బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 29, 2020 , 00:38:11

పల్లెలకు పైసలొచ్చాయ్‌..

పల్లెలకు పైసలొచ్చాయ్‌..

నిర్మల్‌ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి, పల్లె ప్రణాళిక కార్యక్రమాలను అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రామాల అభివృద్ధికి ప్రతినెలా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలుగా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ. 36కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం రూ. 9.52కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. విడుదలైన నిధుల్లో రూ. 8కోట్ల 56లక్షల 9వేలు కేంద్ర నిధులు కాగా.. రూ. 95లక్షల 93వేలు రాష్ట్ర నిధు లు ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం పల్లెల ప్రగతికి ప్రత్యేక కార్యాచరణతో అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్న నేపథ్యంలో పల్లెలకు ప్రతినెలా నిధులు విడుదల చేస్తోంది. జనవరికి సంబంధించిన నిధులు జిల్లాకు మొత్తం 9.52 కోట్లు విడుదల కావడంతో ఈ పనులతో జిల్లాలో ప్రగతి మరింత పరుగులు పెట్టనుంది.జిల్లాలో మొత్తం 396 గ్రామపంచాయతీలు కాగా ఏడు లక్షలకు పైగా జనాభా ఉంది. అన్ని గ్రామపంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన విడుదలైన నిధులను ఆయా గ్రామపంచాయతీల ఖాతాల్లో జమ చేయనున్నారు. జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఈ నిధులను ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ. 165 చొప్పున నిధులు వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు తెలిపారు. 


అభివృద్ధి పనుల పరుగు...

జిల్లాలో ఐదో విడత కింద పంచాయతీలకు నిధులు విడుదల కావడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరగనున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ నూతన పంచాయతీరాజ్‌ చట్టం -2018లో భాగంగా పల్లెల్లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం పరిశుభ్రతతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి జిల్లాల్లో అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రతినెలా నిధులు విడుదల చేయడంతో వచ్చిన నిధులతో ప్రజా ప్రాధాన్యం అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులను చేపడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో గ్రామానికో నర్సరీ, శ్మశాన వాటికల నిర్మాణం, చెత్త డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, హరితహారంలో మొక్కల సంరక్షణ, చెత్త షెడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీకో ట్రాక్టర్‌ కొనుగోలు వంటి కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ పనుల ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నారు.  స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా వందశాతం లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో పనుల లక్ష్యాన్ని పరిశీలించేందుకు ప్రతిరోజు మానిటరింగ్‌, రిపోర్టింగ్‌  నిర్వహిస్తున్నారు. 


logo