ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 21, 2020 , 05:40:35

శివపూజకు వేళాయె..

 శివపూజకు వేళాయె..

మహా శివరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు.

  • ముస్తాబైన ఆలయాలు
  • కొనసాగనున్న అభిషేకాలు, ప్రత్యేక పూజలు
  • పలు ఆలయాల్లో శివపార్వతుల కల్యాణం
  • జాగరణకు ప్రత్యేక ఏర్పాట్లు

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : మహా శివరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. జిల్లా కేంద్రంలోని అతిపురాతన మైన వెంకటాద్రి పేట్‌లోని ఓంకారేశ్వర ఆలయం, నగరేశ్వరవాడలోని శివాలయం,బ్రహ్మపురిలోని శివాలయం, హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలోని శివాలయం, నగరాజ్‌ నగర్‌లోని ఉమామహేశ్వర ఆలయం, శాంతినగర్‌ హౌసింగ్‌ బోర్డులోని శివాలయం, గాజుల్‌పేట్‌లోని సంతోషిమాత ఆలయంతో పాటు ఇతర ఆలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక దర్శనాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాల వద్ద పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ కమిషనర్‌ బాలకృష్ణ సిబ్బందిని ఆదేశించారు.


ఖానాపూర్‌లో..ముస్తాబైన ఆలయలు

 ఖానాపూర్‌ టౌన్‌: పట్టణంలోని అన్ని శివాలయాలు మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. ఖానాపూర్‌ సమీపంలోని ఉత్తరవాహిణి గౌతమి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. గోదావరి జలాలను తీసుకెళ్లేందుకు చుట్టూపక్కల మండలాల నుంచి కూడా శివరాత్రి పర్వదినాన వస్తుంటారు. గోదావరి నది తీరాన ఉన్న గంగాగౌరి ఆలయం, శ్రీరాంనగర్‌లో ఉన్న మహాదేవ అన్నపూర్ణ ఆలయం, సాయినగర్‌లోని శ్రీ భక్తా మార్కెండేయ ఈశ్వరాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గోదావరి పుణ్య స్నానానికి వచ్చే భక్తులు ఈ ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. గోదావరిలో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించేందుకు మున్సిపల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.  


దస్తురాబాద్‌ : మండలంలోని గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది. మహాశివరాత్రి జాతర, శివపార్వతుల కల్యాణం, జాగరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా శనివారం  కుంకుమపూజ, ఆదివారం సామూహిక హోమం, అన్నపూజ, మల్లన్న, పోచమ్మ బోనాల కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ అర్చకులు సిడం లక్ష్మణస్వామి తెలిపారు. ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారన్నారు.

21న జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతులు అందజేస్తామన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే వారు 9493749794, 9618763004 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 


శ్రీ నాగుస్వామి ఆలయం

మండలంలోని మున్యాల గొండు గూడెం శ్రీ నాగు స్వామి ఆలయం మహాశివరాత్రి పర్వదినానికి ముస్తాబైంది. శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు.

మహాశివరాత్రి ఉత్సవాలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని ఆలయ అర్చకులు నాగుస్వామి తెలిపారు. జాతర  సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని, పాల్గొనే వారు 6304756830, 9391495356 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 


రంగపేటలో..

ఖానాపూర్‌ రూరల్‌: మండలంలోని రంగపేట శ్రీరాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామివారి ఉత్సవ మూర్తిని గురువారం ఖానాపూర్‌ గోదావరి తీరానికి తీసుకొని వచ్చారు. అనంతరం పుణ్యస్నానాలు చేయించి పూజలు చేశారు. ఉత్సవమూర్తిని రంగపేట గుట్టపై వెలసిన ఆలయానికి తీసుకొని వెళ్లి శివరాత్రి భక్తుల దర్శనం కోసం ముస్తాబుచేశారు. ఆలయ పూజారి శంకరయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మండలంలోని తర్లాపాడు ఓంకారేశ్వర ఆలయం, దిలావర్‌పూర్‌ గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయం, పాతయెల్లాపూర్‌లోని పురాతనమైన శ్రీఅన్నపూర్ణ మహాదేవాలయాలు శివరాత్రి వేడులకు ముస్తాబయ్యాయి. రంగులు వేయించి విద్యుద్దీపాలతో అలంకరించారు. పశుపతినాథ్‌ ఆలయంలో..

ముథోల్‌: ముథోల్‌ లోని శ్రీపశుపతినాథ్‌ శివాలయంలో శుక్రవారం వేకువజామున నుంచి ప్రత్యేక అభిషేకాలతోపాటు పూజా కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడికి మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారని పేర్కొన్నారు.logo