మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Mar 07, 2020 , 00:06:28

కందుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట

కందుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట

మహారాష్ట్ర నుంచి కందులు జిల్లాకు రాకుండా నిరోధించడానికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర సరిహద్దుల్లోని నాలుగు ప్రాంతాల్లో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లాలోని వివిధ మార్కెట్‌ యార్డుల్లో పంట కొనుగోళ్లు జరుగుతుండగా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ రైతుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలోని ప్రైవేటు వ్యాపారులు సైతం పంటను కొనుగోలు చేస్తుండడంతో వ్యవసాయశాఖ అధికారులు దుకాణాల్లో కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నారు. రైతు పండించిన పంటకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉంటేనే కందులను కొనుగోలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో నిల్వలు ఉన్న సమాచారాన్ని కూడా వారు సేకరిస్తున్నారు.

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలో రైతులు వానాకాలం సీజన్‌లో పత్తి తర్వా త సోయాబీన్‌, కంది పంటను ఎక్కువగా సాగుచేస్తారు. పత్తి, సోయాబిన్‌లో అంతర పంటతో పాటు విడిగా కంది పంటను కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటను విక్రయించడంతో పాటు ఇండ్లలో వినియోగించడానికి ఉపయోగిస్తారు. గతేడాది వానాకాలం సీజన్‌ చివర కురిసిన వర్షా ల కారణంగా కంది పంట దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఈ ఏడాది సీజన్‌ ప్రారం భం నుంచి ఈ పంట సాగుకు వర్షాలు బాగా కురియడంతో పాటు, వాతావరణం అనుకూలించిం ది. దీంతో  పంట దిగుబడులు ఆశాజనకంగా ఉ న్నాయి. ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. ఈ ఏడాది కంది క్వింటాకు రూ. 5,800 మద్దతు ధర ప్రకటించగా రైతులు సాగుచేసిన పంటను కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది కంది క్వింటాకు రూ.5,675 మద్దతు ధర ఉండగా ఈ ఏడాది రూ.125 పెరిగింది. రైతులకు మద్దతు ధర లభించేలా జిల్లాలోని అన్ని మార్కెట్‌ యార్డుల్లో  నాఫెడ్‌ ద్వారా పంటను కొనుగోళ్లు ప్రారంభించారు. జిల్లాలోని ఈ సీజన్‌లో 2.22 లక్షల క్వింటాళ్ల పంటను సేకరించాలని అధికారులు లక్ష్యంగా ఎంచుకోగా వివిధ మార్కెట్‌యార్డుల్లో పంట కొనుగోళ్లు సాగుతున్నాయి.

అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా.. 

జిల్లాకు సరిహద్దులో ఉన్న మహారాష్ర్టలోని వివిధ ప్రాంతాల్లో రైతులు కందిపంటను ఎక్కువగా సాగుచేస్తారు. మహారాష్ట్రలోని వ్యాపారుల రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన కొందరు దళారులు మహారాష్ట్ర నుంచి పంటను కొనుగోలు చేసి జిల్లాలోని మార్కెట్‌ యార్డుల్లో రైతుల పేరిట మద్దతు ధరకు పంటను అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కందుల అక్రమ రవాణాను నివారించేందుకు అధికారులు ఇటీవల పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాకు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న బోథ్‌ మండలం ఘన్‌పూర్‌, తలమడుగుల మండలం లక్ష్మీపూర్‌,  జైనథ్‌ మండలం అనంతపూర్‌, బేల మండలం కొబ్బాయి గ్రామాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు, రెవెన్యూ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో విజిలెన్స్‌ బృందాలను ఏర్పాటు చేసి పంట కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు.

విస్తృతంగా తనిఖీలు..

మండల స్థాయి బృందాల్లో తహసీల్దార్‌, ఎస్సై, మండల వ్యవసాయశాఖ అధికారి, మార్కెటింగ్‌ కార్యదర్శితో కూడిన సభ్యులు ఉండగా వీరు మార్కెట్‌ యార్డుల్లో పంట కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోళ్లను పరిశీలిస్తున్నారు. కందుల నిల్వల పై పక్కా సమాచారాన్ని  సేకరించే పనిలో ఉన్నారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో పాటు ఇతర అధికారులు మహారాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను పరిశీలించి వాహనాల తనిఖీ తీరును పరిశీలిస్తున్నారు. మార్కెట్‌ యార్డుల్లో పంటను విక్రయానికి తీసుకువచ్చే రైతుల వివరాలను తెలుసుకుంటున్నారు. జిల్లాలోని కందుల కందుల కొనుగోళ్లకు లైసెన్స్‌ కలిగిన వ్యాపారుల దుకాణాల్లో కూడా రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులు పరిశీలిస్తున్నారు. కందుల అక్రమ రవాణాపై అధికారులు తీసుకుంటున్న చర్యలతో పంట విక్రయాల్లో దళారుల ప్రమేయం తగ్గనున్నది.


logo
>>>>>>