బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 28, 2020 , T00:50

ప్రయోగాలకు దూరం.. సైన్స్‌ఫేర్లకే పరిమితం

ప్రయోగాలకు దూరం..  సైన్స్‌ఫేర్లకే పరిమితం

ఆదిలాబాద్‌ రూరల్‌ : నూతన ఆవిష్కరణలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి.. పాఠశాల దశ నుంచే విద్యార్థులకు వివిధ రకాల ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు వారిలో సృజనాత్మకతను పెంచేలా కృషి చేస్తున్నాయి.. కానీ జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. కేవలం ఇన్‌స్పైర్‌లాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా విద్యార్థులతో అప్పటికప్పుడు ప్రయోగాలు చేయించి ప్రదర్శిస్తున్నారే తప్ప విద్యార్థులు సొంతగా ప్రయోగాలు తయారు చేసి ప్రదర్శించేలా తర్పీదు ఇవ్వడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. నేడు జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. 

రూ.32లక్షలతో సైన్సు పార్కు నిర్మాణం..

విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో సుమారు రూ.32 లక్షలతో జిల్లా కేంద్రంలోని డైట్‌ కళాశాల హాస్టల్‌ వెనుక ప్రాంతంలో సైన్స్‌ పార్కును అభివృద్ధి చేశారు. జిల్లా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందనే ఆకాంక్షతో దీనిని నెలకొల్పారు. కానీ ఇక్కడికి విద్యార్థులను సంబంధిత సైన్స్‌ ఉపాధ్యాయులు తీసుకురాకపోవడంతో భారీ వ్యయంతో నిర్మించిన ప్రయోగాల మోడల్స్‌ వృథాగా పడిఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మంచి మంచి ప్రయోగాలను చిన్నారులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఇక్కడికి విద్యార్థులను తీసుకువచ్చి ఉపాధ్యాయులు ప్రయోగాలను చూపిస్తే వారికి కొంతమేరకైనా ప్రయోగాలపై ఆసక్తి కలిగి నూతన ఆవిష్కరణలు చేస్తారనే ఆశయం మొదట్లోనే నీరుకారుతున్నది.


జవహర్‌లాల్‌ నెహ్రూ సైన్స్‌ఫేర్‌కు విద్యార్థులు..

జిల్లా కేంద్రంలో డిసెంబర్‌లో నిర్వహించిన జవహర్‌లాల్‌ నెహ్రూ సైన్స్‌ఫేర్‌కు భారీగా విద్యార్థులు తరలివచ్చి ప్రయోగాలను ప్రదర్శించారు. కానీ వీటిలో ఆకట్టుకునే స్థాయిలో నూతన ఆవిష్కరణలు మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. చాలా పాఠశాలలు నామమాత్రంగానే సైన్స్‌ఫేర్‌లో పాల్గొన్నాయనే విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. సైన్స్‌ ఉపాధ్యాయులు విద్యాసంవత్సరం ఆరంభం నుంచి విద్యార్థుల్లోని మేథాసంపత్తిని ప్రోత్సహిస్తే వారు నూతన ఆవిష్కరణలు చేయడానికి ఆసక్తి చూపుతారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నూతన ఆవిష్కరణల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటును అందిస్తున్నా.. పట్టించుకొనే వారు లేకపోవడంతో విద్యార్థుల్లోని ఆవిష్కరణల శక్తి మందగించి పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


logo