సోమవారం 30 మార్చి 2020
Nirmal - Mar 02, 2020 , 23:18:06

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఆదిలాబాద్‌ రూరల్‌: జిల్లాలోని ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థులకు బుధవారం నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి దస్రు నాయక్‌ తెలిపారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. 

హాజరుకానున్న విద్యార్థులు...

జిల్లా నుంచి ఇంటర్‌ ప్రథమలో  10380 మంది, ఒకేషనల్‌ కోర్సులో 1125 మంది, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో  7681 మంది, ఒకేషనల్‌లో 805 మంది, మొత్తం 19991 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. వీరికి ఈనెల 4 నుంచి 18వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

విద్యార్థులకు ఒక్క నిమిషం గండం...

పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కూడా విద్యార్థులకు పరీక్ష సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించరు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కాస్త ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందుగానే చూసుకోవాలని, పరీక్ష సమయం కంటే కనీసం గంట ముందు కేంద్రాలకు చేరుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

పరీక్ష కేంద్రాల్లో పూర్తయిన ఏర్పాట్లు..

జిల్లాలో బుధవారం నుంచి నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి 31 కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలక్‌ మందిర్‌లోనూ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు మినరల్‌ వాటర్‌ను సరఫరా చేయనున్నారు. ఎండలను దృష్టిలో పెట్టుకొని ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.  పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయాలకు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఇందు కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

144 సెక్షన్‌ విధింపు

ఇంటర్‌ పరీక్ష కేంద్రాలున్న ప్రాంతాల్లో 144 సెక్షన అమల్లో ఉంటుంది.  కేంద్రాల వద్ద ఎవరైనా గుమిగూడినా, పరీక్షకు ఇబ్బందులు సృస్టించినా పోలీసులు చర్యలు తీసుకుంటారు. అలాగే పరీక్ష కేంద్రాలకు దగ్గరలో ఉన్న జిరాక్స్‌ సెంటర్‌లను మూసి ఉంచనున్నారు. గత ఏడాది నార్నూర్‌లో ఇంటర్‌ పేపర్‌ అవుట్‌ అయిన నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలను సీసీ కెమెరాల ముందు మాత్రమే ఓపెన్‌ చేయనున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుంది.

సెల్‌ఫోన్ల నిషేధం..

పరీక్ష కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి సైతం సెల్‌ఫోన్లను అనుమతించరు. ఒక్క సీఎస్‌ మాత్రమే అది పరిమిత కాలపరిమితితో సెల్‌ఫోన్‌ వాడవచ్చు. విద్యార్థులు అటెండెన్స్‌ మెసేజ్‌ కోసమే సెల్‌ఫోన్‌ ఉపయోగించవచ్చు. మిగతా సిబ్బంది సెల్‌ఫోన్‌ తీసుకువస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


logo