బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Mar 04, 2020 , 05:18:39

ఒత్తిడిని జయిస్తేనే.. ‘పరీక్ష’ కాలంలో ప్రశాంతతే మేలు

ఒత్తిడిని జయిస్తేనే.. ‘పరీక్ష’ కాలంలో ప్రశాంతతే మేలు
  • విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి
  • నేటి నుంచి ఇంటర్‌, 19 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం

సారంగాపూర్‌ : వార్షిక పరీక్షలంటేనే ప్రతి విద్యార్థి ఒత్తిడికి లోనవుతారు. అందులోనూ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలంటే మరింత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని ఎవరైతే దరిచేరనీయరో వారే విజేతలవుతారు. తరగతి గదుల్లో ప్రతి నెలా చకచకా రాసే పరీక్షలు.. వార్షిక పరీక్షలకొచ్చే సరికి విద్యార్థులు ఒకింత ఒత్తిడికి లోనవుతారు. ఈ క్రమంలో అనుకున్నది రాయలేకపోవడం, లోలోపల భయంతో ఒకదానికి బదులు ఇంకోటి రాసేయడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో మానసిక ఒత్తిడిని జయిస్తే ప్రతి విద్యార్థినీ చదువుల తల్లి అనుగ్రహిస్తుంది.  19న 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి  నుంచి ఇంటర్మీడియట్‌, 19వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో జంబ్లింగ్‌ పద్ధతి ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమికోన్నత పాఠశాలల్లో, కళాశాలల్లో పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధులవుతున్నారు. విద్యార్థుల్లో ఇప్పటికే పాఠశాలల, కళాశాలల్లో సిలబస్‌ పూర్తయి పాఠ్యంశాల రివిజన్‌ ప్రక్రియను ఉపాధ్యాయులు పూర్తి చేశారు. 


ఆరోగ్యవంతమైన జీవితం ముఖ్యం.. 

ప్రతి విద్యార్థి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుల తల్లి కాటాక్షం సిద్ధిస్తుంది. మనం ఎంత చదువుతున్నా మానసిక ప్రశాంతత లేకపోతే అంతే సంగతి. దీనికితోడు మానసికంగా ఎంత దృఢంగా ఉన్నా శారీరకంగా ఆరోగ్యంగా లేకపోతే పరీక్షలు సరిగ్గా రాయలేం. విద్యార్థి స్థితిని బట్టి ఉపాధ్యాయులు సక్రమంగా పాఠ్యాంశాల బోధన చేయాలి. విద్యార్థులు రోజూ వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించాలి. చదువుతున్న ప్రదేశంలోనూ పరిశుభ్రత, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. లేకపోతే అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. విద్యార్థులు ప్రతిరోజూ తెల్లవారు జామున లేని పాఠ్యాంశాలు చదివితే ఎక్కువగా గుర్తుంటుంది. దీనికితోడు మానసిక ప్రశాంతత కోసం కొంతసేపు వ్యాయాయం చేయాలి. ఇది దినచర్యలో భాగమైతే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అధిరోహించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


అదనపు తరగతులతో పురోగతి..

పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ తరగతుల్లో కొందరు విద్యార్థులు వెనుకబడి ఉంటారనేది ఉపాధ్యాయులకు తెలిసే ఉంటుంది. వారికి ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహిస్తే కొంతమేరకు సత్ఫలితాలు వచ్చే అవకాశముంది. తరగతి గదిలోని విద్యార్థులంతా ఒకేరకమైన మేథోశక్తితో ఉండరు. కాబట్టి ఎవరి మానసిక స్థితి ఎలా ఉంది? వారికి ఎలా చెబితే అర్థమవుతుందని గమనించి వారికి ఆ రీతిలో చెబితే ఫలితం ఉంటుంది. కొందరిని బాగా చదివించాలి. మరికొందరికి ఒకటికి రెండుసార్లు చెప్పాలి. ఇలాంటి చర్యలతో మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకశముంది. 


ప్రశాంతంగా పరీక్షలు రాయాలి..

