సోమవారం 06 ఏప్రిల్ 2020
Nirmal - Feb 19, 2020 , 03:02:22

పాలనలో ప్రత్యేకత

పాలనలో ప్రత్యేకత

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: పల్లెలతో పాటు పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఈనెల 24 నుంచి పట్టణ ప్రగతి నిర్వహణకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనంతో పాటు స్వయం సమృద్ధి చెందేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 396 గ్రామపంచాయతీల్లో రెండు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించింది. గతేడాది సెప్టెంబరు 6 నుంచి అక్టోబరు 5 వరకు 30రోజుల ప్రత్యేక పల్లె ప్రణాళిక నిర్వహించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పల్లెలను స్వయం సమృద్ధి కేంద్రాలుగా మార్చేందుకు దృష్టి సారించారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. జనవరి 2 నుంచి 11 వరకు రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించారు. మొదటి విడతలో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. పల్లెల్లో మరింత అభివృద్ధి చేసేందుకు దృష్టి పెట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, హరితహారం, ట్రాక్టర్ల కొనుగోలు, డంపింగ్‌యార్డు, శ్మశాన వాటికల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం నుంచి ప్రతినెలా జిల్లాకు రూ. 9కోట్ల చొప్పున నిధులను కూడా మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతల్లో రూ. 36కోట్ల నిధులు జిల్లాలోని ఆయా గ్రామాలకు విడుదల చేశారు. ఈ నిధులతో పల్లెలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనంపై దృష్టి పెట్టారు. మరోవైపు ఈనెల 20లోపు ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించి రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 140కి పైగా ట్రాక్టర్లు కొనుగోలు చేయగా, మిగతా వాటికి తీర్మానాలు చేసి బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. 

నేడు జిల్లా స్థాయి పంచాయతీ సమ్మేళనం

రెండు విడతలుగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించగా తాజాగా దీనిపై సమీక్షకు సిద్ధమవుతున్నారు. నేడు జిల్లా కేంద్రంలోని సాగర్‌ కన్వెన్షన్‌ హాలులో జిల్లాస్థాయి పంచాయతీ సమ్మేళనం నిర్వహించనున్నారు.పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల విధులు, బాధ్యతలు, నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. పది రోజుల సమయమిచ్చి ఆ తర్వాత పల్లెల్లో ప్రత్యేక ఫ్లయింగ్‌ స్కాడ్‌ల ద్వారా తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు  జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గడ్డిగారి విఠల్‌రెడ్డి, అజ్మీరా రేఖానాయక్‌, అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావుతో పాటు జిల్లాస్థాయి అధికారులు, జిల్లాలోని ఆర్డీవోలు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు హాజరు కానున్నారు. జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరుకానున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం- 2018అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఉదయం 11గంటలకు ఈ పంచాయతీ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి, రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో సాధించిన ప్రగతిపై ఈ సమ్మేళనంలో వివరంగా చర్చించనున్నారు. 

పట్టణ ప్రగతిపై ప్రత్యేక సమావేశం

మరోవైపు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈనెల 24 నుంచి నిర్వహించేందుకు నిర్ణయించారు. ఆర్‌కే కన్వెన్షన్‌హాలులో పట్టణ ప్రగతిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, ఎంపీలు, అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు, మున్సిపల్‌ కమిషనర్లు, కౌన్సిలర్లు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన మున్సిపల్‌ చట్టంపై వీరికి అవగాహన కల్పిస్తారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతిపై దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, ఇప్పటికే నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో నలుగురు చొప్పున సభ్యులను తీసుకున్నారు. మరోవైపు ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగనుంది. 


logo