మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Mar 07, 2020 , 00:02:24

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పరిసరాల పరిశుభ్రత పాటించాలిజైనథ్‌: గ్రామాల్లో పరిశుభ్రత లేకపోవడంతోనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. ఇంటి పరిసరాలతో పాటు ఇండ్లను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. పల్లెనిద్రలో భాగంగా గురువారం రాత్రి కాప్రి గ్రామంలో కలెక్టర్‌ బసచేశారు. శుక్రవారం ఉదయాన్నే అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలోని వాడవాడలో కలియదిరిగారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్తబుట్టలో చెత్తను వేస్తున్నారా లేదా అని కలెక్టర్‌ స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ పరిశీలించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డితో పాటు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. ఇంటింటికీ ఐదు పూల, పండ్ల మొక్కలను నాటుకోవాలన్నారు. 

ఆరు బయట మలమూత్ర విసర్జన చేస్తే జరిమానా విధించాలి

గ్రామస్తులు ఆరుబయట మలమూత్ర విసర్జన చేయడంతోపాటు చెత్తను బయటపారేస్తే జరిమానా విధించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం రూ.12వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తారన్నారు. ముఖ్యంగా గ్రామంలో వలసలు వచ్చిన వారు అధికంగా ఉంటే సామూహిక మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. ఇక నుంచి కాప్రి గ్రామ ప్రజలందరూ ఆరుబయట మలమూత్ర విసర్జన చేయబోమని, చెత్తను బయట పారేయబోమని కలెక్టర్‌ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. తిరిగి తమ గ్రామాన్ని సందర్శించినప్పుడు వందశాతం మరుగుదొడ్లతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఉండాలన్నారు. అప్పుడే ఈ గ్రామంలో గ్రామస్తులతో కలిసి భోజనం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హరితహారం ప్లాంటేషన్‌తో పాటు కంపోస్టు షెడ్‌ను ప్రారంభించారు. కంపోస్టు షెడ్‌లో తడిపొడి చెత్తలను ఎలా వేరు చేస్తారని అధికారులకు అడిగారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులు పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలని సూచించారు. అంతకు ముందు జీపీ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో కిషన్‌, డీఆర్‌డీవో రాజేశ్వర్‌ రాథోడ్‌, ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌, జడ్పీటీసీ తుమ్మల అరుందతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ లింగారెడ్డి, తహసీల్దార్‌ మహేంద్రనాథ్‌, ఎంపీడీవో గజానన్‌, ఎంపీవో వెంకటరాజు, ఏపీవో జగ్గేరావు, ఏపీఎం చంద్రశేఖర్‌, ఏవో వివేక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చంద్రశేఖర్‌, విద్యుత్‌శాఖ జేఈ శంకర్‌, ఇరిగేషన్‌ జేఈ మారుతి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునీత దేవి, సర్పంచ్‌ ఎల్టీ రమీల, ఎంపీటీసీ సోమ ఇంద్రబాయి, పంచాయతీ కార్యదర్శి మౌనిక రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

logo
>>>>>>