పరీక్షలను ప్రశాంతంగా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. పరీ క్షలంటే భయపడితే మనం చదువుకున్న విషయాలను మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్‌ లేకుండా పరీక్ష కేం ద్రాలకు వెళ్లాలి. మనలో ఆత్మైస్థెర్యం నింపుకొని పరీక్ష బాగా రాస్తా మనే విశ్వాసంతో వెళ్లాలి. పరీక్షకు వెళ్లిన తర్వాత ఎవరి గురించి ఆలోచించకుండా మనం పరీక్ష రాస్తే మంచి మార్కులు సంపాదించవచ్చు. 

- పూజ, 10వ తరగతి విద్యార్థిని


భయం లేకుండా పరీక్షకు హాజరుకావాలి..

పరీక్ష సమయం కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి. పరీక్ష కేంద్రంలో ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు. చదువుకున్న విషయాలను మళ్లీమళ్లీ చదువుకోవాలి. అవసరమైతే నోట్స్‌ రాసుకోవాలి. పరీక్షలంటే భయం విడవాలి.

- ప్రసన్న, 10వ తరగతి విద్యార్థిని


సమయపాలన పాటించాలి..

విద్యార్థులు పరీక్షల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలి. ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. పరీక్షల సమయంలోనూ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. సమయాన్ని వృథా చేసుకోకుండా  ముందుకు సాగాలి. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఎలా చదువుతున్నారో చూడడంతో పాటు వారు భయపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

- రుక్మరాణి, టీచర్‌


మానసికంగా బలంగా ఉండాలి..

విద్యార్థులు పరీక్షలకు జాగ్రత్తగా హాజరుకావాలి. ముందు ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అర్థరాత్రి వరకు చదువుకోవడం వల్ల అంతకు ముందు చదివిన విషయాలను మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పరీక్ష రోజుల్లో సమయానికి నిద్రపోవడం చాలా అవసరం. పుష్టికర ఆహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు దృఢ సంకల్పంతో వెల్లాలి. 

- అవినాష్‌, డాక్టర్‌ 


మానసిక ఒత్తిడిని జయించాలి..

విద్యార్థులు పరీక్ష సమయాల్లో ఆందోళన చెందవద్దు. మాములుగా తమ పాఠశాలల్లో ఎలాగైతే పరీక్షలు రాస్తారో అలాగే వెళ్లాలి. తల్లి దం డ్రులు కూడా విద్యార్థులకు ఎప్పటి కపుడు ఆత్మైస్థెర్యం చెబుతూ ప్రొత్స హిస్తూ ఉండాలి. విద్యార్థులు ఒత్తిడి కి లోను కాకుండా వారితో తరచూ మాట్లాడాలి. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు ఎలా చదవాలో బోధిస్తూ వారిని వెన్నుతట్టి ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది. అనవసర భయాందోళనలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. పక్క వారిని గమనిస్తూ మన సమయాన్ని వృథా చేయొద్దు.  

- మధుసూదన్‌, ఎంఈవో, సారంగాపూర్‌ 


మానసిక ఒత్తిడిని జయిస్తేనే సత్ఫలితాలు..

విద్యార్థులు పదో తరగతిని ఉన్నత చదువులకు మొదటి మెట్టుగా భావించవచ్చు. ఈ  క్రమంలో పరీక్ష సమయంలో, ఉపాధ్యాయులు సబ్జెక్టును బోధిస్తున్నప్పుడు గానీ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువుపై శ్రద్ధ వహిస్తే 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇస్తూ వారికి చదువుపై శ్రద్ధ కలిగేలా చేయాలి. వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని పాఠ్యాంశాలు బోధించాలి. పాఠ్యాంశాలు రివిజన్‌ చేస్తున్న సమయంలో ఒకటికి రెండుసార్లు విద్యార్థులు అడిగిన అన్ని సందేహాలను నివృత్తి చేయాలి. అప్పుడే విద్యార్థిలోని అనుమానాలు తొలగి పరీక్షలను ఎలాంటి భయంలేకుండా, మానసికంగా సంసిద్ధమై బాగా రాసే అవకాశం ఉంటుంది.


logo
>>>>>>