సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 22, 2020 , 03:06:36

అదనపు భత్యం కూలీల హర్షం

అదనపు భత్యం  కూలీల హర్షం

వేసవిలో ఉపాధి హామీ కూలీలకు అదనపు భత్యంఈ నెల నుంచే అమలులోకి.. ఫిబ్రవరిలో 20, మార్చిలో 25, ఏప్రిల్‌, మేలో 30శాతం పెంపుపెరగనున్న కూలీల సంఖ్య ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వేసవిలో ఉపాధి హామీ కూలీలకు అదనపు భత్యంఈ నెల నుంచే అమలులోకి..  ఫిబ్రవరిలో 20, మార్చిలో 25, ఏప్రిల్‌, మేలో 30శాతం పెంపుపెరగనున్న కూలీల సంఖ్య 

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం


ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూలీలకు ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వేసవిలో ఉపాధి పనులు చేసే కూలీలకు అదనపు భత్యం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. సాధ్యమైనంత వరకు ఉదయం వేళ పనులకు వెళ్లి ఎండ దెబ్బ తగలకుండా ఇంటికి వచ్చేలా వెసలుబాటు కూడా కల్పిస్తున్నది. గతంలో మార్చి నుంచి అదనపు భత్యం ఇవ్వగా, ఈసారి ఫిబ్రవరి నుంచే అమలు చేస్తుండడం విశేషం. 

-సారంగాపూర్‌


సారంగాపూర్‌: మండే వేసవిలో రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు ఉపశనం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. వేసవిలో ఉపాధి పనులు చేసే కూలీలకు అదనపు భత్యం చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను విడుదల చేసింది. పెరిగిన అదనపు వేతనాలతో ఈ నెల నుంచి జూన్‌ వరకూ వర్తింపజేయాలని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఉదయం వేళ పనులకు వెళ్లి ఎండ దెబ్బ తగలకుండా ఇంటికి వచ్చేలా వెసలుబాటు కూడా కల్పిస్తున్నది. గతంలో మార్చి నుంచి అదనపు భత్యం ఇచ్చేవారు. దీనిని ఈసారి ఫిబ్రవరి నుంచే అమలు చేస్తుండడం విశేషం. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్‌లో, మే నెలల్లో 30శాతం, జూన్‌లో 20శాతం అదనంగా భత్యాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఆదేశాల ఆధారంగానే కూలీలకు భత్యం చెల్లించనున్నారు. 


జిల్లాలోని 18 మండలాల్లో 1,55,645 జాబ్‌కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,61,923 మంది కూలీలు ఉండగా 11,029 కూలీలు ఉపాధిహామీ పనులు చేస్తున్నారు. కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండడంతో ఉపాధి పనుల్లో పాల్గొంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ఫిబ్రవరి నెలాఖరుకు వ్యవసాయ పనులు ముగియనున్న తరుణంలో మార్చి నుంచి వీరి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొనే వారికి ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు చేసిన పనికన్నా అదనపు వేతనం చెల్లిస్తారు. వేసవి కాలంలో చేపట్టే ఉపాధి పనుల్లో కష్టం ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో అదనపు భత్యం చెల్లింపు ప్రారంభించారు. క్రమేణా ఈ చెల్లింపు పెరుగుతూ వస్తున్నది. సాధారణంగా వేసవిలో పంటకాలువలు, రహదారుల నిర్మాణం, పూడికతీత, చెరువుల కట్టల బలోపేతం, పంటకాలువలు, ఇంకుడు గుంతల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు, హరితహారంలో మొక్కలు నాటడం, గ్రీన్‌జోన్‌, భూమి చదును తదితర పనుల్లో కూలీలు పాల్గొంటారు. గరిష్ట వేతనం లభించేలా ఫీల్ట్‌ అసిస్టెంట్లు పనులు కల్పించాలి. 


దరఖాస్తు చేసుకున్న వారందరికీ పని...

ఉపాధి పనుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ జాబ్‌కార్డు మంజూరు చేసి పనులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే గ్రామాల్లో గుర్తించిన పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చాయి. అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా పనులు నిర్వహించాలని సూచించారు. వేసవిలో వేతనదారుల సంఖ్య పెంచేందుకు, పూర్తి పనిదినాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


కూలీలకు ప్రయోజనం 

ఉపాధి కూలీలకు ప్రయోజనం చేకూరేలా వేసవిలో కూలీకి అదనంగా 20-30 శాతం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ఒక్కో కూలీకి రోజుకు రూ. 100 వరకు పని చేస్తే అదనంగా రూ. 20 పొందుతారు. ఈ అవకాశాన్ని ఉపాధి కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. ఎండదెబ్బ తగలకుండా ఉదయాన్నే వెళ్లి మధ్యాహ్నం వరకు పనులు ముగించుకొని రావాలి. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు  వేసవిలో కూలీల సంఖ్య పెంచాలని ఆదేశించాం.

-వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవోlogo