గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 28, 2020 , T01:02

అన్నదాత ఇంట.. సిరుల పంట !

అన్నదాత ఇంట.. సిరుల పంట !

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరుగుతున్నది.  జిల్లాలో గతేడాది వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. జిల్లాలో ప్రధానంగా ఎస్సారెస్పీ(సరస్వతీ కాలువ), కడెం, స్వర్ణ, సదర్మాట్‌, గడ్డెన్నవాగు ప్రాజెక్టులున్నాయి. జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో పాటు.. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో పలుమార్లు ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి కిందికి నీటిని వదిలారు. అన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ నిండుగా ఉన్నాయి. దీంతో వానాకాలంలో ఈ ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున వరిసాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 21వేల హెక్టార్లలో వరి సాధారణ సాగు విస్తీర్ణం ఉండగా.. రికార్డుస్థాయిలో 26వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. అంతకుముందు ఏడాది వానాకాలంలో సుమారు 1.20లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా.. గతేడాది కన్నా 50శాతం ధాన్యం ఎక్కువగా వచ్చింది. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ముగియగా.. అధికారిక లెక్కల ప్రకారం.. 1,31,859.502మెట్రిక్‌ టన్నుల ధాన్యం మార్కెట్‌కు విక్రయానికి  వచ్చింది. మరో 60వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ ఏడాది వానాకాలంలో 1.90లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

జిల్లాలో 148 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 148 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 32,462మంది రైతుల నుంచి 1,31,859.520మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు రూ. 241.73కోట్లను చెల్లించారు. జిల్లాలో 19రైస్‌ మిల్లులు ఉండగా..  ఇక్కడ 50వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేశారు. మిగతా ధాన్యాన్ని ఇతర జిల్లాలకు తరలించారు. గతేడాది కన్నాఈసారి 70వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి పెరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ ఫలితాలు రైతులకు అందుతున్నాయి. జిల్లాలో ప్రతిఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతుండగా.. ఈసారి గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు ఉండడం, భూగర్భజలాలు గణనీయంగా పెరగడం, చెరువులు,  కుంటల్లో నీటి నిల్వలు ఉండటంతో వరి సాగుకు ఢోకా లేకుండా పోయింది. 

విస్తారంగా వర్షాలు

వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురియడం, పుష్కలంగా నీటి నిల్వలు ఉండడం, బోరుబావుల్లో నీటి మట్టాలు పెరగడం, 24గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో ఖరీఫ్‌లో వరిసాగు పెరిగింది. దీంతో రైతుల ఇంట సిరులపంట పండింది. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. జనవరి వరకు కొనుగోలు చేయగా.. రైతులకు మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం అండగా నిలిచింది. 

జిల్లాలో ఎస్సారెస్పీ, స్వర్ణ, గడ్డెన్నవాగు, సుద్దవాగు, కడెం ప్రాజెక్టులకు వర్షాకాలంలో పుష్కలంగా నీరు రావడంతో నిండుకుండల్లా  ఉన్నాయి. వానాకాలంతో పాటు యాసంగిలోనూ ఈ ప్రాజెక్టుల కింద వరి పంటకు ఢోకా లేకుండాపోయింది. యాసంగిలో ఆయకట్టులో వరి సాగుకు వారబందీ పద్ధతిలో ప్రాజెక్టుల కింద సాగునీరు అందించారు. జిల్లాలో గతేడాది రబీ సీజన్‌లో 22వేల హెక్టార్లలో వరి సాగు చేయగా.. 1.07లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఈసారి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు ఉండటం, బోరుబావుల్లో భూగర్భజలాలు పెరగడంతో వరిసాగు గణనీయంగా పెరిగింది. రికార్డుస్థాయిలో ఈసారి యాసంగిలో 34,850హెక్టార్లలో వరి సాగు చేయగా.. 2.17లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ  లెక్కన గతేడాది యాసంగి కన్నా రెట్టింపు స్థాయిలో పంట దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు  యాసంగి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 60లక్షల గన్నీ సంచులు, వెయ్యి టార్పాలిన్లు, 52 ప్యాటీ క్లీనర్లు, తేమశాతం కొలిచే యం త్రా లు, ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. 


logo