సోమవారం 25 మే 2020
Nirmal - Mar 09, 2020 , 23:38:46

అడవి పలుచనైతే..

అడవి పలుచనైతే..

మండు వేసవిలోనైతే గ్రామశివారులోని వాగులు వంకల వద్దకు మనుబోతులు, జింకలు దాహం తీర్చుకునేందుకు వచ్చేవి. ఇప్పుడు ఏకంగా పెద్దపులులే జనావాసాలకు వచ్చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటికీ మూలకారణాలు ఏంటని జనం ఇంకా ఆలోచించడంలేదు. పర్యావరణం ధ్వంసం, గాలి, నీరు, భూ కాలుష్యం.. ఇవన్నీ మనం చేతులారా చేసుకుంటున్నవే. వర్షాలు, పంటలు, మానవుడు.. ఆ మాటకు వస్తే జీవరాశులన్నీ జీవవైవిధ్యం ప్రాతిపదికన మనుగడ సాధించాలంటే అడవులు అవసరం. ఆ అడవుల్లో వన్యప్రాణులు మనగలగాలి. శాఖాహార జంతువులతోపాటు చిరుతలూ ఉండాలి, పెద్ద పులులూ సంచరించాలి. అడవులు పలుచబడడం, ఆహారం కొరత, తోడు లేక ఇలా వివిధ కారణాలతో అభయారణ్యాల్లో వన్య మృగాలు ఒత్తిడికి గురవుతున్నాయని, పులులు వలసవెళ్తున్నాయని సీసీఎంబీ (సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ), ల్యాకోన్స్‌ (ల్యాబొరేటరీ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఎండెంజర్డ్‌ స్పీసేస్‌) కేంద్ర సంస్థలు అంటున్నాయి. 

అడవుల జిల్లా.. పెద్దపులుల ఖిల్లా ..

ఉమ్మడి జిల్లాలో 1.87 హెక్టార్ల సుదీర్ఘ విస్తీర్ణంలో .. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే అడవులున్నాయి. 7 లక్షల చదరపు మీటర్ల అటవీప్రాంతం విస్తరించి ఉన్నది. ఆదిలాబాద్‌ జిల్లాను తెలంగాణ కశ్మీరంగా స్వయంగా హరితయజ్ఞ స్ఫూర్తిప్రదాత సీఎం కేసీఆరే అభివర్ణించారు. తాంసి రాములగుట్ట , భీంపూర్‌ మండల అర్లి(టీ) కోడిపుంజుల లొద్ది, గొల్లగఢ్‌- తాంసి(కే) అడవులు, ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్‌, ఇచ్చోడ ప్రాంతంలో గుండాల, కేశవపట్నం, బోథ్‌లో అజ్జెర-వజ్జెర, తలమడుగు మండలంలో కోసాయి, ఉమ్రి తదితర జిల్లా నలుమూలలా ఉన్న అడవితల్లి ఒడిలోనే గ్రామాలు ఉన్నాయి. పక్కనే మహారాష్ట్ర విదర్భ, మరాట్వాడా గ్రామాలు. తిప్పేశ్వర్‌ లాంటి అభయారణ్యాలు. మా జమానాలో పెద్ద పులులను ఎప్పుడో అడవిలోనే చూసెటోళ్లమని, ఇలా జనావాసాలకు వచ్చింది లేదని, ఇపుడున్న ఆ తరం పెద్దలు అంటున్నారు. దశాబ్దాల క్రితం వందల సంఖ్యలో ఉన్న పశువులను మేపడం, వంట చెరుకు వినియోగం, ఇండ్లు, పశువుల కొట్టాలు, సర్కారు భవనాల నిర్మాణాలకు విలువైన టేకు తదితర కలప ఆ జమానాలో అటవి నుంచే వినియోగించినా దట్టమైన అడవుల అందం చెక్కు చెదరలేదు. వన్యప్రాణి మనుగడకూ ముప్పు వాటిల్లలేదు. నేటి ఆధునిక కాలంలోనే అడవి క్రమంగా స్మగ్లర్ల ధాటికి బక్కచిక్కి ..ఇలా పులులను జనావాసాల్లో చూసే పరిస్థితికి తెచ్చింది. 

