సోమవారం 30 మార్చి 2020
Nirmal - Feb 22, 2020 , 04:06:37

పల్లెలకు మహర్దశ

పల్లెలకు మహర్దశ

నిర్మల్‌ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రగతి, పల్లె ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలైన సీసీ రోడ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలోని 396 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో 240 గ్రామ పంచాయతీలుండగా ప్రభు త్వం 156 కొత్త గ్రామపంచాయతీల  ను ఏర్పాటు చేసింది. ఈ గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ ప థకం ద్వారా పంచాయతీరాజ్‌శాఖ సమన్వయంతో సీసీరోడ్లను నిర్మించనుంది. వచ్చే నెల 31లోపు పూర్తి చేసేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. జిల్లాలో మొత్తం మూడు నియోజకవర్గాల పరిధిలోని 396 గ్రామపంచాయతీలుండగా రూ.16కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు.నిర్మల్‌ నియోజకవర్గానికి రూ .7కోట్లు, ఖానాపూర్‌ నియోజకవర్గానికి రూ. 4కోట్లు, ముథోల్‌ నియోజకవర్గానికి రూ. 5కోట్ల నిధులను కేటాయించారు. నిర్మల్‌ నియోజకవర్గంలో మొత్తం 231 సీసీ రోడ్లను ఏర్పాటు చేయనుండగా, ఖా నాపూర్‌ నియోజకవర్గంలో 83, ముథోల్‌ నియోజకవర్గంలో 132 సీసీ రోడ్లను ఏర్పాటు చేసేందుకు పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతిపాదనలు పం పారు. జిల్లాలో ప్రతి సంవత్సరం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ. 100 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31లోపు పూర్తవుతున్న నేపథ్యంలో అన్ని గ్రామపంచాయతీల్లో సీసీరోడ్లు లేని కాలనీలను గుర్తించి, నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. 


కొత్త జీపీల్లో నిర్మాణాలకు ప్రాధాన్యం

ముఖ్యంగా జిల్లాలో 500 గిరిజన గూడెలు, లంబాడీ తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త గ్రామ పంచాయతీల్లో ఉన్న కాలనీల్లో సీసీ రోడ్లు లేకపోవడంతో అక్కడ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్ర గతి, పల్లె ప్రణాళిక కార్య క్రమాల్లో శ్మశాన వాటికల నిర్మాణం, చెత్త డంపింగ్‌ల ఏర్పాటు, గ్రామానికో నర్సరీ వంటి కార్యక్రమాలను విజయవంతం చేయగా, ఇప్పుడు సీసీ రోడ్లు నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు లేకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మార్చి 31లోపు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే మండలంలోని ఆయా గ్రామాల్లో సర్వే జరిపిన అధికారులు ఏ గ్రామంలో సీసీ రోడ్లు అవసరమో గుర్తించి అక్కడే నిర్మించే విధంగా ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో ప్రాధాన్యం ఇచ్చారు. 


logo