సోమవారం 30 మార్చి 2020
Nirmal - Mar 27, 2020 , 02:29:59

పల్లే.. పట్నం స్వీయ నిర్బంధం..

పల్లే.. పట్నం స్వీయ నిర్బంధం..

  • ఇండ్లకే పరిమితమైన ప్రజలు
  • ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌
  • దుకాణాల వద్ద కనీస దూరం తప్పనిసరి
  • ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
  • పరిస్థితుల్ని పర్యవేక్షించిన ఎమ్మెల్యేలు
  • రేషన్‌ పంపిణీ వాయిదా

కొవిడ్‌-19 (కరోనా వైరస్‌)పై సమరం కొనసాగుతున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ నాల్గోరోజు ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. చాలా గ్రామాల్లో కొత్తవారు, బయటవారు ఎవరూ రాకుండా రోడ్లను మూసివేశారు. సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేశారు. ‘మా గ్రామాలకు రాకండి..మేమూ మీ ఊళ్లకు రాబోము.. ’అంటూ వేడుకున్నారు. మరోవైపు వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఉదయం నుంచీ ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రాలేదు. స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజా, రవాణా, ప్రైవేటు, అద్దె వాహనాలపై ఆంక్షలు ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ దవాఖానలు, చెక్‌పోస్టులను అధికారులు, పోలీసులు తనిఖీ చేశారు. నేటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు.

నిర్మల్‌, మంచిర్యాల, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:  తెలంగాణ సర్కా రు కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ నాలుగోరోజూ కొనసాగింది. రాత్రి ఏడు గంటల నుంచి ఉద యం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్న పోలీసు లు.. మధ్యాహ్నం కూడా వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. అత్యవసరం ఉన్న వాళ్లు మినహా వేరే వారిని వెనక్కి పంపుతున్నారు. ఉదయం తొమ్మిది తర్వాత జనం గడపదాటడం లేదు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రోడ్లపైకి రావడానికి ఎవరూ సాహసించడం లేదు. ప్రధాన రహదారులపై పోలీసు లు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. కాగా.. విదేశాల నుంచి 228 మంది జిల్లాకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిని స్వీయ గృహ నిర్బంధంలో ఉంచారు. ముగ్గురిని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు. స్వీయ నిర్బంధం పూర్తి చేసుకున్న వారికి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. 

మిగతా వారు తమ నిర్బంధ కాలం పూర్తయ్యే వరకు మం డల, గ్రామ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉం డాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పడు పరిశీలిస్తున్నారు. 

పలు చోట్ల మార్కెట్ల ఏర్పాటు 

జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డుల్లో జనసమ్మర్దం ఎక్కువ కావడం, మార్కెట్‌ ఇరుకుగా ఉండడంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. మంచిర్యాల పట్టణంలో మూ డు కిలోమీటర్ల దూరంతో ఒకటి చొప్పున జిల్లా కేంద్రం చుట్టూ 12 కొత్త మార్కెట్లను ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి, మిగతా చోట్ల విరివిరిగా ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఇ బ్బందులు తప్పడమే కాకుండా, ప్రధాన కూరగాయ ల మార్కెట్లలో రద్దీ తగ్గింది. దీనిపై ప్రచారం సరిగ్గా లేకపోవడంతో మొదటి రోజు ఆయా మార్కెట్లు బోసిపోయాయి. మంచిర్యాల నుంచి ప్రయాణికులను తరలిస్తున్న రెండు అంబులెన్స్‌లను పట్టుకుని మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్య ఠాణాకు తరలించారు. 

పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్‌, డీసీపీ, ఎమ్మెల్సీ

జిల్లావ్యాప్తంగా పరిస్థితిని కలెక్టర్‌ భారతి సమీక్షిస్తున్నారు. గురువారం ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించి కలెక్టర్‌ కాలేజీరోడ్‌, ఏసీసీ ప్రాంతాల్లో పరిశీలించారు. అదే సమయంలో డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోటపల్లి మండల కేంద్రంలో అధికారులతో కలిసి ఎమ్మెల్సీ పురాణం పరిస్థితి అడిగి తెలుసుకున్నా రు. దండేపల్లి మండలంలోని మేదరిపేటలో లాక్‌డౌన్‌ పరిస్థితిపై ఏసీపీ లక్ష్మీనారాయణ ఆరా తీశారు. తన ఒక నెల పెన్షన్‌ రూ.35 వేలను సీఎం సహాయ నిధికి విరాళంగా మాజీ విప్‌ నల్లాల ఓదెలు అందించారు. హాజీపూర్‌ మండల సర్పంచులు ఒక నెల వేతనాన్ని అందించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు.

గ్రామ బాట పట్టిన ప్రజాప్రతినిధులు

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రజాప్రతినిధు లు గ్రామాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి గురువారం వాంకిడి మండలంలో పర్యటించారు. సరిహద్దు చెక్‌పోస్టు వద్ద భద్రతను పర్యవేక్షించిన ఆమె అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రాథమిక వైద్యాన్ని అందించాలనీ, వెంటనే జిల్లా కేంద్రంలోని కార్వంటైన్‌కు తరలించాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్‌లో పలువురికి ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ అవగాహన కల్పించారు. కాగా.. గురువారం కూడా పదికి పైగా గ్రామాలు రాకపోకలను అడ్డుకోగా, మూడు రోజుల్లో కలిపి స్వీయ దిగ్బంధంలోకి వెళ్లిన గ్రామాల సంఖ్య 50 దాటింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ సెంటర్‌కు గురువారం వివిధ ప్రాంతాల నుంచి 9 మందిని తరలించారు. 


logo