సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Mar 09, 2020 , 23:34:08

ఉపాధ్యాయుల అటెండెన్స్‌పై నజర్‌

ఉపాధ్యాయుల అటెండెన్స్‌పై నజర్‌

ఆదిలాబాద్‌ రూరల్‌: జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ బడులున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు కొందరు టీచర్లు ఎగనామం పెడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఉపాధ్యాయులు తప్పని సరిగా పాఠశాలలకు వేళ్లాలనే ఉద్దేశంతో రెండేండ్లుగా బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ను అమలు చేస్తున్నది. అయితే కొందరు ఉపాధ్యాయులు తమకు ఇష్టమున్నపుడు బయోమెట్రిక్‌ నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే కొందరు బయోమెట్రిక్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల నుంచి తప్పని సరిగా ఉపాధ్యాయులందరూ బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి. 

జిల్లాలో 452 ప్రాథమిక, 100 ప్రాథమికోన్నత, 102 ఉన్నత పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో మొత్తం 2560 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరికి సరిపడా బయోమెట్రిక్‌ మిషన్లను రెండేళ్ల కిందటే ప్రభుత్వం పాఠశాలలకు అందించింది. అప్పటి నుంచి జిల్లాలో బయోమెట్రిక్‌ నడుస్తుంది. కానీ అధికారులు బయోమెట్రిక్‌ హాజరుపై అంతగా దృష్టి పెట్టలేదు. దీంతో ఉపాధ్యాయులు తమకు ఇష్టమున్నట్లు బయోమెట్రిక్‌ వేయడం, మరి కొందరు రెండు మూడు రోజులకోసారి నమోదు చేసుకోవడం వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. అలాగే కొందరు తమ ఐడీలు రావడం లేదని, మిషన్లు పనిచేయడంలేదని బయోమెట్రిక్‌ వేయకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బయోమెట్రిక్‌ తప్పని సరి..

ఈ నెల మొదటి వారంలో జిల్లా విద్యాశాఖాధికారి నుంచి ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులకు మెసెజ్‌లు వెళ్లాయి. ఈ నెల నుంచి ప్రతి రోజూ 100 శాతం ఉపాధ్యాయుల అటెండెన్స్‌ వేయాలని సూచించారు. ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌లు వేయకపోతే సెలవుకింద పరిగణిస్తామని, బయోమెట్రిక్‌ అటెండెన్స్‌కు, హాజరుపట్టికకు తేడాలుంటే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ మిషన్లలో సమస్య ఉంటే వెంటనే ఎంఐసీలకు తెలియజేయాలని, ఐడీలు పనిచేయకపోతే సంబంధిత సీఆర్‌పీలకు సమాచారం అందించి నూతన ఐడీలను తీసుకోవాలని సూచించారు. అలాగే ఉపాధ్యాయులు సెలవులో ఉన్నా, హాఫ్‌ డే, ఓడీ, మెడికల్‌, ఓసీఎల్‌ ఇలా అన్ని రకాల సెలవులను మెషిన్‌లో నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే పాఠశాలకు వచ్చినప్పటికీ గైర్హాజరుగానే పరిగణిస్తామని హెచ్చరించారు. ఈ నెల నుంచి ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌షీట్‌తో పాటు పాఠశాల రిజిస్టర్‌ జిరాక్స్‌కాపీలను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఒకవేళ తేడాలుంటే సదరు ఉపాధ్యాయుడి పాటు, ప్రధానోపాధ్యాయులపై సైతం చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.


logo