బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 20, 2020 , 00:24:20

ప్రణాళికతో ముందుకెళ్లాలి

ప్రణాళికతో ముందుకెళ్లాలి


నిర్మల్‌ టౌన్‌:పల్లెల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని, ఇందుకోసం ప్రభుత్వం  పల్లె ప్రగతి, పల్లెప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని సాగర్‌ కన్వెన్షన్‌హాలులో బుధవారం జిల్లా పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి గూడెంను, తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే  ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తూ పల్లెల అభివృద్ధ్దే లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నదన్నారు. రూ.339 కోట్లు  పల్లె ప్రగతి, పల్లె ప్రణాళిక కార్యక్రమానికి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్‌ సమస్యలు, గ్రామానికి ఒక నర్సరీ, చెత్త డంపింగ్‌ యార్డు, నిర్వహణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. 


పెద్ద  సంఖ్యలో గ్రామ కార్యదర్శుల పోస్టులను మంజూరు చేయడం జరిగిందన్నారు. పల్లెప్రగతి, పల్లెప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులకు నాలుగు విడతలుగా రూ.36 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి దానికి అనుగుణంగా పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో మంత్రులుగా తాము ఆచరిస్తున్నామని ప్రజాప్రతినిధులు కూడా అందులో భాగస్వాములు కావాల్సిందేనని అన్నారు.  పల్లె ప్రగతి, పల్లె ప్రణాళికతో పూర్తిగా మార్పు వచ్చిందని పచ్చదనం, పరిశుభ్రతతో పల్లెలు ఆరోగ్యవాతావరణంలో ఉన్నాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామాల్లో థర్డ్‌లైన్‌ విద్యుత్‌ పనులు పూర్తి చేయడం జరిగిందని, విద్యుత్‌ వినియోగానికి సంబంధించిన బిల్లులు గ్రామ పంచాయతీలు చెల్లించాలన్నారు. అభివృద్ధి పనులపై గ్రామసభలు నిర్వహించుకొని బడ్జెట్‌ను కేటాయించుకోవాలన్నారు. బడ్జెట్‌లో ప్రజాప్రాధాన్యత పనులకే అవకాశం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో అక్షరాస్యత పెంపునకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. 


మార్పు మీతోనే సాధ్యం

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తున్నదని, మార్పు గ్రామ సర్పంచుతోనే సాధ్యమవుతుందని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ప్రజాప్రతినిధులను అధికారులను కోరారు. ముఖ్యంగా ఐదు అంశాలే ఎజెండాగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నదన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, శ్మశానవాటికల నిర్మాణం, చెత్త డంపింగ్‌ల ఏర్పాటు, గ్రామంలో మెరుగైన విద్యుత్‌, అక్షరాస్యత పెంపు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. సర్పంచులు బాధ్యతగా పనిచేస్తూ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. 


ప్రత్యేక తెలంగాణ 

ఆవిర్భావంతోనే పల్లెల్లో మార్పు

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావంతోనే అనుబంధ గ్రామాలు సైతం గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం నెలనెలా నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ఆ నిధులతో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా తండాలు, గిరిజన గూడెల్లో హరితహారం, చెత్త డంపింగ్‌ల ఏర్పాటు తదితర పనులతో ప్రజల జీవన విధానంలో సైతం మార్పు వచ్చిందన్నారు.


ముఖ్యమంత్రి సంకల్పం గొప్పది

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ కార్యక్రమం నిర్వహించిన ప్రజలందరూ హర్షిస్తున్నారని, ఆయన సంకల్ప గొప్పదని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. పల్లెప్రగతి, పల్లె ప్రణాళిక కార్యక్రమాలు ఆయన సంకల్పానికి నిదర్శనమని అన్నారు. గ్రామాలకు సర్పంచులే రాజులని, గ్రామంలో ఏ సమస్య ఉన్నా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వపరంగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించుకొని పల్లెలను అభివృద్ధి బాటలో నడుపుతామని పిలుపునిచ్చారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహిస్తున్నదన్నారు. 


సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి

సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనాలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు నూతన జిల్ల్లాలు, నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారని అన్నారు. మంత్రి సహకారంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఎఫ్‌వో సుధాం, డీపీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌,  డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, జిల్లా  అధికారులు వెంకటేశ్వర్‌రావు, కిషన్‌కుమార్‌, వసంత్‌రావు, శ్రీనివాస్‌రావు, సుదర్శన్‌రావు, మురళి, రాజగోపాల్‌, దేవేందర్‌, కోటేశ్వర్‌రావు, రమేశ్‌, శరత్‌బాబు, గఫూర్‌, నర్సింహరెడ్డి, బాలకృష్ణ, శ్రీకళ, ప్రణీత, ఆర్డీవోలు ప్రసూనాంబ, రాజు తదితరులు పాల్గొన్నారు. logo