గురువారం 09 ఏప్రిల్ 2020
Nirmal - Mar 07, 2020 , 00:03:24

లెక్క తేలింది !

లెక్క తేలింది !

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ :  నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈచ్‌వన్‌-టీచ్‌వన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిరక్ష్యరాస్యులను గుర్తించాలని మున్సిపాలిటీలకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు  77 మంది రిసోర్స్‌పర్సన్లను నియమించి ఆదిలాబాద్‌ పట్టణంలోని 49 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి 48,720 కుటుంబాల సర్వే చేపట్టారు. బల్దియా పరిధిలోని పాత, కొత్తగా విలీనమైన గ్రామాల్లో 9,522 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు లెక్క తేలింది. ఈ వివరాలను సీడీఎంఏ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. త్వరలో నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌ కార్యక్రమంలో భాగంగా రాత్రి బడులను ప్రారంభించనున్నది. 

బల్దియా పరిధిలో 9,522 మంది నిరక్షరాస్యులు.. 

నిరక్ష్యరాస్యుల సంఖ్య తగ్గించి అక్షరాస్యత శాతం పెంపునకు ప్రణాళికలను రూపొందించి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈచ్‌ వన్‌ - టీచ్‌ వన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించడానికి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బల్దియాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొత్తం 49 వార్డుల్లో 48,720 కుటుంబాల్లో సర్వే చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి చదువుకోని వారి వివరాలు సేకరించారు. కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారు..? వారిలో ఎంత మంది చదువుకున్నారు..? వారి వృత్తి ఏమిటీ..? అనే అంశాలు రూపొందించారు. 

వాటన్నింటినీ సరైన ప్రొఫార్మలో నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ న ఉంచి మార్చి నాలుగో తేదీ వరకు నిర్వహించిన సర్వేలో 9,522 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గుర్తించారు. రోజువారీగా సేకరించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన సీడీఎంఏ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. 

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా.. 

వంద శాతం అక్షరాస్యత సాధించడమే ఈ కార్యక్రమ అంతిమ లక్ష్యం. ప్రాంతాల వారీగా ప్రతి వంద మందికి ఒక కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఒక ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు చదువుకుంటే ఆ కుటుంబంలోని మిగతా సభ్యులకు వీరే చదువు చెప్పి అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్షరాస్యత అనేది కుటుంబ సమగ్ర అభివృద్ధిలో కీలకమని, దీంతో సమాజ ప్రగతిలో కీలకాంశం అవుతున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. దీని ప్రకారం ఈ విషయాన్ని ప్రాధాన్యతా అంశంగా తీసుకొని ఆ మేరకు పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నది. ప్రాంతాల వారీగా నిరక్షరాస్యుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేసి రాత్రి బడులను నిర్వహించనున్నది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలతో మెప్మా అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలను అందజేశారు. త్వరలో రాత్రి బడులు ప్రారంభం కానుండగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. 


logo