శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 24, 2020 , 02:10:07

నేటి నుంచి పట్టణ ప్రగతి

నేటి నుంచి పట్టణ ప్రగతి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో నేటి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. కార్యక్రమం అమలుకు మున్సిపల్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలో సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు నెల రోజుల పాటు, జనవరి 2 నుంచి 11వరకు పదిరోజుల పాటు రెండు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులను చేపట్టడం, పారిశుద్యం, పచ్చదనం, నిధుల సమీకరణ, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పల్లె ప్రగతి కార్యక్రమం రెండు విడతలుగా నిర్వహించడంతో గ్రామాల్లో సరికొత్త మార్పులు వచ్చాయి. పల్లెలు ప్రగతి బాటలో ప్రయాణించడంతో ఇదే తరహా కార్యక్రమాన్ని మున్సిపాలిటీల్లోనూ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు పదిరోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పట్టణ ప్రగతిపై సీఎం ఇప్పటికే జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీలు ఇటీవల అవగాహన సమావేశం నిర్వహించి, సలహాలు,సూచనలు చేశారు.

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి 

జిల్లాలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మూడు మున్సిపాలిటీలుండగా.. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పది రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. నిర్మల్‌లో 42 వార్డులుండగా.. 33వార్డులు మురికి ప్రాంతాలున్నాయి. భైంసాలో 26వార్డులు ఉండగా.. 8 మురుగు ప్రాంతాలు ఉన్నాయి. నిర్మల్‌లో 195మంది, భైంసాలో 92మంది, ఖానాపూర్‌లో 19 మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. పట్టణాల్లోని అన్ని వార్డుల్లో మురికి కాలువలు శుభ్రం చేయడం, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చడం, ఖాళీ ప్రాంతాల్లో మురికి నీరు, చెత్తచెదారం, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతారు. స్థానికులకు వీటిపై అవగాహన కల్పిస్తారు. వంగిపోయిన విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరి చేస్తారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు ఇప్పటికే పెట్టిన మొక్కలను సంరక్షించే చర్యలు చేపడుతారు. తాగునీటి సరఫరాలో మరింత స్వచ్చత కోసం చర్యలు తీసుకుంటారు.

ప్రతి వార్డులో నాలుగు కమిటీలు

పట్టణాల్లో మురికి వాడలతో పాటు కొన్ని ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకపోయి ఉంది. మురికి కాలువల్లో పూడిక నిండిపోయింది. చాలాచోట్ల మురికి కాలువల మధ్య నుంచి తాగునీటి పైపులు ఉన్నాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు వంగిపోగా.. మరికొన్నిచోట్ల విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఆయా కాలనీలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ప్రతి వార్డులో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 15మంది వరకు సభ్యులుండగా.. ఈ కార్యక్రమం అమలులో వీరే కీలకపాత్ర పోషించనున్నారు. మున్సిపల్‌ కమిషనర్లతో పాటు చైర్మన్లు, వార్డుల స్థానిక కౌన్సిలర్లు, ఇతర మున్సిపల్‌ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పదిరోజుల పాటు నిర్వహించే ఈ పట్టణ ప్రగతిపై మూడు మున్సిపాలిటీల నుంచి జిల్లా కలెక్టర్‌కు ప్రతిరోజు నివేదిక పంపిస్తారు. రోజువారీగా వచ్చిన సమస్యల గుర్తింపు, పరిష్కారం, ఇతరత్రా వివరాలను ప్రతిరోజు నివేదిక రూపంలో పంపుతారు. తొలిరోజైన సోమవారం ఆయా వార్డులో సమావేశం నిర్వహిస్తారు. వార్డుల వారీగా, మున్సిపాలిటీల వారీగా చేపట్టవలసిన పనులు, సమస్యల పరిష్కారంపై చర్చిస్తారు. వార్షిక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. హరితహారం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడుతారు. logo