శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 21, 2020 , 05:43:28

ఇక ‘డీసీసీబీ’ సందడి

ఇక ‘డీసీసీబీ’ సందడి

సహకారశాఖలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. పీఏసీఎస్‌ పాలకవర్గాల ఎన్నికలు పూర్తవగా తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికపై రాష్ట్ర సహకార శాఖ అధికారులు దృష్టి పెట్టారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటి ఇందకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: సహకారశాఖలో మరో కీలక ఘట్టానికి తెర లేచింది. పీఏసీఎస్‌ పాలకవర్గాల ఎన్నికలు పూర్తవగా తాజాగా డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల ఎన్నికపై రాష్ట్ర సహకార శాఖ అధికారులు దృష్టి పెట్టారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటి ఇందకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని సహకారశాఖ అధికారులు డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేశారు.  ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే సహకార శాఖ అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని డీసీసీబీలో 20మంది డైరెక్టర్లు, డీసీఎంఎస్‌లో పది మంది డైరెక్టర్లు ఉంటారు. డీసీసీబీలో 16 మంది డైరెక్టర్లను జిల్లాలోని 77మంది పీఏసీఎస్‌ చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లో ఆరు గురు డైరెక్టర్లను కూడా వీరే ఎన్నుకుంటారు. డీసీసీబీలో నలుగురిని డీసీఎంఎస్‌లో నలుగురిని, బి గ్రేడ్‌ సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల కన్నా ముందుగా 77 మంది ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు 16మంది  తమలో నుంచి  ఏ గ్రూపు నుంచి 16 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరిలో ఎస్సీ కేటగిరీ నుంచి 3, ఎస్టీ కేటగిరీ నుంచి 1,బీసీ కేటగిరీ నుంచి 2, ఓపెన్‌ కేటగిరీ నుంచి 10 మంది డైరెక్టర్లుగా ఉంటారు. దీంతో పాటు మరో నలుగురు బీ గ్రూపునకు సంబంధించిన వ్యవసాయేతర సహకారం సంఘాల నుంచి నలుగురు డైరెక్టర్లకు ఎన్నిక జరుగుతుంది. ఎస్సీ నుంచి ఒకరు, ఎస్టీ నుంచి ఒకరు, బీసీ నుంచి ఒకరు, జనరల్‌ ఒకరు చొప్పున నలుగురు బి గ్రేడ్‌ సంఘాల చైర్మన్లు ఎన్నుకుంటారు.  


డీసీఎంఎస్‌లో 10 మంది డైరెక్టర్ల ఎన్నిక

మొత్తం 20 మంది డైరెక్టర్‌లను ఎన్నుకున్న తర్వాత డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక జరుగుతుంది. డీసీఎంఎస్‌లో 10 మంది డైరెక్టర్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఏ గ్రూపునకు సంబంధించి ఆరు గురు.. ఇందులో ఎస్సీ ఒకరు, ఎస్టీ ఒకరు, బీసీ ఒకరు, జనరల్‌ నుంచి ముగ్గురు డైరెక్టర్లను ఏ గ్రూప్‌ సభ్యులు ఎన్నుకుంటారు. నలుగురు డైరెక్టర్లను బి గ్రూప్‌ సభ్యులు ఎన్నుకోగా.. ఇందులో ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ఇద్దరు జనరల్‌ నుంచి ఎన్నుకుంటారు. ఈ లెక్కన డీసీసీబీకి 20మంది ఎన్నికవుతుండగా.. ఇందులో 16మంది ఏ గ్రూపు నుంచి నలుగురు బి గ్రూపు నుంచి ఎన్నికవుతారు. డీసీఎంఎస్‌కు పది మంది ఎన్నికవుతుండగా.. ఏ గ్రూపు నుంచి ఆరుగురు, బి గ్రూపు నుంచి నలుగురు ఎన్నికవుతారు. ఎన్నికల్లో నిలబడే వారికి ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. వీరికి రిజర్వేషన్ల వారీగా రంగుల బ్యాలెట్‌ పత్రాలను కేటాయించారు. ఎస్సీ కేటగిరి నుంచి పోటీ చేసే వారికి పింక్‌ రంగు బ్యాలెట్‌, ఎస్టీ నుంచి పోటీ చేసే వారికి లైట్‌ బ్లూ, బీసీ వారికి లైట్‌ గ్రీన్‌, జనరల్‌ వారికి వైట్‌ కలర్‌ బ్యాలెట్‌ ఉంటుంది. డైరెక్టర్‌ పోస్టులకు ఒకరికన్నా ఎక్కువ మంది వివిధ కేటగిరిల్లో నామినేషన్లు వేస్తే ఎన్నిక ఉంటుంది. రిజర్వేషన్ల ప్రకారం ఉన్న డైరెక్టర్‌ స్థానాలకు అంతే సంఖ్యలో నామినేషన్లు వేస్తే ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు. ఆయా కేటగిరిలో డైరెక్టర్లకన్నా ఎక్కువ మంది పోటీ చేస్తే ఎన్నిక ఉంటుంది. 


ఈ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారిని నియమించింది. ఈ నెల 28న డైరెక్టర్ల ఎన్నిక ఉండగా.. రహస్య బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానం ఉంటుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. 29న డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలకు కూడా రహస్య బ్యాలెట్‌ విధానంలోనే ఉంటుంది. చైర్మన్‌, వైస్‌ చౌర్మన్‌ పదవులకు కూడా ఒకరు ప్రతిపాదన, మరొకరు బలపర్చాల్సి ఉంటుంది. జిల్లాలో 77 పీఏసీఎస్‌లుండగా.. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు 71మంది సభ్యులు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు ఏ గ్రూపు సభ్యులు ఉన్నారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్‌ పాలకవర్గాల డైరెక్టర్లు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు పూర్తి మెజార్టీ ఉండడంతో ఈ పాలకవర్గాల ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగే అవకాశం ఉంది. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల అభిష్టాం మేరకే టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. 



logo