సోమవారం 25 మే 2020
Nirmal - Apr 08, 2020 , 02:42:47

కవ్వాల్‌లో కరోనాపై దృష్టి

కవ్వాల్‌లో కరోనాపై దృష్టి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : అమెరికాలోని బ్రాంక్స్‌ జూలో పులికి కరోనా సోకిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని వన్యప్రాణుల ఆరోగ్యసంరక్షణపై అధికారులు దృష్టిసారించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల ఆరోగ్యసంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లా, రాష్ట్ర అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభతో మంత్రి మంగళవారం ఫోన్‌లో మాట్లాడారు. వన్యప్రాణుల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో దాహార్తి తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సోలార్‌ బోర్లతో చిన్న చిన్న గుంతలు, చెక్‌డ్యాంలు, సాసర్‌పిట్లలో నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలో కవ్వాల్‌ అభయారణ్యం 2600 చదరపు కి.మీటర్ల విస్తీర్ణంలో ఉండగా, నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. అభయారణ్యంలో పెద్దపులులతోపాటు మాంసాహార, శాకాహార జంతువులున్నాయి. కవ్వాల్‌ అభయారణ్యానికి మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యం నుంచి పెద్దపులులు వచ్చిపోతుంటాయి. కరోనా వైరస్‌ పెద్దపులులకు  వ్యాప్తి చెందిన ఘటన అమెరికాలో బయటపడడంతో కవ్వాల్‌ అభయారణ్యం అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అభయారణ్యం పరిధిలో పెద్దపులులతో పాటు మాంసాహార, శాకాహార జంతువులు సహజంగా మరణిస్తే వాటి నివేదికలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి తీసుకుంటున్నారు. వీటికి వైరస్‌ ఉందో లేదో తెలుసుకునేందుకు పరీక్షలకు పంపిస్తున్నారు. వేసవికాలం కావడంతో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు సాసర్‌ పిట్‌, చిన్న చిన్న గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో నీటిని నింపి వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నారు. ఈ నీటిని నింపే అటవీ సిబ్బంది ముందే శానిటైజ్‌ అయ్యాక.. నీరు నింపాక ఇంటికి వెళ్లే ముందు మరోసారి శానిటైజ్‌ అయ్యేలా చర్యలు చేపట్టారు. అటవీప్రాంతంలోకి వెళ్లవద్దని పరిసర గ్రామాల ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా పులుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నారు. అమెరికాలో పెద్దపులికి కరోనావ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని అభయారణ్యం ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌కుమార్‌ ‘నమస్తే తెలంగాణ’తో తెలిపారు. పులులతోపాటు మాంసాహార, శాకాహార జంతువుల ఆరోగ్యసంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు.


logo