మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nirmal - Mar 08, 2020 , 23:55:10

రంగుల కేళీ హోలీ..

రంగుల కేళీ హోలీ..

ఆదిలాబాద్‌ రూరల్‌ :  హోలీ.. ఈ మాట వినగానే అందరిలో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. మనసు నిండా ఆనందం ఉప్పొంగుతుంది. చిన్నా, పెద్దా ..ఆడ, మగా.. పేద,ధనిక అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆడుకునే పండుగే హోలి. ఇలా అన్ని వర్గాలు భేదాలు మరిచి అత్యంత ఆనందోత్సహాలతో జరుపుకొనే పర్వదినం. ఈ పర్వదినాన్ని జిల్లాలో మంగళవారం జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ సారి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ నీడ హోలీ పండుగపై కూడా పడింది. వాట్సప్‌లో ఇప్పటికే అనేక మంది హోలీ పండుగలో పాల్గొనవద్దని మెసేజ్‌లు పోస్ట్‌ చేస్తున్నారు. దేశ ప్రధాని, హోంమంత్రి కూడా ఈ సారి హోలీ వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం హోలి జరుపుకోవడానికి జిల్లా వాసులు అంతంతమాత్రంగానే సిద్ధమవుతున్నారు. సోమవారం పౌర్ణమి సందర్భంగా కామదహన కార్యక్రమం చేపట్టి మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించుకోనున్నారు.

మార్కెట్‌లో రంగులు సిద్ధం.. 

జిల్లా కేంద్రంతో పాటు ఇచ్చోడ, బోథ్‌, ఉట్నూర్‌ పట్టణాల్లో సైతం హోలీ పండుగ కోసం మార్కెట్‌లో రంగుల దుకాణాలు వెలిశాయి. వ్యాపారులు కూడా ఈ సారి రసాయన రంగుల కంటే సహజ సిద్ధమైన వాటినే ఎక్కువగా అమ్మకాలకు తీసుకువచ్చారు. చైనా తయారీ రంగులను ఎవరూ కొనరనే భయంతో వ్యాపారులు సహజంగా లభించే కుంకుమ, గులాల్‌ వంటి రంగులను ఎక్కువగా విక్రయిస్తున్నారు. వీటి ధర రూ.10 నుంచి మొదలు కొని రూ.200 వరకు ఉంది. చక్కరి పేర్లు, కుడుకల పేర్లు మార్కెట్‌లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ధరలు రూ.5 నుంచి వంద రూపాయల వరకు ఉన్నాయి. 

ఆకర్షించే మాస్కులు, పిచికారీలు.. 

చిన్నారులను ఆకర్షించేందుకు వ్యాపారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖానికి పెట్టుకునే మాస్కులను వివిధ ఆకారాలు, డిజైన్లలో తయారు చేసి విక్రయానికి తీసుకువచ్చారు. వెంట్రుకలు, గడ్డం లాంటివి కూడా మార్కెట్‌లో ఉన్నాయి. పెద్ద శబ్ధం చేసే శంఖులను మార్కెట్‌లో అమ్మకాలకు ఉంచారు. 

పట్టణాల్లో ప్రత్యేక ఏర్పాట్లు.. 

జిల్లాలోని పలు పట్టణాల్లో భారీ ఎత్తున హోలీ సంబురాలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కొందరు అపార్ట్‌మెంట్లలో సామూహికంగా హోలీ ఆడుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్నేహితులు తమ పాత మిత్రులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల రంగు నీళ్లను చిమ్మేందుకు ప్రత్యేకంగా ట్యాంకులను ఏర్పాటు చేసి పైపులు సిద్ధంగా పెట్టుకుంటున్నారు. 

స్నానాల వేళ.. జర జాగ్రత్త..

హోలీ రోజు రంగులు చల్లుకున్న అనంతరం చాలా మంది తమ స్నేహితులతో కలిసి స్నానాలు చేసేందుకు వ్యవసాయ బావులు, చెరువులు, కాలువల వద్దకు వెళ్తారు. గంటల తరబడి రంగులు చల్లుకుంటూ అలసిన వారు కేరింతలు కొడుతూ నీటిలో జలకాలాడడం, ఈత కొట్టడం చేస్తుంటారు. ఈ సందర్భంగా పోటీలు పడి గట్టు పై నుంచి నీటిలోకి దూకుతారు. నేరుగా కాకుండా తలకిందులుగా, దూరం నుంచి పరిగెత్తుకు వచ్చి దూకడంలాంటివి చేస్తుంటారు. ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. స్నానాలకు వెళ్లే వారు ముందు ఆ బావులు, చెరువులు, నదులు, కాలువల్లో లోతు, బండరాళ్లు ఉన్నాయోలేవో చూసుకోవాలంటున్నారు నిపుణులు.

మోదుగు చెట్ల సోయగం.. 

వసంత రుతువు ఆగమన వేళ మోదుగ చెట్లు నిండుగా పూలతో కనువిందు చేస్తాయి. గ్రామ శివార్లలో, దారుల వెంట, అటవీ ప్రాంతాల్లో ఎటుచూసినా నిండుగా కాషాయవర్ణంలో దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మోదుగు పూలతోనే రంగు తయారు చేసి చల్లుకుంటారు.

సహజ రంగులే మేలు...

హోలీ సందర్భంగా రంగులు చల్లుకోవడం అందరికీ తెలిసిందే. రసాయనాలు వినియోగించిన  రంగులు మార్కెట్‌లో తక్కువ ధరకు లభిస్తున్నాయి. వీటితో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. దురద, చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు సహజంగా లభించే రంగులనే చల్లుకోవడం మంచిది.  


logo