శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Mar 05, 2020 , 00:53:22

పట్టణ ప్రగతి సక్సెస్‌

పట్టణ ప్రగతి సక్సెస్‌

నిర్మల్‌ టౌన్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి విజయవంతమైంది. ఫిబ్రవరి 24 నుంచి ఈ నెల 4 వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో ప్రారంభించగా.. భైంసాలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖానాయక్‌, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు ప్రారంభించారు. ఇటీవల ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు గండ్రత్‌ ఈశ్వర్‌, అంకం రాజేందర్‌, సఫియా బేగంతో పాటు వైస్‌ చైర్మన్లు, కౌన్సిల్‌ సభ్యులు, ప్రత్యేకాధికారులు పట్టణ ప్రగతిలో పాల్గొని ప్రజల భాగస్వామ్యంతో అన్ని వార్డులో పచ్చదనం పరిశుభ్రత, ప్రజల మౌలిక అవసరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మల్‌లో 42 వార్డులు, భైంసాలో 26వార్డులు, ఖానాపూర్‌లో 12వార్డుల్లో ప్రత్యేక పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా వార్డులకు జిల్లాస్థాయి అధికారులు పర్యవేక్షణ అధికారులుగా నియమించగా.. ప్రతివార్డుకు ప్రత్యేక అధికారిని నియమించడంతో వారి సమక్షంలో పనులను పర్యవేక్షించారు. ప్రతిరోజు ఏడు గంటలకే వార్డు ప్రత్యేకాధికారులతో పాటు వార్డు కమిటీలోని 15మంది సభ్యులు వార్డులను సందర్శించారు. 


వార్డులో పరిశుభ్రత నిర్వహణతో పాటు చెత్త సేకరణ, కాలనీలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలో భాగంగా వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, వంగిన విద్యుత్‌ స్తంభాలు, శ్మశాన వాటికల నిర్మాణం, మురికి కాలువల శుభ్రత, పాడుబడ్డ బావుల పూడ్చివేత, మురికి నీటి గుంతల పూడ్చివేత, తదితర పనులకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో మున్సిపల్‌ పారిశుద్ధ్య సిబ్బంది, ప్రత్యేక అధికారులు వార్డులో పరిశుభ్రత, హరితహారంలో మొక్కల సంరక్షణ, ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడుగుంతల నిర్మాణం, ప్లాస్టిక్‌ నివారణపై కూడా అవగాహన కల్పించారు. ముఖ్యంగా పది రోజుల ప్రణాళికలో అన్ని వార్డులను శుభ్రం చేశారు. జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి మంత్రి, కలెక్టర్‌, ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. భైంసా, ఖానాపూర్‌ మురికి వాడల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించారు. 


ఆన్‌లైన్‌లో అన్ని వివరాల నమోదు..

ఖానాపూర్‌, భైంసా, నిర్మల్‌ మున్సిపాలిటీల పరిధిలోని పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలపై నాడు-నేడు అనే శీర్షికతో అభివృద్ధి పనులపై ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారు. వార్డుల వారిగా నమోదు చేసి కలెక్టర్‌కు నివేదిక రూపంలో అందజేయనున్నారు. ఆయా వార్డుల్లో గుర్తించిన సమస్యల వారీగా బడ్జెట్‌ను రూపొందించేందుకు ఈ ఆన్‌లైన్‌ నమోదు  ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. చివరి రోజైన బుధవారం పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో భాగంగా

ఖానాపూర్‌లో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. భైంసాలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. నిర్మల్‌లోని పింజరిగుట్ట, చింతకుంటవాడ, శరత్‌మహల్‌, కళనగర్‌, పాత బస్టాండు ప్రాంతాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, వార్డు కౌన్సిలర్లు గండ్రత్‌ రమణ, అడ్ప పోశెట్టి, మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణలు పర్యటించి సమస్యలను గుర్తించారు. పరిష్కారానికి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. logo