సోమవారం 30 మార్చి 2020
Nirmal - Mar 02, 2020 , 23:23:32

ఉద్యమంలా..

ఉద్యమంలా..

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్‌ బల్దియా పరిధిలోని మొత్తం 49వార్డుల్లో ఉత్సాహంగా ప్రణాళిక పనులు కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు సోమవారం వాడవాడలో పారిశుద్ధ్య పనులు, హరితహారం, పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్‌ శ్రీదేవసేనతో పాటు ఎమ్మెల్యే జోగురామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, మున్సిపల్‌, ప్రత్యేక అధికారులు వార్డుల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అప్పటికప్పుడే పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మొక్కలు నాటుతూ వాటి సంరక్షణ, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

కలెక్టర్‌, ప్రజాప్రతినిధుల పర్యటన..

పట్టణ ప్రణాళిక పనులు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు సోమవారం మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు కొనసాగాయి. 5వ వార్డు పరిధిలో ఉన్న కొత్తకుమ్మరి వాడను కలెక్టర్‌ శ్రీదేవసేన సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. కాలనీ ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, హరిత హారంపై అవగాహన కల్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ పలువార్డుల్లో పర్యటిం చారు. కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ప్రణాళిక పనుల్లో భాగంగా మిషన్‌ భగీరథ పనులను పరిశీలించారు. మొక్కలు నాటుతూ నూతన కార్యక్రమాలకు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ శాంతినగర్‌ కాలనీతో పాటు పలు కాలనీలను సందర్శించి  పనులను పరిశీలించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని అప్పటికప్పుడే పరిష్కారానికి ఆదేశించారు. వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని ప్రత్యేక అధికారితో కలిసి ఖానాపూర్‌ కాలనీలో పనులను పరిశీలించారు.  

మెరుగు పడుతున్న సౌకర్యాలు..

ప్రజల భాగస్వామ్యంతో పలు వార్డుల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రమదానం కార్యక్రమాలను చేపడుతున్నారు. దారి పోడగునా ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. హరితహారంలో భాగంగా మొక్కలను నాటుతున్నారు.  ప్రజల సూచనల మేరకు ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. ఖాలీస్థలాల్లో పిచ్చి మొక్కలు, చెత్త తొలగింపుకు యజమానులకు నోటీసులు ఇస్తున్నారు. వంగిన కరెంటు స్తంభాలను తొలగించి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. కిందకు వేలాడుతున్న వైర్లను సరిచేస్తున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మురికి కాల్వలు నిర్మిస్తున్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ సౌకర్యాలను కల్పిస్తున్నారు. కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తూ నాలల పూడికను తొలగిస్తున్నారు. బ్లీచింగ్‌ పౌడర్‌ వేస్తున్నారు. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాల ద్వారా పట్టణ ప్రజలకు సౌకర్యాలు మెరుగు పడుతుండగా పట్టణ ప్రణాళికపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది.


ఇంటికో మొక్క  నాటండి: ఎమ్మెల్యే 

ఎదులాపురం: ఇంటికో మొక్క నాటి సంరక్షణ బాధ్యతను చేపట్టాలని ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి భాగంగా జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా కాలనీలో మొక్కనాటారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత, చెట్ల ఆవశ్యకత ఉందని అన్నారు. ఆయన వెంట జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజన్న, అదనపు కలెక్టర్‌ డెవిడ్‌, మున్సిపల్‌ కమిషన్‌ మారుతిప్రసాద్‌ తదితరులు ఉన్నారు.


logo