శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Mar 04, 2020 , 05:22:05

అక్రమ లేఅవుట్లపై నజర్‌

అక్రమ లేఅవుట్లపై  నజర్‌
  • జిల్లాలో 80కి పైగా గుర్తింపు
  • అత్యధికంగా నిర్మల్‌లో 68 అక్రమ వెంచర్లు
  • నిబంధనలకు పాతర.. అక్రమాలదే జాతర
  • అసైన్డ్‌, శిఖం భూములనూ వదలని వైనం

జిల్లాలో అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా వీటిని గుర్తించడంతో పాటు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది.  జిల్లాలో 80కి పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందు లో అత్యధికంగా నిర్మల్‌లో 68 అక్రమ వెంచర్లు ఉండడం గమనార్హం. ప్రభుత్వ అనుమతి లేకుండా అడ్డగోలుగా వెలిసిన అక్రమ వెంచర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల్లో కదలిక మొదలైంది. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేయగా, అసైన్డు, చెరువు శిఖం భూములను కూడా కబ్జా చేసి అక్రమంగా లేఅవుట్లు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు నష్టపోతుండగా ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలనే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు. -నిర్మల్‌/ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి


నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: అక్రమ లేఅవుట్లపై సర్కారు నజర్‌ పెట్టింది. పట్టణ ప్రగతిలో భాగంగా వీటిని గుర్తించడంతో పాటు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. జిల్లాలో 80కి పైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించి, వాటిపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీలుండగా.. ఈ పట్టణాల్లో విచ్చలవిడిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కొనసాగుతున్నది. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రం కావడం, ఖానాపూర్‌ కొత్త మున్సిపాలిటీ కావడం, భైంసా పట్టణం వాణిజ్యపరంగా అభివృద్ధి చెందడంతో  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మరింత జోరందుకుంది. పట్టణాల్లోని భూములతో పాటు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా ప్లాట్లుగా మార్చేస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మారుస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకోవడం లేదు. కొంద రు మాత్రమే వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు చేసేందుకు రెవెన్యూశాఖకు నాలా చెల్లించి వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటున్నారు. కొందరు మాత్రమే డీటీపీసీ అనుమతులు పొంది లేఅవుట్లు చేస్తుండగా.. చాలాచోట్ల నాలా కన్వర్షన్‌, డీటీపీసీ అనుమతులను తీసుకోవడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేసి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. ఖాళీ జాగా కన్పిస్తే చాలు ఇక ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ఎకరాల్లో భూములు కొని ప్లాట్లుగా మార్చి అడ్డగోలు ధరకు విక్రయిస్తున్నారు. 


అడ్డగోలుగా వెంచర్ల ఏర్పాటు

చెరువు శిఖం భూములు, కాల్వలు, కుంటలు, పంట పొలాలు, గుట్టలు వంటి ప్రదేశాలను రియల్‌ వెంచర్లుగా మార్చేస్తున్నారు. నిర్మల్‌ పట్టణంలోని సిద్దాపూర్‌, ఆదర్శనగర్‌, సోఫినగర్‌, రాంనగర్‌, గాజులపేట్‌, విశ్వనాథ్‌పేట్‌, వైస్సార్‌కాలనీ, ప్రియదర్శినినగర్‌ కాలనీలతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా అడ్డగోలుగా అక్రమ వెంచర్లు వెలిశాయి. భైంసాలో సుద్దవాగు సమీపంలో, భైంసా- నిర్మల్‌ రోడ్డు, బస్టాండు సమీపంలో, నేతాజీనగర్‌ వద్ద అక్రమంగా వెంచర్లు వెలిశాయి. కొత్తగా ఏర్పడిన ఖానాపూర్‌ మున్సిపాలిటీలోనూ అడ్డగోలుగా వెంచర్లు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే, భూమి స్వభావం మార్చకుండానే పన్నులు చెల్లించకుండానే వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. దీంతో ఈ అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు అనుమతులు లేని వెంచర్లతో ప్రభుత్వపరంగా రహదారులు, మురికి కాలువలు, విద్యుత్‌, తదితర వసతులు ఉండడం లేవు. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు ఎగగొడుతున్నారు.


ప్రభుత్వ భూములు కబ్జా 

జిల్లాలో 80కి పైగా అక్రమ వెంచర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నిర్మల్‌లో 68, ఖానాపూర్‌లో 4, భైంసాలో 8కి పైగా అక్రమ వెంచర్లు ఉన్నాయి. భైంసాలో అసలు ఒక వెంచరు కూడా అనుమతి తీసుకోలేదు. వీఎల్‌టీ ( ఖాళీ స్థలం పన్ను) మాత్రమే చెల్లించి ప్లాట్లను విక్రయిస్తున్నారు. నిర్మల్‌లో ప్రభుత్వ భూములను, చెరువు శిఖం భూములను కబ్జా చేసి వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వ భూములను తిరిగి వెనక్కి అప్పగించి.. డీ1 పట్టాలను ఈ భూములకు సర్దుబాటు చేస్తున్నారు. వీటిలో కూడా వెంచర్లు చేయడం గమనార్హం. జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో అక్రమ వెంచర్లు గుర్తించగా.. వీటిపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు. పట్టణ ప్రగతిలో భాగంగా అక్రమ వెంచర్లను గుర్తించడంతో పాటు వీటిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 


logo