మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Apr 05, 2020 , 02:58:31

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

నమస్తే తెలంగాణ యంత్రాంగం: ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ శనివారం పదమూడో రోజుకు చేరింది. ప్రజలు ఇండ్లకే పరమితమయ్యారు. పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో.. 

బోథ్‌ సీఐ  రవీందర్‌, ఎస్సై రాజు బోథ్‌తో పాటు ఘన్‌పూర్‌ సరిహద్దు వద్ద పహారా కాశారు. మహారాష్ట్ర సరిహద్దు ఘన్‌పూర్‌ చెక్‌ పోస్టును అడిషనల్‌ ఎస్పీ వినోద్‌కుమార్‌ సందర్శించారు. బోథ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ పోలీసులకు అప్పగించారు. అతడిని ఏఎస్సై హన్మాండ్లు ఆటోలో మహారాష్ట్ర సరిహద్దు శివిని వరకు పంపించారు. తాంసి జడ్పీటీసీ తాటిపెల్లి రాజు హస్నాపూర్‌, తాంసి గ్రామాల్లో పర్యటించారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటికి రావద్దని సూచించారు. నార్నూర్‌ మండల కేంద్రంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు పూనగూడలోని చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

నిర్మల్‌ జిల్లాలో..

నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు మర్కజ్‌కు వెళ్లి కరోనా వైరస్‌తో మృతి చెందడంతో నిర్మల్‌, సోన్‌ మండలాల్లో  చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వెంగ్వాపేట్‌, లంగ్డాపూర్‌, ముజ్గి, నీలాయిపేట్‌, మేడిపల్లి, భాగ్యనగర్‌, న్యూపోచంపాడ్‌, పాక్‌పట్ల, సోన్‌, న్యూవెల్మల్‌, జాఫ్రాపూర్‌ గ్రామాల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి ఇద్దరు మనుషుల చొప్పున కాపలా ఉంచారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని దస్తురాబాద్‌ మండలం దేవునిగూడెం సర్పంచ్‌ ముష్కే అంజన్న  దండోరా వేయించారు. ద్విచక్ర వాహనాలపైన ఇద్దరు వెళ్లినా, గుంపులుగా ఉన్నా రూ. 1000 జరిమానాతోపాటు రేషన్‌ బియ్యం, పింఛన్‌ నిలిపి వేస్తామని చెప్పారు. భైంసా పట్టణ సీఐ  వేణుగోపాల్‌రావు ఆధ్వర్యంలో ఎస్సై సుమన్‌రెడ్డి బందోబస్తు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి అవగాహన కల్పించారు.  

కామారెడ్డి జిల్లాలో.. 

బిచ్కుంద ఎస్‌బీఐలో శనివారం   తహసీల్దార్‌ వెంకట్రావు, ఎంపీవో మహబూబ్‌, ఎస్‌బీఐ మేనేజర్‌ నరేశ్‌, జీపీ సెక్రటరీ రజినీకాంత్‌రెడ్డి, రాజు శానిటైజేషన్‌ పనులు చేపట్టారు. పెద్దదేవడ, మాన్యాపూర్‌ గ్రామాల్లో లాక్‌డౌన్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు.  బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల్లో ప్రజలు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. నిజాంసాగర్‌లో శనివారం నిర్వహించిన వారసంతలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేశారు.  గ్రామాల్లో వైద్య సిబ్బంది, తహసీల్దార్‌ నారాయణ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. జుక్కల్‌ మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన సోపూర్‌, పెద్ద కరంజిలో తహసీల్దార్‌ వెంకటేశ్‌, ఎస్సై రఫీయుద్దీన్‌ లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. పిట్లం మండలం మద్దెల్‌చెర్వులో సర్పంచ్‌ పండిత్‌రావు  మురికి కాలువలు, తాగునీటి కుళాయిల వద్ద శుభ్రం చేయించారు. లింగంపేటలో డైలీ మార్కెట్‌ను పాఠశాల ఆవరణలోకి మార్చారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతున్నట్లు తహసీల్దార్‌ నారాయణ తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సాయికుమార్‌ తెలిపారు. దోమకొండ మండలం గడీకోట ట్రస్ట్‌ మేనేజర్‌ బాబ్జీ, సిబ్బంది గణేశ్‌, వినోద్‌, సర్పంచ్‌ అంజలి మండల కేంద్రంలో ప్రజలకు కరోనా వైరస్‌పై మైక్‌ ద్వారా అవగాహన  కల్పించారు.  

నిజామాబాద్‌ జిల్లాలో..

డిచ్‌పల్లి మండలంలో ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని తహసీల్దార్‌, ఎంపీడీవో పేర్కొన్నారు. ధర్పల్లి తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో నటరాజ్‌, సీఐ ప్రసాద్‌, ఎస్సై పాండేరావు, పోలీసు సిబ్బంది గ్రామాల్లో లాక్‌డౌన్‌ ప్రశాంతంగా కొనసాగేలా చూస్తున్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేశారు. ఎంపీపీ హరిత, జడ్పీటీసీ తనూజ, తహసీల్దార్‌ రాజు, ఎంపీడీవో భారతి, మండల వైద్యాధికారి రఘువీర్‌ గౌడ్‌, ఎస్సై రవి, ఎంపీవో బాల్‌రెడ్డి పర్యవేక్షించారు. కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్‌లో స్పందన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కరోనాపై అవగాహన కల్పించారు. 

నందిపేట్‌ మండలంలో పాతూర్‌ నుంచి పాత మండలం వరకు రసాయనాలు కలిపిన నీటిని పిచికారీ చేశారు. ఆర్మూర్‌ పట్టణంతో పాటు గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగింది. రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేశారు.

82 వాహనాలు సీజ్‌

నిజామాబాద్‌ సిటీ: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 82 వాహనాలను సీజ్‌ చేసినట్లు కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ పేర్కొన్నారు.  ద్విచక్ర వాహనాలు 64, ఆటోలు 16, రెండు ఫోర్‌ వీలర్లను సీజ్‌ చేశామన్నారు. అత్యవసర మెడికల్‌ అవసరాలకు పోలీసు శాఖ తరఫున పాసులు అందజేస్తున్నామన్నారు. మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్‌ తండా చెక్‌పోస్టు వద్ద ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి వాహనాల తనిఖీ చేపట్టారు.  నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించారు.

యువకులే వలంటీర్లు 

బాన్సువాడ నమస్తే తెలంగా/ ఎల్లారెడ్డి రూరల్‌:  ఎల్లారెడ్డి మండలం భిక్కనూరులో యువకులు వలంటీర్లుగా మారి పహారా నిర్వహించారు. 25 మంది యువకులు శుక్రవారం రాత్రి సమావేశాన్ని నిర్వహించుకొని కరోనా కట్టడికి సహకరించాలని నిశ్చయించుకున్నారు. శనివారం వీధుల్లో తిరుగుతూ అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. మా స్కులు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు మాస్కులను అందించారు.  వారితో పాటు సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌  శ్రీకాంత్‌ ఉన్నారు.

బాన్సువాడలో..

బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని పలు గ్రామాల్లో  గ్రామ కమిటీలు, సామాజిక వర్గాల వారితో లాక్‌డౌన్‌ వలంటీర్లను ఎంపిక చేసుకున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి రూ.500 జరిమానా విధించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కొల్లూర్‌లో కమిటీ నిర్ణయాన్ని అంగీకరించి ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. పోచారంలో యువకులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. ఎవరూ బయట తిరుగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


logo