మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Mar 08, 2020 , 00:39:42

‘మత్స్య’ కుటుంబాల్లో వెలుగులు

 ‘మత్స్య’ కుటుంబాల్లో వెలుగులు
నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారుల దశ, దిశ తిరిగిపోయింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. రాయితీపై చేపపిల్లలు, చేపలు పట్టేందుకు వలలు, రవాణా కోసం వాహనాలు, మత్స్యకార సంఘాలకు భవనాలు, మార్కెట్ల నిర్మాణం చేపట్టడంతో మత్య్స పరిశ్రమకు మంచిరోజులు వచ్చాయి. జిల్లాలో 156 నీటి వనరుల్లో 53,565 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. శ్రీరాంసాగర్‌, కడెం, స్వర్ణవాగు, గడ్డెన్నవాగు, పల్సిరంగారావుకర్‌ ప్రాజెక్టులతో పాటు సాగునీటి చెరువులు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అత్యధిక నీటి వనరులు నిర్మల్‌ జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, రాయితీతో జిల్లాలోని మత్స్యకారులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు. 


2800 మందికి లైసెన్సులు

జిల్లాలో 15వేల మంది మత్స్యకారులుండగా, 12వేల మంది మత్స్య పరిశ్రమతో ప్రయోజనం పొందుతున్నారు. జిల్లాలో 187 మత్స్య కార్మిక సంఘాలు రిజిస్టరుకాగా ఇందులో 8686మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నాయి. జిల్లాలో ఒక జిల్లా మత్స్య సహకార సంఘం, నాలుగు ఎస్సీ సహకార సంఘాలు, 36 మహిళా మత్స్య సహకార సంఘాలున్నాయి. జిల్లాలో శ్రీరాంసాగర్‌, కడెం, గోదావరి నదుల్లో చేపలు పట్టుకునేందుకు 2500 మందికి లైసెన్సులు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటి వరకు 2800 మందికి లైసెన్సులు ఇచ్చారు. దీంతో  రూ.7.14లక్షల ఆదాయం సమకూరింది. 


వందశాతం రాయతీపై సరఫరా

వందశాతం రాయితీపై గత మూడు, నాలుగేండ్లుగా చేప పిల్లలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. 2017-18లో 3.59కోట్లకుగాను 2.40కోట్ల చేప పిల్లలు, 2018-19లో 4.05కోట్లకుగాను 3.75కోట్లు చేప పిల్లలు పంపిణీ చేయగా.. 2019-20లో 4.41కోట్లు చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలో 632 చెరువులలో చేప పిల్లలను వదులుతున్నారు. చేపల వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న మత్స్యకార్మికులకు సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం చేయూతనిచ్చింది. వలలు, వాహనాలు, ఆటోలు, తూకం చేసే మిషన్లు, ట్రావెలింగ్‌ ఆటోలు, చేపలు భద్రపరిచే బాక్స్‌లను రాయితీపై అందించారు. 2017-18, 2018-19లో రూ.35కోట్ల నిధులను మంజూరు చేసింది. 32 రకాల పథకాలకు అర్హులైన మత్స్య కార్మికులకు 75శాతం సబ్సిడీపై అందించారు. 


ఇందులో 1849మోపెడ్‌ వాహనాలు, 1849ఐస్‌ బాక్స్‌లు, 1980 డిజిటల్‌ వెయింగ్‌ మిషన్లు, 276 ప్లాస్టిక్‌ ఫిష్‌ క్రేట్స్‌, 257 టెంట్లు, 73 లగేజ్‌ ఆటోలు, 1140 ప్లాస్టిక్‌ ఫిష్‌క్రేట్స్‌ సబ్సిడీపై అందించారు. 23సంచార వాహనాలు, రెండు పరిశుభ్ర చేపల రవాణా వాహనాలు, 35 పోర్టబుల్‌ టెంట్‌ కియోస్క్‌, ఒకటి ఫిష్‌ఫుడ్‌ కియోస్క్‌ వాహనం అందించారు. 75శాతం రాయితీపై 1348 మందికి వలలు మంజూరు చేశారు. దీని యూనిట్‌ ధర రూ. 20వేలు ఉండగా.. ఇందులో 75శాతం రాయితీ కింద రూ.15వేలు ప్రభుత్వం ఇస్తోంది. లబ్ధిదారుడు 25శాతం వాటా కింద రూ. 5వేలు చెల్లిస్తున్నాడు. జిల్లాలో 13 మత్స్యసహకార భవనాలకు రూ. 10లక్షల చొప్పున మంజూరు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు సారంగాపూర్‌, భైంసాలో చేపల మార్కెట్‌ను మంజూరు చేశారు. 


కార్మికులకు ‘పీఎం జీవనజ్యోతి’ అమలు

జిల్లాలో మత్స్య  కార్మికులకు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో 18-50 ఏండ్ల వారిని అర్హులుగా గుర్తించింది. జిల్లాలో 6700మంది ఈ బీమా పథకానికి అర్హులుగా గుర్తించారు. మరణించిన మత్స్యకార కుటుంబాలకు రూ. 6లక్షల బీమా చెల్లిస్తున్నారు. ఇప్పటికే చనిపోయిన ఒకరి కుటుంబానికి రూ. 6లక్షలు మంజూరు చేయగా.. మరో మూడు ప్రతిపాదనలు ఇన్సురెన్స్‌ కంపెనీకి పంపారు. సేవింగ్‌ కమ్‌ రిలీఫ్‌ పథకంలో భాగంగా 2019-20లో 1030 మంది లైసెన్సుదారులకు రూ.18.54లక్షలు, 2019-20లో 816మంది లైసెన్సుదారులకు రూ.22.11లక్షలు అందించారు. జిల్లాలో మత్స్య  పరిశ్రమ ద్వారా జీవనోపాధి పొందేందుకు చేపల చెరువుల నిర్మాణానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖతో సమన్వయం చేసుకొని  ఆయా ప్రాంతాల్లో చెరువుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. నీరు పుష్కలంగా ఉన్నచోట ఉపాధిహామీ పథకంలో చేపల చెరువుల కుంటల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గుండంపల్లి ప్రాంతంలో రెండింటికి అనుమతించారు. మిషన్‌ కాకతీయలో భాగంగా జిల్లాలో చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ చేయడంతో.. ఇవి నీటితో కళకళలాడుతున్నాయి. మూడు సీజన్లలో నీటితో చెరువులు నిండుకుండల్లా ఉండటంతో.. చేపల పెంపకానికి అనుకూలంగా మారాయి. logo
>>>>>>