గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 28, 2020 , T00:33

బాధ్యతగా పనిచేస్తేనే‘ పట్టణ ప్రగతి’ సాధ్యం

బాధ్యతగా పనిచేస్తేనే‘ పట్టణ ప్రగతి’ సాధ్యం

ఖానాపూర్‌: పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు బాధ్యతగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. గురువారం  ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. వీరి వెంట మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌తో పాటు ఆర్డీవో ప్రసూనాంబ, మున్సిపల్‌ కమిషనర్‌, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డులను సందర్శించారు. పట్టణంలో అస్థవ్యస్తంగా ఉన్న మురికికాలువలను పరిశీలించారు. కసాబ్‌ గల్లిలో డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు అధికారులకు విన్నవించారు. సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. కలెక్టర్‌ మాట్లాడుతూ...ఖానాపూర్‌లో ఇది వరకు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్లాట్లు చేయకపోవడంతోనే పట్టణంలో డ్రైనేజీ సమస్య ఏర్పడిందని అన్నారు. 

బొడ్టోనికుంటను మినీట్యాంకు బండుగా మారుస్తాం

శాంతినగర్‌ ఎగువ ప్రాంతంలో ఉన్న బొడ్టోనికుంటను ఎమ్మెల్యే రేఖానాయక్‌ కోరిక మేరకు మినీట్యాంకు బండుగా మార్చడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు. బొడ్టోనికుంట పరిసరాలను సందర్శించారు.  ఇంజనీరింగ్‌ విభాగానికి తెలిపి మినీట్యాంకు బండు నిర్మాణానికి అయ్యే వ్యయానికి సంబంధించి అంచనాలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యసేవలందడం లేదని పలువురు మహిళలు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. మార్చి నెల తరువాత కొత్తగా డాక్టర్ల భర్తీ జరుగబోతుందని పేర్కొన్నారు. ఖానాపూర్‌ సీహెచ్‌ఎన్‌సీ స్థాయి దవాఖాన అయినప్పటికీ ఇక్కడ ప్రసవాలు జరగడం లేదని, పక్కనే ఉన్న పెంబి పీహెచ్‌సీలో ప్రసవాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రేఖానాయక్‌ కలెక్టర్‌కు వివరించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, జూనియర్‌ కళాశాలను తనిఖీ చేశారు.ఉన్నత పాఠశాల ఉర్దు విభాగంలోని ఎనిమిదో తరగతికి వెళ్లి సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగారు. తరగతిలో ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పదార్థాలను పరిశీలించారు. బాలికలకు వాష్‌రూంలు సక్రమంగా లేవని, కొత్తగా నిర్మించాలని బాలికల తల్లితండ్రులు కలెక్టర్‌ను కోరారు. ఆర్టీసీ బస్టాండు పరిసరాలను, ప్రయాణికుల మరుగుదొడ్ల నిర్వహణను కలెక్టర్‌ పరిశీలించారు. బస్టాండ్‌లో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు.

బస్టాండ్‌, బడి ప్రాంగణంలో రైతు బజార్‌ 

పట్టణంలో కూరగాయల మార్కెట్‌ను ఏళ్లతరబడి నిర్వహిస్తున్నారని, పెరిగిన జనాభాకు సరిపోవడం లేదని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ఫారెస్ట్‌ కార్యాలయం ఎదుట ఉన్న నిరుపయోగంగా ఉన్న బస్టాండు, పాత స్కూలు ప్రాంగణాన్ని రైతు బజార్‌గా మార్చాలని ఎమ్మెల్యే సూచనకు కలెక్టర్‌ అంగీకరించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, కౌన్సిలర్లు కారింగుల సంకీర్తన, జన్నారపు విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ రాథోడ్‌ రాము, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ పుప్పాల గజేందర్‌, తిమ్మాపూర్‌ కోఆర్డినేటర్‌ కడార్ల గంగనర్సయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ బాలే మల్లేషం, తహసీల్దార్లు జే. నారాయణ, ఎర్ర నరేందర్‌, విశ్వంభర్‌, కలీం, వార్డుల ప్రత్యేక అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ కేహేచ్‌ ఖాన్‌, సురేశ్‌, జన్నారపు శంకర్‌, గొర్రె గంగాధర్‌, శేక్‌ నసీర్‌, సయ్యద్‌ ఫయీం, మోయిన్‌, రంజిత్‌ రావు, షకీల్‌, అంకం రాకేష్‌, పూసల మనోజ్‌, వొరుసు అభినయ్‌, కౌటమహేష్‌, షోయబ్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>