతప్పి బోల్తాపడినట్లు ఇందల్వాయి టోల్‌ప్లాజా పీఆర్వో వెంకటేశ్వర్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పూర్‌కు సన్‌ఫ్లవర్‌ రిఫైన్డ్‌ ఆయిల్‌ కార్టన్ల లోడుతో వెళ్తున్న లారీ గురువారం ఉదయం 6:10 గంటలకు అదుపుతప్పి బోల్తాపడింది. నాగ్‌పూర్‌కు వెళ్తున్న మరో లారీ ఉదయం 8:50 గంటలకు బోల్తాపడింది. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతోనే ఈప్రమాదం జరిగి ఉంటుందని పీఆర్వో తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఎవరికీ గాయాలు కాలేదు.

బైక్‌ అదుపుతప్పి ఒకరికి గాయాలు

రెంజల్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలంలోని కందకుర్తి ఏఎన్‌ఎంగా పని చేస్తున్న జానకి భర్త నాగేందర్‌కు గురువారం రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బోధన్‌ పట్టణంలోని శక్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న జానకిని బైకుపై కందకుర్తి వద్ద వదిలిన నాగేందర్‌ సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకొచ్చేందుకు బయల్దేరాడు. సాటాపూర్‌ సమీపంలో బైకు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకెళ్లింది. నాగేందర్‌కు తల, ముఖం భాగంలో బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్సులో బోధన్‌ ఏరియా దవాఖానకు తరలించారు.

షాపు యజమానికి జరిమానా

భీమ్‌గల్‌: నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా షాపు తెరిచి ఉంచిన ఎలక్ట్రానిక్స్‌ షాపు యజమానికి మున్సిపల్‌ కమిషనర్‌ గోపుగంగాధర్‌ రూ.వెయ్యి జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కమిషనర్‌ అన్నారు.

ఐటీఐలో మాస్కుల తయారీ 

ఇందూరు: కరోనా వైరస్‌ విజృంభణతో మాస్క్‌లకు డిమాండ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో మాస్కులు తయారు చేస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ తెలిపారు. టీవోస్‌ టీవీ శివరావు, రాజారెడ్డి, ఉమాదేవి, రేఖారాణి మాస్కులు తయారు చేస్తున్నారని, వీటి తయారీకి కొంతమంది విద్యార్థినులకు రెండు రోజుల అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.  

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

కామారెడ్డి, నమస్తే తెలంగాణ : విద్యుత్‌ లైన్ల మరమ్మతులో భాగంగా కామారెడ్డి లో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. తలమడ్ల, అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి, తిప్పాపూర్‌, మోటాట్‌పల్లి, గుర్జకుంట, ర్యాగట్లపల్లి, సంగనాథ్‌పల్లి వినియోగదారులు సహకరించాలని కోరారు. 


logo