శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Feb 25, 2020 , 02:26:28

ఎన్నిక ఏకపక్షమే!

ఎన్నిక ఏకపక్షమే!నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సహకార సంఘాల పదవులపై గులాబీ పార్టీ గురి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ డీసీసీబీ, డీసీఎంఎస్‌ పదవులను టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడనున్నాయి. ఈ నెల 28న డైరెక్టర్లకు, 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 77  సహకార సంఘాలుండగా వీటిలో 72 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుచుకున్నారు. వీరి నుంచి డీసీసీబీకి 16మంది డైరెక్టర్లు, మరో నలుగురు బీ గ్రూపు సంఘాల నుంచి డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. డీసీఎంఎస్‌లో పది మంది డైరెక్టర్లు ఎన్నికవుతుండగా.. ఇందులో ఆరుగురు పీఏసీఎస్‌ల నుంచి, బీ గ్రూపు నుంచి నలుగురు డీసీఎంఎస్‌కు పాలకవర్గ సభ్యులుగా ఎన్నుకుంటారు. జిల్లాలో 72 పీఏసీఎస్‌లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు దక్కించుకోవడంతో పూర్తి మెజార్టీ ఉంది. దీంతో ఈనెల 28న నిర్వహించనున్న డైరెక్టర్ల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నెల 28న నిర్వహించే డైరెక్టర్ల ఎన్నిక కోసం నేడు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ఒకేరోజు చేస్తున్నారు. డీసీసీబీకి 20మందికి, డీసీఎంఎస్‌కు 10 మంది డైరెక్టర్లను ఈ నెల 28న ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగే అవకాశాలు ఉండగా.. అన్ని డైరెక్టరు పోస్టులు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ మద్దతుదారులు పెద్దగా లేకపోవడంతో ఎన్నికల్లో నామినేషన్లు వేసే అవకాశాలు కన్పించడం లేదు. టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల మెజార్టీ పూర్తిగా ఉండడంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ పోస్టులు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పోస్టులు ఏకపక్షంగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌లో టీఆర్‌ఎస్‌కే పూర్తి మెజార్టీ ఉండడంతో అన్ని స్థానాలు దక్కించుకోనుంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు సంబంధించి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని భావిస్తున్నారు. 


సమన్వయంతో ముందుకు..

రాష్ట్ర  మంత్రి అల్లోల నాయకత్వంలో జిల్లా ఎమ్మెల్యేలంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి అభ్యర్థులు ఎవరనేది జిల్లా ఎమ్మెల్యేలంతా చర్చించుకొని ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి పేర్లను ఏకాభిప్రాయం తో పంపాలని జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ పేర్లలో అధిష్టానం ఎవరిని ఖరారు చేసినా.. ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను పలువురు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలతో భేటీ అవుతుండగా, ఈ పదవుల విషయంలో ఏకాభిప్రాయానికి రానున్నారు. ఇప్పటికే అధిష్టానానికి కొన్ని పేర్లను కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ అభ్యర్థులు ఎవరనేది అధికారికంగా అధిష్టానం ప్రకటించనుంది.


నాలుగు జిల్లాలకు పదవులు..

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను ప్రామాణికంగా తీసుకుని డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన జరిగినప్పటికీ డీసీసీబీ, డీసీఎంఎస్‌ మాత్రం ఉమ్మడిగానే ఉంది. ఉమ్మడి జిల్లాలో 77 పీఏసీఎస్‌లుండగా.. నిర్మల్‌ జిల్లాలో 17, మంచిర్యాల జిల్లాలో 20, ఆసిఫాబాద్‌ జిల్లాలో 12, ఆదిలాబాద్‌ జిల్లాలో 28 చొప్పున పీఏసీఎస్‌లున్నాయి. తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను సమానంగా ఇవ్వాలని జిల్లా ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు జిల్లాలకు నాలుగు పదవులు వచ్చేలా పంపకాలు చేయాలని ఎమ్మెల్యేలంతా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల్లో ఒక జిల్లాకు చైర్మన్‌, మరో జిల్లాకు వైస్‌ చైర్మన్‌ వచ్చేలా నాలుగు జిల్లాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పశ్చిమ జిల్లాకు సంబంధించి ఒక చైర్మన్‌, ఒక వైస్‌ చైర్మన్‌, తూర్పు జిల్లాకు సంబంధించి ఒక చైర్మన్‌, ఒక వైస్‌ చైర్మన్‌ పదవి ఇచ్చేలా దృష్టి పెట్టారు. ఈ నెల 28న డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్ల ఎన్నికలుండగా.. నేడు నామినేషన్లు వేయనున్నారు. ఈ నెల 29న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక జరగనుంది. డైరెక్టర్లతో పాటు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు ఉండే అవకాశం ఉండగా ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. అన్ని పోస్టులు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడే అవకాశం ఉంది. logo