శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Mar 01, 2020 , 01:31:49

పట్టణం మురిసె.. ప్రగతి మెరిసె!

పట్టణం మురిసె.. ప్రగతి మెరిసె!

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం కావడంతో.. దీని స్ఫూర్తిగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తోంది. పట్టణ ప్రాంతాలు పరిశుభ్రంగా, చక్కని పారిశుద్ధ్య నిర్వహణతో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో ఫిబ్రవరి 24నుంచి మార్చి 4 వరకు పది రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నారు. 24 నుంచి జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లోని 80 వార్డులలో చురుకుగా కొనసాగుతున్నది.నిర్మల్‌లోని కూరన్నపేట్‌లో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించగా.. పలు మార్లు వార్డుల్లో పర్యటించారు. భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో స్థానిక ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌ ప్రారంభించి పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్మికులు రోజు కూలీలతో రోడ్లు, జేసీబీ, బ్లేడ్‌ ట్రాక్టర్లతో మురికి కాలువల శుభ్రం, చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలు తొలగిస్తున్నారు. రహదారుల పక్కన ఉన్న పొదళ్లను, పిచ్చి మొక్కలను, భవన నిర్మాణ వ్యర్థాలు, మట్టి, ఖాళీ స్థలంలో ఉన్న చెత్త కుప్పలను తొలగిస్తున్నారు. 


మురికి కాలువల శుభ్రం, పూడికతీత, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాలకు కావాల్సిన స్థలాలను, వంగిన, తుప్పు పట్టిన విద్యుత్‌ స్తంభాలను గుర్తిస్తున్నారు. నిర్మల్‌ పట్టణంలో రోడ్లను శుభ్రం చేసేందుకు 50మంది, మున్సిపాలిటీకి 10మంది దినసరి కూలీలు, మురికి నీటి కాలువల శుభ్రానికి 30మంది సిబ్బందిని, 60మంది దినసరి కూలీలను నియమించి పనులు చేపట్టారు. మూడు జేసీబీలు, నాలుగు బ్లేడ్‌ ట్రాక్టర్లు, ఒక హిటాచి ప్రత్యేక వాహనాలు, పురపాలక సంస్థకు చెందిన 9 ట్రాక్టర్లు, 19 ఆటోలు, ఒక జేసీబీ వినియోగిస్తున్నారు. వార్డులో 144.10 కి.మీ మేరకు రోడ్లను శుభ్రం చేశారు. నాలుగు లైన్ల రోడ్డు 20.50కి.మీ. గుర్తించి పూడ్చారు. రెండు లైన్ల రోడ్డు 60.70కి.మీ. గుర్తించి.. 21.20కి.మీ., ఒక లైన్‌ రోడ్డు 60.90 కి.మీ. గుర్తించి 22.30కి.మీ. శుభ్రం చేశారు. 29.60కి.మీ. సీసీ, 6.70 కి.మీ. స్టోన్‌, 27.60 కి.మీ. కచ్చ కాలువలు శుభ్రం చేశారు. 136 ఖాళీ స్థలాల్లో చెత్తను గుర్తించి 32 స్థలాలను శుభ్రం చేయగా.. 9 నీటి వనరులను శుభ్రం చేశారు. 20 ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను గుర్తించి.. వాటిలో 11 చోట్ల పరిసరా లు శుభ్రం చేశారు. 


భైంసాలో..

భైంసాలో 16మంది మున్సిపాలిటీ, 74మంది ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులతో పాటు 38మంది దినసరి కూలీలను పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం వినియోగించి.. పట్టణంలో రోడ్లను శుభ్రం చేస్తున్నారు. కాలువలను శుభ్రం చేసేందుకు 33మందిని నియమించారు. మున్సిపాలిటీకి చెందిన నాలుగు ట్రాక్టర్లను, ఒక జేసీబీ, 13 ఆటోలు, రోజు అద్దెపై మూడు ట్రాక్టర్లు, మూడు జేసీబీలు ఉపయోగించి 68.5 మెట్రిక్‌ టన్నుల చెత్తను తొలగించారు. ఖానాపూర్‌ మున్సిపాలిటీలో 26మంది మున్సిపాలిటీ సిబ్బంది, 37మంది రోజువారీ కూలీలు రోడ్లు ఊడ్చేందుకు, మురికి కాల్వలు శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు. నాలుగు మున్సిపల్‌ వాహనాలు, 17 ఇతర ప్రైవేటు వాహనాలు వినియోగించి.. చెత్తను తొలగిస్తున్నారు. 653వీధిలైట్లకుగాను.. 640వీధి లైట్లు ఏర్పాటు చేశారు. 30ప్రభుత్వ పాఠశాలలు, దవాఖానను గుర్తించగా.. వీటిలో 13చోట్ల శుభ్రం చేశారు. 165ఖాళీ ప్రదేశాలను గుర్తించగా.. 63చోట్ల పరిశుభ్రం చేశా రు. రోడ్లు, మురికి కాల్వలను శుభ్రం చేస్తుండడంతో.. పరిశుభ్ర వాతావరణం కనిపిస్తున్నది.
logo