వేటగాళ్లు.. స్మగ్లర్లు..

వేటగాళ్లు, స్మగ్లర్ల దెబ్బకు అడవులు అంతరించిపోతున్నాయి. వాస్తవానికి గ్రామానికో మినీ వీరప్పన్‌ కొందరు అవినీతి అటవీ సిబ్బందితో చేతులు కలిపి అడవి తల్లిని చెరబట్టారు. 2019లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ వీరప్పన్‌ అని పిలుచుకునే ఎడ్ల శ్రీనివాస్‌ రూ.కోట్ల విలువైన కలపదోచుకున్నాడు. ఎట్టకేలకు ఆయనను అధికారులు జైలుకు పంపగలిగారు. సర్కారు ఉక్కుపాదంతో ఇప్పుడిప్పుడే తగ్గిన ఇచ్చోడ ముల్తానీల ఉదంతాలు తెలిసినవే. అడవిలో కలప స్మగ్లర్లు, వన్యప్రాణుల రవాణా మాఫియా, చిరుతలు, పులుల వేటగాళ్లు కలిసి చేయాల్సిందంతా చేసేశారు. 

33.21 లక్షల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు..

అడవుల పెంపకంలో భాగంగా సీడ్‌బాల్స్‌, మొక్కలు నాటడం ద్వారా జిల్లాలో సెప్టెంబరు 2019 వరకు 33.21 లక్షల మేర మొక్కల లక్ష్యం చేరారు. వీటి సంరక్షణకు స్థానికుల భాగస్వామ్యంతో కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈజీఎస్‌, ఫారెస్టు నర్సరీలు ఇపుడు ఆదర్శంగా ఉన్నాయి.   


పెద్దపులి.. వాగోబా దేవర..

నిజానికి ఉత్తర తెలంగాణలోని చాలా గ్రామాలు, ప్రధానంగా ఆదివాసీ పల్లెల్లో పెద్ద పులిని వాగోబా పెద్ద దేవరగా విశ్వసిస్తారు. పులి విగ్రహం ప్రతి గ్రామ శివారు సరిహద్దులో ఉంటుంది. ప్రతి సంవత్సరం వాగోబా పూజలూ చేస్తారు. ఇంతగా పులిని విశ్వసించే గ్రామీణులు పులికి అపకారం తలపెట్ట సాహసించరు. అలాగే అడవి పందులను వాటి పేరుతో నోరారా సంబోధించకుండా రాజులు అని పిలిచి వానాకాలం పంటలు ఇంటికి వచ్చే తరుణంలో రాజుల దేవర చేస్తారు. ఇదంతా చెప్పడం ఎందుకంటే అడవికి, మనిషికి, వన్యప్రాణికి అవినాభావ సంబంధం ఉన్నది. పురాతన కాలంనుంచి ఆధ్యాత్మికంగా.. ఇపుడు శాస్త్ర ప్రకారం కూడా జీవులు, భూమండలం, విశ్వ మనుగడకు అడవులు అవసరమే. అందుకు సర్కారు హరిత కార్యాచరణలో భాగస్వాములై మనసావాచా సహకరించడం అందరి బాధ్యత.  


సంచార వేటగాళ్లపై అధ్యయనం అవసరం

వాస్తవానికి ఇచ్చోడ మండలంలోని ముల్తానీలు కలప స్మగర్లర్లుగా జాతికి తెలిసీ తెలియక అపకారం చేస్తే అధికారులు ఉపాధి కల్పించి తప్పుడుమార్గంలోకి పోకుండా చూశారు. అయితే ఇప్పటికీ జిల్లాలో సంచార పారడీ తెగ ఒకటి వేట వృత్తిపై జీవిస్తున్నది. సీజనల్‌గా అడవుల్లో లభించే అడవి కాకర, మొర్రి, జీడిపండ్లు, తేనె, జిగురు బంకను సేకరించి అమ్ముతుంటారు. వీటితోపాటు కుందేళ్లు, మనబోతులు, జింకలను వేటాడి గుట్టు చప్పుడు కాకుండా మాంసం అమ్మకాలు కొనసాగిస్తారు. ఇంకా అక్షరజ్ఞానం లేని ఈ సంచార తెగపై అధికారుల దృష్టి సారించాలి.


logo