బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 20, 2020 , 00:26:20

సేవాలాల్‌ బాటలో నడవాలీ

 సేవాలాల్‌ బాటలో నడవాలీనిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : సమాజశ్రేయస్సు కోసం బంజారాల ఆరాధ్య గురువు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో బుధవారం ప్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించిన సేవాలాల్‌ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంత్‌సేవాలాల్‌, జగదాంబ దేవి విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి గిరిజన గ్రామంలో సంత్‌ సేవాలాల్‌, జగదాంబ దేవి ఆలయాలను నిర్మించడం జరిగిందని, ధూపదీప నైవేద్యాలకు రూ.6000 అందిస్తున్నామని అన్నారు. జిల్లాలో ఎఫ్‌వోఆర్‌ కింద 75 శాతం గిరిజనులకు పట్టాలు ఇచ్చామని, మిగిలిన పోడు వ్యవసాయ భూములకు త్వరలో పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మానవుని మనుగడకు, జీవనోపాధికి అడవులే జీవనాధారమని అడవులను రక్షించుకోవాలని అన్నారు. గిరిజనులు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ సంస్కృతీసంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం కులమతాలతో సంబంధం లేకుండా మహనీయుల జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని అన్నారు. 


కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ మాట్లాడుతూ సంత్‌సేవాలాల్‌ సూచనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. అడవులలో ఉన్న చెట్లను, జంతువులను పూజించి వాటిని సంరక్షించాని, మద్యం, మత్తుపానీయాల జోలికి వెళ్లకుండా సన్మార్గంలో నడుచుకో వాలని సూచించారు. గిరిజన సంక్షేమ భవన్‌కు స్థలం కేటాయించాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌  కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ గతంలో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌కు విన్నవించగా జయంతి వేడుకల్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించడం అభినందనీయమని అన్నారు. ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అనంతరం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిని గిరిజన నాయకులు ఘనం గా సన్మానించారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షుడు అమర్‌సింగ్‌ తిలావత్‌, రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంనాయక్‌, రామ్‌ కిషన్‌రెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో ప్రసూనాంబ, డీఈఈ తుకారాం, భుక్య రమేశ్‌, ఎంపీపీలు, సర్పంచులు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.logo
>>>>>>