శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Apr 05, 2020 , 03:01:02

వలస కూలీలకు అండగా..

వలస కూలీలకు అండగా..

  • కొనసాగుతున్న బియ్యం, నగదు అందజేత
  • సీఎం కేసీఆర్‌కు వలస కూలీల కృతజ్ఞతలు 

నమస్తే తెలంగాణ యంత్రాంగం: కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) కారణంగా ఉపాధి లేక, పూట గడవని పరిస్థితిలో ఉన్న వలస కూలీలకు తెలంగాణ ప్రభు త్వం అండగా నిలుస్తున్నది. ఒక్కొక్కరికీ 6 కిలోల బియ్యంతో పాటు రూ.500 నగదును అందజేయడంపై వలస కూలీ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో అండగా ఉన్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపాలిటీ కొము రం భీం చౌరస్తాలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణానికి పనిచేస్తున్న పలువురు కూలీలకు బియ్యంతో పాటుగా రూ. 500 చొప్పున నగదును మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ అందజేశారు. ఖానాపూర్‌ మండలంలో  550 మంది వలస వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన 27 మంది కూలీలకు ఆర్థిక సహాయం అందజేశారు.  భైంసా మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామంలో వలస కార్మికులకు రూ.500 నగదును టీఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. సోన్‌, నిర్మల్‌ మండలంలోని వెల్మల్‌ బొప్పారం, పాక్‌పట్ల, సోన్‌, ముజ్గి తదితర గ్రామాల్లో వలస కూలీలకు తహసీల్దార్‌ లక్ష్మి రూ.500 చొప్పున నగదు అందజేశారు.  ముథోల్‌ మండల కేం ద్రంలో ఉన్న వలస కార్మికులకు సర్పంచ్‌ రాజేందర్‌  రూ. 500 నగదుతో పాటు బియ్యం పంపిణీ చేశారు. లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి, పార్‌పెల్లి, నర్సాపూర్‌(డబ్ల్యూ), లక్ష్మణచాంద గ్రామాల్లోని వలస కార్మికులకు జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌  రేషన్‌బియ్యం, నగదును అందజేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో  450 మంది వలస కూలీలకు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో  బియ్యం పంపిణీ చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ పాటిల్‌ తెలిపారు. గంజ్‌ ప్రాంతంలో కిసాన్‌ క్లాత్‌ షాపింగ్‌ మాల్‌ యజమాని ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.1200 విలువజేసే వస్తువులను పంపిణీ చేశారు.