శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Mar 01, 2020 , 01:32:27

సహకారం.. సంపూర్ణం

సహకారం.. సంపూర్ణం

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సహకార ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమైంది. నెల రోజులుగా కొనసాగుతున్న సహకార ఎన్నికల ప్రక్రియకు శనివారంతో తెరపడింది. ఉమ్మడి జిల్లాలో 77పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించగా వీటిలో 72 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, మూడు బీజేపీ, రెండు కాంగ్రెస్‌ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇక డీసీసీబీ డైరెక్టర్లలో 20కిగాను 17కి నామినేషన్లు వేయగా మూడింటికీ ఆ రిజర్వేషన్‌ కోటాలో అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్నాయి. 17డైరెక్టర్లను టీఆర్‌ఎస్‌ వారే ఏకగ్రీవంగా గెలుచుకోగా.. డీసీఎంఎస్‌కు సంబంధించి 10డైరెక్టర్లను టీఆర్‌ఎస్‌ వారే ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏకగ్రీవంగా దక్కించుకున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ,  దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి.. అధిష్టానానికి జాబితా పంపించారు. అభ్యర్థుల ఎంపికను అధినాయకత్వానికి వదిలేశారు. దీంతో జిల్లాలో పార్టీలో విభేదాలకు  తావు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అభ్యర్థులను ఎంపిక చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే అధిష్టానం సూచించిన వారే నామినేషన్లు వేయగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


ఏకగ్రీవం.. ఏకపక్షం

సహకార సంఘాలకు జిల్లా ఇన్‌చార్జిగా పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌గుప్తా వ్యవహరించగా.. రాష్ట్ర మంత్రి అల్లోల ఆధ్వర్యంలో అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నాలుగు పదవులు ఏకగ్రీవంగా, ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ వారే దక్కించుకున్నారు. సహకార ఎన్నికల్లో జిల్లా స్థాయి పదవుల్లో అన్ని జిల్లాలు, వర్గాలకు టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం సమాన ప్రాధాన్యత కల్పించింది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్ని వర్గాలు, ప్రాంతాలకు డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల్లో అవకాశం కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రామాణికంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులుండగా.. డైరెక్టర్లతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల్లోనూ అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి సమ ప్రాధాన్యం దక్కేలా చూసింది. డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించగా.. వైస్‌ చైర్మన్‌ పదవిని ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవిని బీసీ సామాజికవర్గానికి కేటాయించగా.. వైస్‌ చైర్మన్‌ పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి కట్టబెట్టారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా.. అన్ని సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పించడం గమనార్హం.


నాలుగు జిల్లాల వారికి ప్రాధాన్యం

డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఆదిలాబాద్‌ జిల్లాకు, వైస్‌ చైర్మన్‌ పదవిని నిర్మల్‌ జిల్లాకు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పదవిని మంచిర్యాల జిల్లాకు, వైస్‌ చైర్మన్‌ పదవిని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు ఇచ్చారు. దీంతో నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు ఇచ్చి.. అన్ని జిల్లాల వారికి జిల్లా స్థాయి సహకార పదవుల్లో ప్రాతినిధ్యం ఉండేలా అధినాయకత్వం చర్యలు చేపట్టింది. డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన నాందేవ్‌ కాంబ్లేది ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని నార్నూర్‌ మండలంకాగా.. ఈ మండలం ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోనే ఉంది. వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన ఎర్ర రఘునందన్‌రెడ్డిది నిర్మల్‌ జిల్లాలోని లక్ష్మణచాంద మండలం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ఎన్నికైన తిప్పని లింగయ్యది మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన కొమురం మాంతయ్యది కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌(టి) నియోజకవర్గంలోని కౌటాల మండలం. గతంలో డీసీసీబీ చైర్మన్‌ ఆదిలాబాద్‌(తలమడుగు), డీసీఎంఎస్‌ చైర్మన్‌ నిర్మల్‌ (కౌట్ల-బి)/మంచిర్యాల (లక్సెట్టిపేట), డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ నిర్మల్‌(సత్తెనపల్లి), డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ నిర్మల్‌(కడెం) నుంచి ఉన్నారు. గతంలో మాదిరిగానే డీసీసీబీ చైర్మన్‌ ఆదిలాబాద్‌, వైస్‌ చైర్మన్‌ నిర్మల్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ మంచిర్యాల ప్రాంతాల వారికి ఇవ్వగా.. ఈ సారి డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా  వారికిచ్చారు. ఇలా నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు ఇచ్చి.. సమాన ప్రాధాన్యత కల్పించారు.


నియోజకవర్గాల వారీగా..

నియోజకవర్గాల పరంగా చూస్తే.. గతంలో బోథ్‌ నియోజకవర్గంలోని తలమడుగు పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఉన్న ముడుసు దామోదర్‌రెడ్డి.. డీసీసీబీ చైర్మన్‌గా ఉన్నారు. తాజాగా ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని నార్నూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా గెలిచిన నాందేవ్‌ కాంబ్లే.. డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గతంలో నిర్మల్‌ నియోజకవర్గం సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి) పీఏసీఎస్‌ చైర్మన్‌గా గెలిచిన అయిర నారాయణరెడ్డి.. డీసీఎంఎస్‌ చైర్మన్‌కాగా కొన్ని రోజుల తర్వాత పదవి కోల్పోయారు. దీంతో ఆయన స్థానంలో మంచిర్యాల నియోజకవర్గంలోని లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని డీసీఎంఎస్‌ చైర్మన్‌గా చేశారు. తాజాగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా అదే లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఉన్న తిప్పని లింగయ్యకు అవకాశం లభించింది. ఈ పీఏసీఎస్‌ నుంచి ఎన్నికైన ఇద్దరు పీఏసీఎస్‌ చైర్మన్లకు వరుసగా డీసీఎంఎస్‌ చైర్మన్లుగా అవకాశం లభించింది. ఖానాపూర్‌ మండలం సత్తెన్నపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డికి గతంలో డీసీసీబీ వైస్‌ చైర్మన్‌గా ఉండగా.. కొన్ని రోజుల తర్వాత పదవిని కోల్పోయారు. తాజాగా డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పదవి.. నిర్మల్‌ నియోజకవర్గంలోని లక్ష్మణచాంద పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎర్ర రఘునందన్‌రెడ్డికి దక్కింది. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కడెం మండలానికి చెందిన ఎట్టం దేవన్న ఉండగా.. ప్రస్తుతం సిర్పూర్‌(టి) నియోజకవర్గం కౌటాల మండలం గురుడిపేట పీఏసీఎస్‌ చైర్మన్‌ కొమురం మాంతయ్యకు అవకాశం ఇచ్చారు.logo