సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Mar 09, 2020 , 00:00:00

సబ్బండ వర్గాలకు అండగా రాష్ట్ర బడ్జెట్‌

 సబ్బండ వర్గాలకు అండగా రాష్ట్ర బడ్జెట్‌

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : సబ్బండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాలోనూ, గ్రాంట్లలో కోతలు విధించన ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం భారీగా నిధులు కేటాయించినట్లు వివిధ వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ, వ్యవసాయ, ఇతర రంగాలకు తన బడ్జెట్‌లో పెద్దపీట వేసిన రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అసెంబ్లీలో మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని మేథావులు, రైతులు, మహిళలు, వ్యాపారులు అంటున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ నేపథ్యంలో జిల్లాలోని రైతులు, పేదలు, కులవృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారితో పాటు ఎక్కువ జనాభా ఉన్న గిరిజనులకు సైతం ప్రయోజనం చేకూరనుంది. కంది రైతులను ఆదుకునేందుకు ఎంత ఖర్చయినా పంటను కొనుగోలు చేస్తామని మంత్రి ప్రకటించడంతో ప్రస్తుతం జిల్లాలో కందుల కొనుగోళ్లు జరుగుతుండడంతో రైతులకు భరోస ఏర్పడింది. పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహణ ద్వారా గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకొన్నది. పల్లెల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిచడంతో గ్రామాలకు మహర్దశ చేకూరనుంది. 


గ్రామాలకు మహర్దశ

జిల్లాలో రెండు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 427 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగగా పల్లెలు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటుతో పాటు పంచాయతీలకు ట్రాక్టర్‌ను కొనుగోలు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గుర్తించిన పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కోసం రూ.23,005కోట్లు కేటాయించడంతో పల్లెలకు మహర్దశ పట్టనుంది. 


పేదల సొంతింటి కల సాకారం.. 

ఎన్నికల మ్యానిఫెస్టోలో సూచించిన విధంగా సొంత స్థలం ఉన్న పేదవారికి ఉచితంగా డబుల్‌ బెడ్‌రూంలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో లక్ష రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. దీంతో జిల్లాలోని పేదల సొంతింట కల నేరవేరనుంది. జిల్లాకు 3,610 డబుల్‌బెడ్‌రూంలు మంజూరుకాగా వీటిలో కొన్ని పూర్తవగా, మిగితా వాటి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. 


పంట కొనుగోళ్లపై భరోస.. 

జిల్లాలో రైతులు కంది పంటను ఎక్కువ సాగు చేస్తారు. ఈ ఏడాది వర్షాలతో పాటు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పంట దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లాలో వివిధ మార్కెట్‌ యార్డుల్లో నాఫెడ్‌ ద్వారా పంట కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం సోయాబీన్‌ పంటను కొనుగోలు చేసింది. కంది రైతులు ఇబ్బందులు పడకుండా పంటను కొనుగోలు చేస్తామని మంత్రి హరీశ్‌ రావు తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో కంది రైతులకు తమ పంటను ప్రభుత్వ రంగ సంస్థలకు పూర్తిగా విక్రయించి మద్దతు ధర పొందే అవకాశాలున్నాయి. 


logo