శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Feb 28, 2020 , T00:30

సరిహద్దుల్లో పులి

సరిహద్దుల్లో పులి

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నది. ఈ విషయం స్థానికులను ఆందోళన కలిగిస్తున్నది. మహారాష్ట్రలోని యావత్‌మల్‌ జిల్లా పాండ్రకవడ సమీపంలోని తిప్పేశ్వర పులుల అభయారణ్యం ఉంది. ఈ అటవీప్రాంతం జిల్లాలోని సరిహద్దు అటవీ ప్రాంతాలైన భీంపూర్‌, తాంసి, తలమడుగు, జైనథ్‌, బజార్‌హత్నూర్‌, బోథ్‌ మండలాల్లోని పలు గ్రామాలు ఈ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. భీంపూర్‌, తాంసి, జైనథ్‌ మండలాల్లో పెన్‌గంగా నది ప్రవహిస్తుండగా నదిపై అటుపక్కా తిప్పేశ్వర అభయారణ్యం ఉంటుంది. తిప్పేశ్వర అభయారణ్యంలో అటవీ విస్తీర్ణం మించి పులుల సంఖ్య పెరగడంతో ఆహారం, ఇతర అవసరాల కోసం దూర ప్రాంతాలకు సంచరిస్తుంటాయి. పెన్‌గంగా నదిని దాటుతున్న పులులు జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తున్నాయి. పంటపొలాలు, ఆవాసాలు, రోడ్లను దాటుకుంటూ వెళ్తుండగా స్థానికులకు కనిపిస్తున్నాయి. ఆహారం కోసం అటవీ పరిసర ప్రాంతాలకు మేత కోసం వచ్చిన పశువులపై దాడి చేసి హతమారుస్తాయి. భీంపూర్‌ మండలం తాంసి(కే), గొల్లఘాడ్‌ గ్రామాల్లో పశువులపై దాడికి పాల్పడింది. రెండు నెలల కిందట భీంపూర్‌ మండలం అర్లీ(టీ) రెండు ఎద్దులను పులులు చంపివేశాయి. మంగళవారం రాత్రి జైనథ్‌ మండలం నీరాల వద్ద రాత్రి సమయంలో పులి రోడ్డు దాటుతుండగా ఆదిలాబాద్‌ నుంచి బేలకు కారులో వెళ్తున్న వాహనదారునికి కంట పడింది. అనంతరం జైనథ్‌ మండలం మంగూర్లలో రెండు ఎద్దులపై దాడి చేసి హతమార్చింది.

రక్షణ చర్యలు.. 

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని పులి సంచరిస్తున్న గ్రామాల్లో అటవీశాఖ అధికారులు రక్షణ చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బందితో బెస్‌క్యాంపులు ఏర్పాటు చేసి పెట్రోలింగ్‌ చేస్తున్నారు. తాత్కాలిక వాచ్‌ టవర్‌లు నిర్మించి చేసి పులి కదలికలు పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అడవుల్లో తిరుగుతున్న పులిని  గుర్తించేందుకు సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు అటవీ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటపొలాల్లో వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసి పులి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు. పులి సంరక్షణ చర్యల్లో భాగంగా  స్థానికులు  అవగాహన కల్పిస్తున్నారు. పంట పొలాలను అటవీ జంతువులను కాపాడుకుని విద్యుత్‌ తీగలు, విష గుళికలు అమర్చవద్దని చెబుతున్నారు. వీటితో పాటు అవరిచిత వ్యక్తులు వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

అటవీ జంతువులను కాపాడుకోవాలి..

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన

అటవీ జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు.  గురువారం కలెక్టర్‌ బేల మండలం సైద్‌పూర్‌, జైనథ్‌ మండ లం మంగూర్ల, సాత్నాల గ్రామాల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. పులి కదలికలు ఉన్న గ్రామాల్లో  ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందవద్దని ప్రమాదం జరుగకుండా పోలీసు, అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంగూర్లలో పులిదాడిలో మరణించిన పశువులకు సంబంధించిన వారికి పరిహారం అందజేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.


logo