బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Mar 08, 2020 , 23:54:07

మహిళలు చైతన్యవంతం కావాలి

మహిళలు చైతన్యవంతం కావాలి

 ఆదిలాబాద్‌ రూరల్‌/ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: : మహిళలు చదువుకొని చైతన్యవంతులు కావాలని జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీఆర్‌టీయూ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ అక్కడక్కడా అణచివేతకు గురవుతున్నట్లు తెలిపారు. మహిళలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. మహిళా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులను తమ పిల్లలుగా భావించి నాణ్యమైన విద్యతో పాటు సంస్కారం నేర్పించాలన్నారు. మహిళల రక్షణకోసం అనేక చట్టాలున్నాయని, వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు.  అంతకు ముందు మహిళా ఉపాధ్యాయులకు వివిధ ఆటలపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణకుమార్‌, కుడాల రవీందర్‌, మహిళా సభ్యులు అరుణ, చైతన్య, స్వప్న, సుహాసిని, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

అన్నింటా ప్రోత్సహించాలి..

మహిళలకు ఆలోచనా శక్తి, ఓపిక, సహనం ఎక్కువగా ఉంటాయని.. వారిని ప్రోత్సహిస్తే ఎన్నో విజయాలు సాధిస్తారని జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళా కండక్టర్లను సన్మానించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని పనులు చేయలేరని గతంలో అపోహలు ఉండేవని.. నేడు ఆకాశంలో విమానాలను సైతం మహిళలు నడుపుతున్నారని గుర్తుచేశారు. ఆర్టీసీలో ఇంత మంది మహిళలు పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. చెన్నైలో ఉన్నపుడు తాను స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఆటోను కాదని.. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించానని బాల్యస్మృతులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయ భాస్కర్‌రావ్‌, ప్రథమ శ్రేణి న్యాయమూర్తి అరుణకుమారి, ఆర్టీసీ ఆదిలాబాద్‌ డివిజనల్‌ మేనేజర్‌ పి. రమేశ్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ కల్పన, డిపో మేనేజర్‌ డి. శంకర్‌రావ్‌, సిబ్బంది పాల్గొన్నారు.


logo