సోమవారం 25 మే 2020
Nirmal - Apr 07, 2020 , 03:20:39

అన్నదాతకు అండగా..

అన్నదాతకు అండగా..

  • రైతుల చెంతకెళ్లి ధాన్యం సేకరణ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నదాతలను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. యాసంగిలో పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్ల్లూ చేస్తున్నారు.  లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైతులు సామాజిక దూరం పాటించేలా గ్రామాల్లోనే  కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే కేంద్రాలు ప్రారంభం కాగా, ఆదిలాబాద్‌ జిల్లాలో నేడు శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కనిపించని శత్రువుతో యావత్‌ ప్రపం చ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌తో దేశం కరోనా కట్టడికి పూనుకుంది. అత్యవసరాలు మినహా ఏ ఒక్క సేవలు కొనసాగడం లేదు. ఇలాంటి విపత్కర సమయంలోనూ రైతులకు మేలు చేయాలని, వారికి అండగా నిలిచేందు కు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కష్టపడి పండించిన పంటను  మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా, కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగకుండా సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ధాన్యం కొనుగోళ్లకు జిల్లా పౌరసరఫరాల అధికారులు కృషి చేస్తున్నారు.

భారీ దిగుబడుల అంచనాలు..

పండించిన పంటనంతా అధికారులే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు ఇంటి వద్దే కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయాధికారులు సేకరించిన సమాచారం ప్రకారం దిగుబడి అంచనా వేసి కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 22 మండలాల్లో ఈసారి యాసంగి సీజన్‌లో రైతులు భారీగా పంట సాగు చేశారు. 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడులు వస్తాయని అంచనాలున్నాయి. జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ఇప్పటికే 13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మూడు కేంద్రాల్లో 150 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

కూలీలకు బదులుగా యంత్రాలు...

వరి పంట కోత సమయంలో కూలీలతో కాకుండా హార్వెస్టర్‌ ద్వారా నూర్పిడి చేయించాలని అధికారులు సూచిస్తున్నారు. మండలాల వారీగా హార్వెస్టర్లు ఎన్ని ఉన్నాయనే లెక్కలు సైతం వ్యవసాయాధికారులు తేల్చారు. పంట విక్రయాలకు ఎవరికేమైనా ఇబ్బంది ఉంటే గ్రామ ఏఈవో, లేదా తమకు సమాచారం అందించాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని కొంటామని, ఎవరూ ఇబ్బందులకు గురికావొద్దని జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ జితేంద్ర ప్రసాద్‌ భరోసా ఇస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు, సామాజిక దూరం పాటిస్తూనే కొనుగోలు కేంద్రాల్లో సిబ్బందికి సహకరించాలని విన్నవిస్తున్నారు. సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కోసం తరలించేందుకు వాహనాల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఐదు క్లస్టర్లలో ఒక్కో క్లస్టర్‌కు వంద చొప్పున వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు.

నిర్మల్‌ జిల్లాకు రూ. 850 కోట్లు మంజూరు

నిర్మల్‌ జిల్లాలో రైతులు పండించిన మక్కలకు రూ.400కోట్లు, ధాన్యానికి రూ.450 కోట్లను ప్రభు త్వం మంజూరు చేయనుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సారంగాపూర్‌ మండలం జామ్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 80వేల ఎకరాల్లో మక్క, లక్ష ఎకరాల్లో వరి సాగైనట్లు తెలిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తామని, ఐకేపీ, డీసీఎంఎస్‌, పీఏసీఎస్‌ల ద్వారా 201 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. విద్యుత్‌ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా రూ.700కోట్లు, పంటపెట్టుబడి కింద రైతులకు రూ.1200 కోట్లు, రైతుబీమా కోసం రూ.1300 కోట్లను ఏటా ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు. మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయకర్త వెంకట్‌రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ నారాయణరెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ మురళీకృష్ణ, మార్కెటింగ్‌ ఏడీ శ్రీనివాస్‌, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి అంజిప్రసాద్‌ పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సోమవారం ధాన్యం, శనగ, మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా రైతు సమన్వయకర్త అంజిరెడ్డి ప్రారంభించారు. నస్రుల్లాబాద్‌తోపాటు మైలారం, హాజీపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా సొసైటీల చైర్మన్లు శ్రీనివాస్‌, గంగారాం ప్రారంభించారు. ఎల్లారెడ్డి మండలం మీసాన్‌పల్లిలో కొనుగోలు కేంద్రం కోసం అధికారులు, పీఏసీఎస్‌ చైర్మన్‌ స్థలాన్ని పరిశీలించారు. నిజాంసాగర్‌ మండలం మల్లూర్‌లో సోమవారం 19 బ్యాగుల శనగలు సేకరించినట్లు సొసైటీ చైర్‌పర్సన్‌ కళ్యాణి తెలిపారు. గాంధారి మండలం గౌరారం, మేడిపల్లి, సర్వాపూర్‌ గ్రామాల్లో వరి రైతులకు మండల వ్యవసాయాధికారులు కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. తేదీల వారీగా కూపన్లు అందజేస్తామని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్‌, మద్దుల్‌తండాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ జగన్‌ ప్రారంభించారు. కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ధర్పల్లి వీడీసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిప్రతం అందజేశారు. రుద్రూర్‌ మండలం రాయకూర్‌లో ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, రెంజల్‌లో ఎంపీపీ రజిని, విండో చైర్మన్‌ ప్రశాంత్‌ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందల్వాయి మండలం నల్లవెల్లి పీఏసీఎస్‌ ఆవరణలో ధాన్యం కొనుగోళ్లపై డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఏ-గ్రేడ్‌ రకానికి రూ. 1845, బీ-గ్రేడ్‌ రకానికి రూ. 1815 చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఈ నెల 10 నుంచి  శనగ కోనుగోళ్లు ప్రారంభించనున్నారు. నిర్మల్‌ జిల్లా లోకేశ్వరంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. 


logo